భార్యా భర్తల మధ్య కోపతాపాలు సహజం. ఒకరిపై ఒకరు కోపగించుకోవడం, గొడవ పడడం, అరుచుకోవడం, అలగడం, తిరిగి కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకోవడం కూడా సహజమే. కానీ కొందరు కోపం వస్తే గొడవ పడకుండా భాగస్వామితో మాట్లాడటం మానేస్తారు. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అంతేకాదు ఇలాంటి ధోరణి ఎదుటి వారిని డిప్రెషన్‌లోకి కూడా తీసుకెళుతుంది. భార్య చేసే పనులు నచ్చడం లేదని ఏడాదిగా ఆమెతో మాట్లాడడమే మానేశాడు ఓ భర్త. ఆ బాధ భరించలేక ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సలహా కోసం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)కు వచ్చింది.
నవ్యకు దాదాపు 34 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త కిషోర్‌కు 40 ఏండ్లు. వీరిది పెద్దలు కుదిర్చిన పెండ్లి. ఇద్దరు పిల్లలు. పాపకు 12 ఏండ్లు, బాబుకు ఎనిమిదేండ్లు. నవ్య ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. అది కూడా గత మూడేండ్ల నుండి. అంతకు ముందు ఇంట్లోనే ఉండేది. భర్త కిషోర్ ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అత్తమామలు ఊళ్లో వ్యవసాయం చేస్తారు. వీళ్లు మాత్రమే సిటీలో ఉంటారు. ఇద్దరూ పెండ్లయిన ఏడాది వరకు బాగానే ఉన్నారు. పిల్లల కోసం ఐదేండ్లు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాతనే పిల్లలు పుట్టారు. కిషోర్ నవ్యతో మొదటి నుండి పెద్దగా మాట్లాడడు. అదే ఇతరులతో అయితే ఎంతో సరదాగా మాట్లాడతాడు. ప్రతి విషయంలో భార్యను మాత్రం తప్పుపడతాడు.
ఇద్దరి మద్య ఎప్పుడైనా గొడవ జరిగితే నవ్యతో అస్సలు మాట్లాడడు. మళ్లీ వారం, పది రోజుల తర్వాతే మాట్లాడేవాడు. తనేం మాట్లాడినా కిషోర్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని నవ్య కూడా అతనితో మాట్లాడడం తగ్గించేసింది.
నవ్య ఏమైనా చెప్పాలంటే ఓ లెటర్ రాసి పెట్టేది. వాటికి కూడా కిషోర్ సమాధానం ఇచ్చేవాడు కాదు. ఫోన్లో మెసేజ్ పెట్టినా చూడడు. ఇంట్లో ఓ వస్తువులా ఉండాలి. ఆమె స్కూల్‌కి వెళ్లేటపుడు చెబితే సమాధానం ఇవ్వడు. చెప్పకుండా వెళితే ‘అలా ఎలా వెళతావు’ అని గోల చేస్తాడు. ఏడాది నుండి అయితే నవ్యతో అసలు మాట్లాడటమే మానేశాడు. అతనే కాదు పండుగకు ఊరికి వెళితే అత్తమామలు కూడా ఆమెతో మాట్లాడడం లేదు. ఆమె వంట చేస్తే తినరు. పిల్లలు కూడా చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లరు. ఇలా ఇంట్లో నవ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సిటీలో అయితే ఆమెకు ఏమైనా అవసరమైతే షాపుకు వెళ్లి తెచ్చుకుంటుంది. ఊరికి వెళ్లినపుడు ఎవరిని అడగాలో కూడా అర్థమయ్యేది కాదు. ‘ఎందుకు ఇలా ఉన్నారు’ అని అత్తమామలను అడిగితే వారి నుండి కూడా ఎలాంటి సమాధానం లేదు. పండగ తర్వాత సిటీకి తిరిగి వచ్చారు. కిషోర్‌లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పైగా భార్యపై కోపం పిల్లలపై చూపించేవాడు. ఒకసారి నవ్యకు జ్వరం వస్తే వాళ్ల అమ్మ వచ్చి నాలుగు రోజులు ఉంచుకొని పంపిస్తానంది. కానీ కిషోర్ మాత్రం చూద్దాంలే అన్నాడు. దాంతో ఆమె నవ్య అత్తకు ఫోన్ చేసి అడిగితే ఆమె కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు.
దాంతో నవ్య ఓ లెటర్ రాసి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లింది. కానీ కిషోర్ తనతో ఎందుకు మాట్లాడ డం లేదో తెలియక లోలోపలే మదన పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఐద్వా అదాలత్‌కు వచ్చి సాయం చేయాల్సిందిగా కోరింది. మేము కిషోర్ కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడితే వాళ్ల అత్తమామలు ‘వాళ్లిద్దరూ మంచిగా ఉంటే మాకు అదే చాలు. కానీ ఆమెకు అత్తమామలనే గౌరవం లేదు. ఇంట్లో ఏమైనా జరిగితే మాకు చెప్పాలి కదా! అలా కాకుండా వాళ్ల అమ్మానాన్నలకు చెబుతుంది. పెండ్లి జరిగి ఇన్నేండ్లయినా ఇంకా అమ్మానాన్న అంటూ ఉంటే ఎలా? ఒకసారి కిషోర్ ఆరోగ్యం బాగోలేదు. అలాంటపుడు చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ కోపంతోనే మేము ఆమెతో మాట్లాడడం మానేశాము’ అన్నారు. దానికి మేము ‘ఆమె వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అంతేకానీ మాట్లాడకుండా ఉంటే ఎలా? ఆమెకు విషయం ఎలా తెలుస్తుంది. ఇలా ఎవ్వరూ ఆమెతో మాట్లాడకుండా ఉంటే మీ కొడుకూ, కోడలు సంతోషంగా ఎలా ఉంటారు. ఆ ఇంట్లో ఆమె ఎలా ఉండగలుగుతుంది? ఈ ప్రభావం పిల్లలపైన పడదా? ఇది సరైనది కాదు. ఇద్దరి మధ్య ఏమైనా సమస్య వస్తే మీరే పరిష్కరించాలి’ అని చెప్పాము.
కిషోర్‌తో మాట్లాడితే ‘నేనేం చెప్పినా ఆమె వినిపించుకోదు. అసలు పట్టించుకోదు. నేను చెప్పి చెప్పి విసిగిపోయాను. అయినా ఇన్ని రోజులు ఆమెతో మాట్లాడకుండా ఎలా ఉంటాను, ఆమె చెప్పింది మీరు నమ్మేశారు’ అంటే నవ్య దానికి ‘కిషోర్ నాతో మాట్లాడి ఏడాది అవుతుంది. అంతకు ముందు మూడేండ్ల నుండి నేను ఏం అడిగినా సరిగా సమాధానం చెప్పడు. ఇక ఏడాది నుండి అయితే అసలే మాట్లాడడం లేదు. నన్ను అస్సలు ఓ మనిషిగానే చూడడం లేదు’ అంటూ బాధపడింది. వెంటనే కిషోర్ మాట్లాడుతూ ‘ఆమెకసలు ఇల్లు నీటుగా ఉంచడం రాదు, ఇంటి ముందు చెప్పులు చిందర వందరగా ఉంచుతుంది. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోదు. బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడే పెడుతుంది. ఇల్లు అలా చూడగానే నాకే తెలియకుండా చిరాకు, కోపం వచ్చేస్తాయి. ఆమెను ఏమీ అనలేక ఆ కోపం పిల్లలపై చూపిస్తున్నాను’ అన్నాడు. దానికి నవ్య ‘నేనేమో ఉదయం ఎనిమిది గంటలకు వెళితే సాయంత్రం ఐదు గంటలకు వస్తాను. వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లల ఫీజులు, ఖర్చులు పెరిగిపోవడం వల్ల నేను కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. పిల్లల ఫీజులు పోను 12 వేలు చేతికి వస్తాయి. దాంతో ఇంట్లోకి కావల్సిన సరకులు తెస్తున్నాను. కిషోర్ 9 గంటలకు ఆఫీసుకు వెళతాడు. టిఫిన్, లంచ్ అన్నీ తన కోసం డేబుల్‌పైన పెట్టి వెళతాను. అంతకు మించి ఏం చేయాలి? కనీసం నాకు జ్వరం వచ్చినా పట్టించుకోడు. మా పెండ్లి జరిగి 17 ఏండ్లు అవుతుంది. ఇప్పటి వరకు మేము కలిసి బయటకు వెళ్లిందే లేదు. కనీసం సినిమాకు కూడా తీసుకెళ్లలేదు.
పిల్లలను తీసుకొని పార్కుకు వెళ్లింది లేదు. ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. పిల్లలు ఎదుగుతున్నారు. ఆయన మారకపోతే చాలా కష్టం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దానికి మేము ‘మీరిద్దరూ ఇలా మాట్లాడుకోకుండా ఉంటే మీ పిల్లలు రేపు మీకు దక్కరు. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. కానీ ఇలా ఏండ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉంటే ఎలా? మీరు ఇలా ఎవరి దారిన వాళ్లు వుంటే పిల్లలు పిల్లలు రేపు మీ మాట అస్సలు వినరు. వాళ్ల జీవితం నాశనం చేసినవాళ్లు అవుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా అర్థం చేసుకొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఇలా ఉండటం అస్సలు మంచిది కాదు. ఇంట్లో పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోండి. ఇక మీ ఇష్టం. మేము చెప్పాల్సింది చెప్పాము. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051



