Sunday, September 14, 2025
E-PAPER
Homeఆటలుఎట్టకేలకు..ఫైనల్లో

ఎట్టకేలకు..ఫైనల్లో

- Advertisement -

టైటిల్‌ పోరుకు సాచి జోడీ, లక్ష్యసేన్‌
హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500

హాంగ్‌కాంగ్‌ సిటీ : ఏడాదిగా ఆరు సెమీఫైనల్స్‌లో ఆరు పరాజయాలు. భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి గడ్డుకాలం దాటుకుని.. ఎట్టకేలకు ఓ టోర్నమెంట్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 2024 థారులాండ్‌ ఓపెన్‌ తర్వాత మళ్లీ తుది సమరానికి చేరుకోని సాత్విక్‌, చిరాగ్‌లు.. హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లో అదరగొట్టారు. నిలకడగా రాణిస్తూ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి అడుగుపెట్టారు. చైనీస్‌ తైపీ షట్లర్లు చెన్‌ చెంగ్‌, లిన్‌ బింగ్‌లపై సాత్విక్‌, చిరాగ్‌లు 21-17, 21-15తో వరుస గేముల్లో గెలుపొందారు. 38 నిమిషాల్లోనే ముగిసిన సెమీఫైనల్లో వరల్డ్‌ నం.9 భారత జోడీ ఏకపక్ష విజయం సాధించింది. తొలి గేమ్‌లో 11-7తో ముందంజ వేసిన సాత్విక్‌, చిరాగ్‌.. ద్వితీయార్థంలో రెట్టించిన దూకుడు చూపించారు. రెండో గేమ్‌లో 9-11తో విరామ సమయానికి వెనుకంజ వేసినా..15-15తో స్కోరు సమం చేసి ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు గెల్చుకుని సత్తా చాటారు. వరుస గేముల్లో సెమీస్‌లో గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు ఫైనల్లో ఆరో సీడ్‌ చైనా షట్లర్లు లియాంగ్‌, వాంగ్‌లతో సాత్విక్‌, చిరాగ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నారు.

పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు. వరల్డ్‌ నం.6, చైనీస్‌ తైపీ షట్లర్‌ చో చెన్‌పై 23-21, 22-20తో వరుస గేముల్లో లక్ష్యసేన్‌ పైచేయి సాధించాడు. 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్స్‌లో రెండు గేమ్‌లు టైబ్రేకర్‌కు దారితీశాయి. తొలి గేమ్‌లో 11-7తో ముందంజ వేసిన లక్ష్యసేన్‌.. ఆ తర్వాత వెనుకంజ వేశాడు. 18-18 వద్ద స్కోరు సమం చేసిన చో చెన్‌ 21-21 వరకు వెంబడించాడు. వరుసగా రెండు పాయింట్లతో లక్ష్యసేన్‌ తొలి గేమ్‌లో పైచేయి సాధించాడు. రెండో గేమ్‌ ఆరంభం నుంచే ఉత్కంఠ రేపింది. 10-11తో విరామ సమయానికి వెనుకంజ వేసిన లక్ష్యసేన్‌..ఆఖర్లో పుంజుకున్నాడు. 17-19తో ఒత్తిడిలో పడిన లక్ష్యసేన్‌ అక్కడ్నుంచి వరుసగా ఐదు పాయింట్లతో చెలరేగాడు. 22-20తో చో చెన్‌ను టైబ్రేకర్‌లో చిత్తు చేశాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న లక్ష్యసేన్‌ ఆ తర్వాత ఆశించిన ప్రదర్శన చేయలేదు. హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్‌ ఈ ఏడాదిలో తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -