ఓటింగ్ ద్వారా సింగరేణి కార్మికుల అభిప్రాయ సేకరణ
నవతెలంగాణ – గోదావరిఖని
సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కోసం సీఐటీయూ బ్యాలెట్ ఉద్యమం చేపట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం-1 ఏరియాలో సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎస్‌సీఈయూ) ఆధ్వర్యంలో బ్యాలెట్ ఉద్యమం గురువారం చేపట్టారు. సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా… క్వార్టర్ కావాలా అనే విషయంపై బ్యాలెట్‌లో ఓటింగ్ ద్వారా కార్మికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆర్జీ 1 ఏరియాలోని జీఎం ఆఫీస్, ఎస్‌అండ్‌పీసీ, జీడీకే 1, 2, 2ఏ, ఓసీపీ 5, ఏరియా వర్క్‌షాప్, ఎక్స్‌ప్లోరేషన్, సివిల్ డిపార్ట్‌మెంట్‌లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికులు స్వచ్ఛందంగా అభిప్రాయాలను తెలియజేశారని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా క్వార్టర్ వద్దు.. సొంతిల్లు ముద్దు అనే విధంగా పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్న కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి కోట్లాది రూపాయలు లాభాలు సాధించి పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు దాదాపు 42వేల కోట్ల రూపాయలు సంస్థకు బకాయి పడ్డా ఇప్పటికీ ఇవ్వని పరిస్థితి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ, కార్మికుల సొంతిల్లు అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకే కార్మికుల అభిప్రాయ సేకరణ, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 13వందల ఎకరాల ఖాళీ స్థలం ఉందని, అంతేకాకుండా కార్మికుల సంఖ్య కంటే క్వార్టర్ల సంఖ్య పెద్ద మొత్తంలో ఉండడం వల్ల కొన్ని క్వార్టర్లు అన్యాక్రాంతం అవుతున్నాయని, కొన్ని క్వార్టర్లు శిథిలావస్థలో ఉన్నాయని, 60శాతం కాలం చెల్లిన క్వార్టర్లను కూల్చివేసి ఆస్థలాన్ని కార్మికులకే పట్టా చేస్తే సొంతిల్లు సాధ్యమవుతుందని ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వాలు, యాజమాన్యం పెడచెవిన పెడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా తోటి కార్మిక సంఘాలు కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు నామని బిక్షపతి, ఆర్జీ-1 అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, మేదరి సారయ్య, తోట నరహరిరావు, ఆసరి మహేష్, ఎస్‌కె గౌస్, అనబోయిన శంకరన్న, దాసరి సురేష్, ఈ.సాగర్, వంగల శివరాం రెడ్డి, ఈద వెంకటేశ్వర్లు, నంది నారాయణ, పెద్దపల్లి శశి కిరణ్, శ్రావణ్, సమ్మయ్య, భీమా నాయక్, శ్రీనివాస్, బాదే రవి, సంతోష్, బొడ్డు రవి పాల్గొన్నారు.