నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించతలపెట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ సదస్సుకు ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయాయి. సభా వేదిక అయిన కేపీ గ్రౌండ్‌కు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి తీవ్ర ఉత్కంఠకు కారణమైన కాయస్థ పాఠశాల ట్రస్ట్.. గురువారం అర్ధరాత్రి వెనక్కి తగ్గింది. కొన్ని షరతులతో సభ నిర్వహణకు మళ్లీ అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఆగస్టు 8న ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే, కేపీ కాలేజ్ మైదానాన్ని కేవలం క్రీడలు, విద్యా సంబంధిత కార్యక్రమాలకే వాడాలన్న అలహాబాద్ హైకోర్టు పాత ఆదేశాలను, వర్షం కారణంగా మైదానంలో నీరు చేరిందన్న కారణాన్ని చూపుతూ కేపీ ట్రస్ట్ బుధవారం అకస్మాత్తుగా అనుమతిని రద్దు చేసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. రాహుల్ సభను అడ్డుకునేందుకే బీజేపీ ప్రభుత్వం పరిపాలన యంత్రాంగంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించాయి. వేదిక అనుమతి రద్దయినా, రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని ఏఐసీసీ, యూపీ కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఆరోపణలు, న్యాయపరమైన అంశాలపై చర్చించిన అనంతరం కేపీ ట్రస్ట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైకోర్టు న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత సభకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. అయితే, ఇందుకు రెండు ప్రధాన షరతులు విధించారు. మొదటిది, కార్యక్రమం వల్ల కాలేజీలోని తరగతులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, రెండవది, ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) నుంచి తప్పనిసరిగా చట్టబద్ధమైన అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.



