Sunday, September 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనాకు అనుకూలంగా భారత్‌ ఓటు

పాలస్తీనాకు అనుకూలంగా భారత్‌ ఓటు

- Advertisement -

ఫ్రాన్స్‌ తీర్మానానికి 142 దేశాల మద్దతు
ఇజ్రాయిల్‌, అమెరికా సహా 10 దేశాల వ్యతిరేకత

న్యూయార్క్‌ : గాజాపై భారత్‌ తన వైఖరిని మార్చుకుంది. పాలస్తీనాకు మద్దతుగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేసింది. కాల్పుల విరమణ పాటించాలంటూ ఐరాస గతంలో ఆమోదించిన తీర్మానాలపై ఓటింగ్‌ జరిగినప్పుడు భారత్‌ నాలుగు సందర్భాలలో గైర్హాజరు అయింది. దీనిపై పలు దేశాలు భారత్‌పై విమర్శలు కురిపించాయి. అయితే తాజాగా పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలన్న ‘న్యూయార్క్‌ డిక్లరేషన్‌’కు భారత్‌ మద్దతు ప్రకటించింది. ఒకప్పటి పాలస్తీనా భూభాగంలో రెండు దేశాలను (యూదులకు ఇజ్రాయిల్‌, పాలస్తీనా ప్రజలకు పాలస్తీనా) ఏర్పాటు చేయడం ద్వారా ఇజ్రాయిల్‌-పాలస్తీనా సమస్యకు పరిష్కారం సాధించాలన్న ప్రతిపాదనను సమర్ధించింది. ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానానికి భారత్‌ సహా 142 దేశాలు అనుకూలంగా ఓటేయగా 10 దేశాలు వ్యతిరేకించాయి. 12 దేశాలు గైర్హాజరు అయ్యాయి. ‘పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం, అలాగే రెండు దేశాల విధానం అమలు కోసం న్యూయార్క్‌ డిక్లరేషన్‌ను ఆమోదించడం’ అనే పేరుతో ఫ్రాన్స్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని గల్ఫ్‌ అరబ్‌ దేశాలన్నీ సమర్ధించాయి. ఇజ్రాయిల్‌, అమెరికా, అర్జెంటీనా, హంగరీ, మైక్రోనేసియా, నారూ, పాలవ్‌, పపువా న్యూ గునియా, పరాగ్వే, టాంగా వ్యతిరేకించాయి. ఈ డిక్లరేషన్‌ను జూలైలో ఐరాస కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ఫ్రాన్స్‌, సౌదీ అరేబియాలు సహ అధ్యక్షత వహించాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఘర్షణను నివారించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ డిక్లరేషన్‌ను రూపొందించారు.

డిక్లరేషన్‌లో ఏముంది?
గాజాలో యుద్ధాన్ని నివారించాలని, రెండు దేశాల విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రాతిపదికపై ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణలకు న్యాయబద్ధమైన, శాంతియుతమైన, దీర్ఘకాల పరిష్కారాన్ని కనుగొనాలని, పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీలతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ మెరుగైన భవిష్యత్తు నిర్మించాలని, అందుకోసం ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఏడు పేజీల డిక్లరేషన్‌లో నేతలు అంగీకరానికి వచ్చారు. గత అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ జరిపిన దాడిని డిక్లరేషన్‌ ఖండించింది. ఈ దాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయిల్‌ చేపట్టిన దాడులను కూడా విమర్శించింది. ఈ దాడుల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ‘సైనిక చర్య, ఆకలి కేకల’ కారణంగా మానవతా విధ్వంసం జరిగిందని తెలిపింది. సార్వభౌమత్వ పాలస్తీనా దేశం సహా రెండు దేశాల పరిష్కారానికి స్పష్టమైన బహిరంగ హామీ ఇవ్వాలని ఇజ్రాయిల్‌ను డిక్లరేషన్‌ కోరింది.

హింసకు వెంటనే స్వస్తి చెప్పాలని, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలు నిలిపివేయాలని, అన్ని సెటిల్మెంట్లను ఆపేయాలని, తూర్పు జెరూసలేం సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో భూ ఆక్రమణలను, అనుబంధ కార్యకలాపాలను ఆపాలని, సెటిలర్ల హింసకు కళ్లెం వేయాలని ఇజ్రాయిల్‌ను డిక్లరేషన్‌ కోరింది. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతు తెలిపింది. రెండు దేశాల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోని పక్షంలో ఘర్షణ తీవ్రతరమవుతుందని, ప్రాంతీయ శాంతికి భంగం వాటిల్లుతుందని హెచ్చరించింది. పాలస్తీనాలో గాజా అంతర్భాగమని, దానిని వెస్ట్‌బ్యాంక్‌తో కలపాలని స్పష్టం చేసింది.

ఇజ్రాయిల్‌, అమెరికా వ్యతిరేకత
న్యూయార్క్‌ డిక్లరేషన్‌ను ఇజ్రాయిల్‌ వ్యతిరేకించింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీ ఒక రాజకీయ సర్కస్‌లా మారిందని, వాస్తవం నుంచి దూరం జరిగిందని విమర్శించింది. డిక్లరేషన్‌లో ఎన్నో క్లాజులు ఉన్నప్పటికీ హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని తెలిపింది. అమెరికా కూడా తీర్మానాన్ని తప్పుపట్టింది. ఈ తీర్మానం హమాస్‌కు ఒక బహుమతి వంటిదని అమెరికా దౌత్యవేత్త మార్గాన్‌ ఆర్టాగస్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -