నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడి పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ …. ప్రతిపక్ష ఎంపీలంతా పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని వర్షంలో నిలబడి ఆందోళన చేపట్టారు. అమిత్‌షా కనపడటం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపిలంతా ప్రశ్నించారు. “అమిత్ షా జవాబ్ దేవ్” అని ప్లకార్డులు పట్టుకొని నినదించారు. ఈ నిరసన సమయంలో భారీగా వర్షం కురుస్తున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన కొనసాగించారు. కాగా … ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
జూలై 20వ తేదీన న్యూఢిల్లీలో ‘నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోం శాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. దీనిపై బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ …. ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని వారంతా నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి కచ్చితంగా సమాధానం ఇస్తారని అన్నారు. అమిత్ షా పార్లమెంట్‌కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.



