నవతెలంగాణ-తుంగతుర్తి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ, స్వాతంత్య్ర పోరాటంలోనూ కమ్యూనిస్టు నాయకులదే కీలక పాత్ర అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సోమవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాయం రాజిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ మేరకు పలువురు మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రాజిరెడ్డి పాత్ర గొప్పదన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించి పోరాటం కొనసాగించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రనాయకులుగా అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, రాణి రుద్రమను మరిపించిన వీరనారి మల్లు స్వరాజ్యం, సాహసవీరుడు దాయం రాజిరెడ్డి, దాయం ప్రియంవద అంతా తుంగతుర్తి మండలానికి చెందిన వారేనని గుర్తు చేశారు.
రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన బతుకులన్నీ కమ్యూనిస్టు నాయకుల పిలుపుతో బంధూకులు పట్టి ముందుకు కదిలారాన్నారు. పలుగు, పారా, కారం, రోకలి, బరిసెలు ఇలా ఏది దొరికితే అది పట్టుకొని ఆడ, మగ అనే తేడా లేకుండా అంతా సాయుధ పోరాటాలు చేశారన్నారు. నిజాం పోలీసులకు రాజాకారులకు, కమ్యూనిస్టులు, చెమటలు పట్టించారని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాయం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాజిరెడ్డి మనుమరాలు ఝాన్సీ రాజిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారం, సిపిఐ మండల కార్యదర్శి పాల్వాయి పున్నయ్య, ఫయాజ్, కోట రామస్వామి, సాయిలు, ఎనగందుల మల్లేష్ నేత, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రాజిరెడ్డి పాత్ర గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES