Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో మరో బస్ డిపో..

హైదరాబాద్‌లో మరో బస్ డిపో..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. ఈ బస్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జగద్గిరిగుట్ట సమీపంలో బస్ డిపో నిర్మాణం కోసం టీజీఎస్‌ఆర్టీసీ గతంలో హెచ్‌ఎంటీకి చెందిన స్థలాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు కోరినట్లు తెలిపారు. అయితే, కేవలం 20 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వగలమని, అదీ ఐదేళ్లకోసారి సమీక్షిస్తామని హెచ్‌ఎంటీ అధికారులు చెప్పారన్నారు. దీనికి అదనంగా ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని షరతు విధించడంతో ఈ ప్రతిపాదనను టీజీఎస్‌ఆర్టీసీ తిరస్కరించిందని గడ్కరీ వివరించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో హెచ్‌ఎంటీ భూములకు సమీపంలోనే 100 ఎకరాల స్థలాన్ని టీజీఎస్‌ఆర్టీసీకి కేటాయించిందని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం జగద్గిరిగుట్ట మీదుగా 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు రోజూ 404 ట్రిప్పులు నడుపుతున్నాయని, కొత్త డిపోతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -