Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపొలిటికల్‌ పోస్టులపై కేసులు చెల్లవు

పొలిటికల్‌ పోస్టులపై కేసులు చెల్లవు

- Advertisement -

సోషల్‌ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌
సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రసంగాలతో కూడిన పోస్టులపై ఆధారం లేకుండా పోలీసులు కేసు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజకీయ ప్రసంగాల ఆధారంగా చేసిన పోస్టులపై కేసులు చెల్లుబాటు కావంటూ బుధవారం హైకోర్టు మార్గదర్శకాలతో కూడిన తీర్పు చెప్పింది. వాటి ఫిర్యాదులపై కేసుల నమోదుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలని స్పష్టం చేసింది. హింస, అశాంతికి అస్కారం ఉండేలా పోస్టులుంటే కేసులను నమోదు చేయవచ్చునని చెప్పింది. తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారని చెప్పి కేసు నమోదుకు వీల్లేదనీ, ఆధారాలు ఉన్నాయని తేలినపుడే కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. తమ నేత పరువు ప్రతిష్టలకు భంగం చేకూరేలా పోస్టు ఉందని చెప్పి మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేయడం సరిగాదని పేర్కొంది. నిజంగానే ఆ నేత పరువు ప్రతిష్టలకు నష్టం వాటిల్లే పోస్టయితే సదరు నేతే స్వయంగా ఫిర్యాదు చేయాలనీ, మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చెల్లదని స్పష్టతనిచ్చింది. సీఎంపై విమర్శలు చేశారంటూ రామగుండం, కరీంనగర్‌లోని రెండు పోలీసు స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను కొట్టేయాలం టూ నల్ల బాలు అలియాస్‌ దుర్గం శశిధర్‌గౌడ్‌ వేసిన పిటిషన్‌లో జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ బుధవారం ఈ కీలక తీర్పు వెల్లడించారు.

ట్వీట్‌లు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని కోర్టు భావిస్తోందని న్యాయ మూర్తి పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పరువు నష్టం కలిగిందనే ఆరోపణలతో ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు చట్ట నిబంధనల ప్రకారం ‘బాధిత వ్యక్తి’ అవునో కాదో పోలీసులు ధ్రువీకరించాలన్నారు. తీవ్ర నేరాల సమయంలో తప్ప పోస్టులతో సంబం ధం లేని ఇతరుల తరఫున చేసిన ఫిర్యాదులు విచారణార్హం కాదని స్పష్టం చేశారు. తీవ్ర నేరమ యితే ప్రాథమిక విచారణ జరిపి అందులో చట్టపర అంశాలున్నాయో లేదో నిర్ధారించిన తరువాతే కేసు నమోదుకు ముందుకెళ్లాలన్నారు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే అంశాలకు ప్రాథమిక ఆధారా లుంటే తప్ప వాటికి సంబంధించిన కేసులు నమోదు చేయరాదన్నారు. ఈ విషయంలో కేదార్‌నాథ్‌సింగ్‌ వర్సెస్‌ బీహార్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు శిరోధార్యమని తేల్చి చెప్పారు. విమర్శనాత్మక, ఘాటైన రాజకీయ ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేయరాదన్నారు.

ప్రసంగం, పోస్టు హింసను ప్రేరేపించేలా లేదా ప్రజా శాంతి భద్రతలకు తక్షణ ముప్పు కలిగించేలా ఉన్నపుడు మాత్రమే చట్టాన్ని అమలు చేస్తూ కేసులు నమోదు చేయవచ్చన్నారు. అధికరణ 19(1)(ఎ) కింద సాధారణ రాజకీయ విమర్శలకు రాజ్యాంగ రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భావప్రకటన స్వేచ్ఛకూ పరిమితులున్నాయని హితవు పలికారు. పరువు నష్టానికి సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయరాదని తేల్చి చెప్పారు. సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలని ఫిర్యాదుదారుకు చెప్పాలన్నారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 174(2) కింద మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు చర్య తీసుకోవాలన్నారు. పోస్టులపై ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా యాంత్రికంగా అరెస్టు చేయరాదన్నారు. ప్రతి సందర్భంలోనూ ఆర్నేష్‌ కుమార్‌ వర్సెస్‌ బీహార్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. రాజకీయ ప్రసంగం/పోస్టు లేదంటే ఇతర సున్నితమైన వ్యక్తీకరణకు సంబంధించి చట్టబద్ధంగా చర్యలుం డేలా చూసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటివాటిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ముందు పీపీ నుంచి లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదుపై కేసు నమోదు చెల్లదని తీర్పు చెప్పారు.

ఆ భూములపై చర్యలు తీసుకుంటున్నాం : సీఎస్‌
నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సేకరించి వాటిని సబ్‌రిజిస్ట్రార్లకు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం హైకోర్టుకు తెలిపారు. కలెక్టర్ల నుంచి, దేవాదాయశాఖ, వక్ఫ్‌బోర్డు నుంచి 22ఎలోని నిషేధిత భూములకు సంబంధించిన వివరాలను నిర్దిష్ట దరఖాస్తు రూపంలో తెప్పించాలని సీసీఎల్‌ఏకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్‌హిల్స్‌ కాలనీలోని 475 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌కు తిరస్కరించ డాన్ని సవాలు చేస్తూ గుప్త రియాల్టీతోపాటు మరి కొందరు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిని హైకోర్టు విచారణ సమయంలో నిషేధిత భూముల వివరాలను సబ్‌ రిజిస్టార్లకు ఇవ్వాలని గతంలో ఆదేశించిన మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఎస్‌ చెప్పారు. పిటషన్లకు చెందిన భూములను రిజిస్ట్రేషన్‌ను నిరాకరిస్తూ దాఖలైన పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిం చిన హైకోర్టు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.

సరోగసీ కేసుల్లో దంపతులు కూడా బాధితులు : హైకోర్టు
సరోగసీ కేసులో మోసపోయిన దంపతులు కూడా బాధితులేనని హైకోర్టు పేర్కొంది. డాక్టర్‌ చేసిన నేరం వల్ల వారు వేదనకు గురవుతున్నారనీ, వారికి శిశువును అప్పగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలలుగా వారి సంరక్షణలో ఉన్న చిన్నారి క్షేమంగా ఉందనీ, విచారణలో భాగంగా అధికారులు ఎప్పుడైనా వెళ్లి చూడవచ్చని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఇతర కేసులకు వర్తించదని వెల్లడించింది. సరోగసి పేరుతో డాక్టర్‌ నమ్రత రూ.20 నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి శిశువుల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసి, చిన్నారులను శిశువిహార్‌ సంరక్షణలోకి తీసుకున్న విషయం విదితమే. ఈ కేసులో భాగమైన తమ బిడ్డను అప్పగించాలని కోరుతూ పుప్పాలగూడకు చెందిన ఓ ప్రయివేటు ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad