Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'నీలి' నీడలు వీడేనా?

‘నీలి’ నీడలు వీడేనా?

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 76 టెండర్లు.. నాలుగు జిల్లాలో ఒక్కటీ దిక్కులేదు
నిధుల కేటాయింపులో ఆలస్యం.. చేప పిల్లల పంపిణీకి అష్టకష్టాలు
ప్రభుత్వ ఫిష్‌ సీడ్‌ కేంద్రాలన్నీ నిర్వీర్యం
ప్రతియేటా ప్రయివేటుపైనే ఆధారం
ఏటా దిగుబడి తగ్గి నష్టపోతున్న మత్స్యకారులు: నిధులు సొసైటీ ఖాతాల్లో వేయాలని టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ డిమాండ్‌


నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సాధారణంగా వర్షాకాలం మొదలు కాగానే రిజర్వా యర్లు, చెరువులలో చేప పిల్లలను వదలడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మత్స్యకారుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. కరీంనగర్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు రూ. కోట్లలో బకాయి పడటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. సకాలంలో చేప పిల్లల పంపిణీ జరగకపోతే, ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి మత్స్యకారుల జీవనోపాధికి గండి పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఫిష్‌సీడ్‌ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచకుండా, ప్రయివేటు టెండర్లు పిలిచి నిధులు మింగేస్తున్నారన్న అపవాదూ ఉంది. ఈ నేపథ్యంలో నేరుగా మత్స్యకార సొసైటీల ఖాతాల్లోనే నిధులు జమ చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

ప్రతి ఏటా వర్షాకాలంలో చేపల పెంపకాన్ని పెంచి, మత్స్యకారుల ఆర్థికస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. సెప్టెంబర్‌ రెండోవారం వచ్చి నా టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం తీవ్ర ఆందోళన కలి గిస్తోంది. ఆగస్టు 18న నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభు త్వం, సెప్టెంబర్‌ 12న బిడ్‌ ఓపెన్‌ చేసినప్పటికీ, రాష్ట్ర వ్యాప్త ంగా 73 టెండర్లు మాత్రమే వచ్చాయి. కామారెడ్డి, కరీం నగర్‌, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్క టెండర్‌ కూడా రాలేదు.

పెండింగ్‌ బకాయిలే కారణం..
రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కొంత మేరకు (రూ.29 కోట్లు) చెల్లించినప్పటికీ, ఇంకా రూ.90 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత రెండు సంవత్సరాలకు కలిపి సుమారు రూ.2.80 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి పూర్తిగా నిరాకరించారు.

ఆందోళనకర పరిస్థితి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మొత్తం 3,441 చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు 6.22 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం ప్రణాళిక వేసుకుని.. ఇందుకోసం రూ.7.44 కోట్లు కేటాయించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్‌ జిల్లాలో 1016 చెరువు లు, ఒక జలాశయంలో 2 కోట్ల చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఇందుకు రూ.2.17 కోట్లు కేటాయించింది. టెండర్లలో ఎవరూ పాల్గొ నకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 452 చెరువులు, 4 జలాశయాల్లో 1.48 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక ఉంది. కేవలం రెండు టెండర్లు మాత్రమే వచ్చాయి. జగిత్యాల జిల్లాలో 1016 చెరువుల్లో కోటి చేపపిల్లల పంపిణీకి రూ.2.20 కోట్లు కేటాయించారు. ఒక టెండర్‌ మాత్రమే వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో 957 చెరువుల్లో 1.59 కోట్ల చేపపిల్లల కోసం రూ.1.58 కోట్లు కేటాయించారు. రెండు టెండర్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా కరీంనగర్‌ జిల్లాలో ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాకపోవడం. ఇతర జిల్లాల్లో నామమాత్రంగానే రావడం మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

నష్టపోతున్న మత్స్యకారులు
సాధారణంగా ఆగస్టు-అక్టోబర్‌ మధ్య వేసే చేపపిల్లలు 8-10 నెలల్లో కిలో బరువుకు పెరుగుతాయి. ఇప్పుడు సమయం మించిపోతోంది. దీనివల్ల చేపపిల్లల ఎదుగుదల పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ఈ ఏడాది మాత్రమే కాకుండా, రాబోయే రెండు, మూడు సంవత్సరాలపాటు చేపల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పటికే చెరువుల్లో మేత కుళ్లిపోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీల ఖాతాల్లోనే డబ్బులు వేయాలి
రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప/ రొయ్య పిల్లల పంపిణీకి కేటాయించిన రూ.122కోట్లను టెండర్ల పేరుతో కాలయాపన చేయొద్దు. ఉచిత చేపపిల్లల పంపిణీ విషయలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఆ నిధులను మత్స్యపారిశ్రామిక సొసైటీల ఖాతాల్లో జమ చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల స్థలంలో రూ.10కోట్లు, ప్రతి మండల కేంద్రంలో ఎకరం స్థలలో రూ.కోటి నిధులతో శాశ్వత హెరీల్‌సెల్‌/రిటైల్‌ చేపల మార్కెట్‌లు నిర్మించాలి. ప్రతి జిల్లాలోని రిజర్వాయర్‌, పెద్ద ట్యాంకులను బేస్‌ చేసుకుని కనీసం జిల్లాకు ఒక చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలి. చేప పిల్లల విత్తన ఉత్పత్తి క్షేత్రాలకు రూ.100కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలి.
లెల్లెల బాలకృష్ణ, టీఎమ్‌కేఎమ్‌కేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -