వందలాది మంది విద్యార్థులకు నష్టం
సమస్య పరిష్కారానికి సహకరించండి
కేటీఆర్‌కు మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెడికల్ అడ్మిషన్లలో స్థానికతకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన జీవో ఇబ్బందికరంగా ఉందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి సమస్యను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారితో ఆయన సమావేశమయ్యారు. ”కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన జీవోను తెచ్చింది. గతంలో పదవ తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుంది. వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దక్కుతాయని కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్‌లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయిన వారున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదు…. ” అని వారు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని వారు చెప్పారు.
మానవీయ కోణంలో సమస్యను పరిశీలించాలి : సీఎస్‌ను కోరిన కేటీఆర్
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను విన్న కేటీఆర్, వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలసీపరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, వాటిని గతానుగతంగా నిబంధనలు తేవడం సరికాదన్నారు. భవిష్యత్తు కోసం ఒక కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇచ్చి అలాంటి నిబంధనలు తీసుకువస్తే బాగుంటుందని సూచించారు. విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాల్లో చదువుతూ, ప్రిపేర్ అవుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాలతో ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.