గ్లోబల్ ఎంటర్ ఫెయిత్ వీకెండ్ లో ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్
నవతెలంగాణ – వనపర్తి
చిన్నతనంలో బాలికలకు చేపట్టే బాల్యవివాహాలతో బాలిక భవిష్యత్తు అంతా అంధకారమే ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ అన్నారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యాక్సిస్ టు జస్టిస్ ప్రోగ్రాంలో భాగంగా వనపర్తి జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్ తరపున బాల్య వివాహాలను అంతం చేయడానికి 2025 సెప్టెంబర్ 12-14 వరకు గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ వీకెండ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం క్రైస్తవ మత పాస్టర్లు ఆధ్వర్యంలో చర్చిలలో గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ వీకెండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 కంటే ఎక్కువ దేశాలలో హిందూ మందిరాలు, మసీదులు, చర్చి లాంటి పూజా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగమే సెయింట్ థామస్ చర్చి, యం బి చర్చి, టౌన్ చర్చిలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. బాల్య వివాహాలు పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వైఫల్యాలను కలిగించే సమస్య అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతినెలా దాదాపు పది లక్షల బాల్య వాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహం ద్వారా బాలిక విద్యను కోల్పోతుందన్నారు. ఆమె చదువు హక్కులు తెలుసుకొనే సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. పెళ్లి అయిన అమ్మాయికి ఇంటి పనులు, భర్త కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఎక్కువవుతాయన్నారు. ఇది చిన్నారిని గృహకూలి పనుల్లోకి నెట్టేస్తుందన్నారు. చిన్న వయసులో పెళ్లి అయిన అమ్మాయికి పెద్ద వయసున్న భర్త ఉండటం వలన శక్తి, అధికారం, అసమానత ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల గృహహింసకు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నారు. చిన్న వయసులో గర్భం దాల్చినప్పుడు అమ్మాయి శరీరం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వలన తల్లి, శిశువు ప్రాణం రెండూ ప్రమాదంలో పడతాయని తెలిపారు.
బాల్య వివాహం ప్రపంచవ్యాప్తంగా పిల్లల జీవితానికి పెద్ద ముప్పు అన్నారు. ఇప్పటికీ మిలియన్ల పిల్లలు పెళ్లిళ్లతో బలవంతంగా బాధ్యతల్లోకి నెట్టబడుతున్నారని తెలిపారు. బాల్య వివాహం ఒక చిన్నారి భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. అందుకే మతాలు, సమాజం, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి బాల్య వివాహాలను అరికట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఏ టు జె ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎడ్విన్ థామస్, సోషల్ మొబిలైజర్స్ కన్నన్ కుమార్, రాజశేఖర్, మూబీన్ పాల్గొన్నారు.