ఫైనల్లో భారత్‌!

India in the final!– సూపర్‌4లో శ్రీలంకపై గెలుపు
– రాణించిన రోహిత్‌, కుల్దీప్‌ యాదవ్‌
నవతెలంగాణ-కొలంబో
ఆసియా కప్‌ ఫైనల్లోకి భారత్‌ ప్రవేశించింది!. సూపర్‌4లో వరుసగా పాకిస్థాన్‌, శ్రీలంకపై గెలుపొందిన టీమ్‌ ఇండియా.. మరో మ్యాచ్‌ ఉండగానే టైటిల్‌ పోరు బెర్త్‌ లాంఛనం చేసుకుంది. మంగళవారం జరిగిన భారత్‌, శ్రీలంక సూపర్‌ 4 స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో రోహిత్‌సేన 41 పరుగుల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల ఛేదనలో శ్రీలంక 172 పరుగులకే కుప్పకూలింది. చివర్లో వెల్లాలాగే (42 నాటౌట్‌) పోరాడినా..లంకకు ఓటమి తప్పలేదు. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/43), రవీంద్ర జడేజా (2/33) సహా జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/30) రాణించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలోనే 213 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53, 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా..కెఎల్‌ రాహుల్‌ (39, 44 బంతుల్లో 2 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (33, 61 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) సమోచిత ఇన్నింగ్స్‌లతో రాణించారు. విరాట్‌ కోహ్లి (3), హార్దిక్‌ పాండ్య (5), రవీంద్ర జడేజా (4) నిరాశపరిచారు. శ్రీలంక స్పిన్నర్లు దునిత్‌ వెల్లలాగే (5/40), చరిత్‌ అసలంక (4/18) తొమ్మిది వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించారు.
రోహిత్‌ మెరిసినా.. : టాస్‌ నెగ్గిన భారత్‌.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. సోమవారం పాకిస్థాన్‌కు కుప్పకూల్చిన బౌలర్లకు కాసింత విరామం అందించేందుకు రోహిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (53), శుభ్‌మన్‌ గిల్‌ (19) గత మ్యాచ్‌ జోరు కొనసాగించారు. గిల్‌ ఆరంభంలో దూకుడుగా ఆడాడు.
దీంతో తొలి వికెట్‌కు ఓపెనర్లు 80 పరుగులు జోడించారు. పవర్‌ప్లే అనంతరం బంతి స్పిన్నర్లు అందుకోగా.. భారత ఇన్నింగ్స్‌ అక్కడ్నుంచి అనూహ్యంగా మారింది!. గిల్‌, విరాట్‌ కోహ్లి (3)లను అవుట్‌ చేసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగే.. టీమ్‌ ఇండియాను ఒత్తిడిలో పడేశాడు. వెల్లలాగేకు చరిత అసలంక సైతం తోడవటంతో భారత బ్యాటర్ల పరుగుల వేట కష్టమైంది. వెల్లలాగే ఐదు వికెట్లతో మెరవగా.. అసలంక నాలుగు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు. అర్థ సెంచరీ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిష్క్రమించినా.. మిడిల్‌ ఆర్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ (33), కెఎల్‌ రాహుల్‌ (39) ఆదుకున్నారు. లోయర్‌ ఆర్డర్‌లో అక్షర్‌ పటేల్‌ (26, 36 బంతుల్లో 1 సిక్స్‌) మెరుపులతో భారత్‌ 200 ప్లస్‌ పరుగులు సాధించింది.

Spread the love