భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
సూర్యపై వేటు సూర్యవంశీకి చోటు
పలు సిరీస్‌లకు భారత టీ20 జట్ల ఎంపిక
భారత క్రికెట్‌లో శ్రేయస్ శకం ఆరంభం కానుంది. కొన్నేండ్లుగా నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు భారత జట్టులో చోటు పాటు కెప్టెన్సీ పగ్గాలు సైతం అందుకున్నాడు. లాస్‌ఎంజిలెస్ ఒలింపిక్స్, 2028 టీ20 ప్రపంచకప్‌ను గమనంలో ఉంచుకుని శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వరల్డ్‌కప్ అందించి జట్టులో చోటు గల్లంతు చేసుకున్న కెప్టెన్‌గా సూర్య నిలిచిపోనున్నాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి పరీక్షను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఎదుర్కొనున్నాడు.
నవతెలంగాణ-ముంబయి
ఊహాగానాలే నిజమయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్‌పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. దేశవాళీ, ఐపీఎల్‌లో నిలకడగా సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 15 ఏండ్ల బుడతడు వైభవ్ సూర్యవంశీ సైతం తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. శనివారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరుగనున్న ఆసియా క్రీడలకు భారత జట్లను ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడల్లోనూ భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు.
శ్రేయస్‌కు కెప్టెన్సీ పగ్గాలు
శ్రేయస్ అయ్యర్ (31) 2023 డిసెంబర్ నుంచి భారత్‌కు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించలేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ముంగిట జట్టులోకి వచ్చినా.. వరల్డ్‌కప్‌లో ఉన్న ఆటగాళ్లకే ఆ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో ఉండటంతో శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తిరుగులేని రికార్డులు, గణాంకాలు ఉన్నాయి. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. 2025 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను, 2021 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అయ్యర్ 168.81 స్ట్రయిక్‌రేట్‌తో 498 పరుగులు చేయగా.. గత ఏడాది 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఆరంభంలో అజేయ జోరుతో నడిపించిన శ్రేయస్.. ఆఖర్లో వరుస పరాజయాలు చవిచూశాడు. ఓ కెప్టెన్ చూడాల్సిన విజయాలు, అపజయాలు, ఒత్తిడి, విమర్శలు అన్నీ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే చూశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. తెలుగు తేజం, హైదరాబాదీ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ ముంగిట శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉండగా.. ప్రపంచకప్‌లో అక్షర్ పటేల్ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పడు ఉప సారథ్య బాధ్యతలు తిలక్ వర్మ చేతికి చిక్కాయి. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ నాయకత్వంలో భారత జట్టు లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ సహా 2028 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో దూసుకెళ్లగలదని సెలక్షన్ కమిటీ అభిప్రాయ పడింది.
సూర్యపై వేటు సూర్యవంశీకి చోటు
సూర్యకుమార్ యాదవ్ (35)పై వేటు పడింది. టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన కెప్టెన్‌పై తర్వాతి సిరీస్‌లోనే వేటు పడటం ఇదే ప్రథమం. అటు ప్రపంచకప్‌లో ఇటు ఐపీఎల్‌లో బ్యాటర్‌గా దారుణంగా నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో చోటు కోల్పోయాడు. దీంతో సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నాడు. రానున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో సూర్యవంశీ అరంగేట్రం చేస్తే.. అతి పిన్న వయసులో భారత్ తరఫున ఆడిన క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు.
మార్పులు.. చేర్పులు
వైభవ్ సూర్యవంశీతో పాటు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ప్రిన్స్ యాదవ్ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యులైన రింకు సింగ్, కుల్‌దీప్ యాదవ్‌లపై వేటు పడగా.. హార్దిక్ పాండ్య, జశ్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి లభించింది.
కోహ్లి స్థానంలో జైస్వాల్
ఐపీఎల్19 ఫైనల్లో తొడ కండరాల గాయానికి గురైన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కోహ్లికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం అతడు అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధంగా లేడని వైద్య బృందం తేల్చింది. దీంతో విరాట్ కోహ్లి స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. ఆ ఇద్దరిపై వైద్య బృందం ఇంకా నివేదికలు ఇవ్వలేదు. భారత్, అఫ్గనిస్తాన్ తొలి వన్డే ఈ నెల 13న ధర్మశాలలో జరుగనుండగా.. 17న లక్నోలో, 20న చెన్నైలో చివరి రెండు వన్డేలు జరుగుతాయి.
ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబె, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, ప్రిన్స్ యాదవ్.
ఆసియా క్రీడలకు భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబె, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.
శ్రీలంకతో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు భారత-ఏ జట్టు
ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబె, శరాన్షు జైన్, గుర్నూర్ బరార్, అకిబ్ నబి, యశ్ ఠాకూర్, అన్షూల్ కంబోజ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), ఆమన్ మోకాడె, షేక్ రషీద్, జీషన్ అన్సారీ.


