నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ ప్రవేశపరీక్ష లీక్ అంశం అప్పటికప్పుడు జరిగినది కాదని, అది వ్యవస్థీకృత బహుళ రాష్ట్ర నేరపూరిత కుట్ర ఫలితమని సీబీఐ ఆరోపించింది. ఎన్టీఏ నియమించిన సబ్జెక్టు నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, బ్రోకర్లు ఇందులో ఉన్నారన్నారు. ప్రవేశపరీక్ష చివరి నిమిషంలో జరిగిన చర్య కాదని, కొన్ని నెలలక్రితమే ప్లాన్ వేసి లీక్ చేశారని పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 13 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎన్టీఏ సెంటర్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేస్తున్న సమయంలో.. ఈ ముగ్గురు నిందితులు ప్రశ్నలను కాపీ చేసి వాటిని చీటీలపై రాసుకున్నారు. కొన్ని ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో ఉన్న పేరాగ్రాఫ్‌ల్లో మార్క్ చేసినట్లు ఛార్జ్‌షీట్ ద్వారా తెలిసింది.
ఆ ముగ్గురు నిందితులకు ఎన్టీఏలో క్వశ్చన్ సెట్టింగ్, ట్రాన్స్‌లేషన్ సెక్షన్లకు యాక్సెస్ ఉందని ఛార్జ్‌షీట్ ద్వారా తెలిసింది. ఎన్టీఏ సెంటర్ నుంచి సేకరించిన సమాచారాన్ని నమ్మకమైన వ్యక్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు చేరేలా చేశారు. అయితే ఈ ప్రక్రియ డిజిటల్ విధానాలను వాడకుండా .. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆర్థికంగా లాభపడేందుకు, ట్యూషన్ విద్యార్థుల్లో సక్సెస్ రేట్‌ను పెంచేందుకు నిందితులు ఇలా చేశారని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. ప్రయివేటు కోచింగ్ సెషన్స్ సందర్భాల్లో లీక్ చేసిన ప్రశ్నలను విద్యార్థులతో రాయించారని, వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు కూడా ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.
తేలికైన ప్రశ్నలను కంఠస్తం చేసి, ఆ తర్వాత తమ హోటల్ రూమ్‌లో వాటిని పేపర్‌పై రాసుకునేవారని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఎన్టీఏ విధి నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎన్టీఏ కేంద్రం వద్ద చెకింగ్ కానీ ఫ్రిస్కింగ్ కానీ సమర్థవంతంగా లేదు. పీవీ కులకర్ణి ఈ కేసులో ఏ2 నిందితుడు. అతను మూడు సెట్ల ప్రశ్నాపత్రాలకు చెందిన ట్రాన్స్‌లేషన్ వర్క్ కూడా చేశాడు. మూడు రోజుల వ్యవధిలో అతను 135 ప్రశ్నలను ట్రాన్స్‌లేట్ చేశాడని తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. 13 మంది నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ వ్యక్తులు, మధ్యవర్తులు, లాభపడిన విద్యార్థులు ఉన్నారు. ఎన్టీఏలో పనిచేస్తున్న కొందరు తమ అధికారాన్ని వాడుకుని రహస్య సమాచారాన్ని సేకరించినట్లు గుర్తించారు. ఈ కేసుతో లింకున్న సుమారు 20 వేల పేజీల ఆధారాలను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూకోర్టులో సీబీఐ సమర్పించింది. సీబీఐ తన విచారణలో భాగంగా 360 మంది సాక్ష్యులను పేర్కొన్నది. ప్రస్తుతం 13 మంది నిందితులు జుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు.


