Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనడిగడ్డతండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం

నడిగడ్డతండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

సీఆర్‌పీఎఫ్‌ అధికారులతో చర్చించాం
వారం రోజుల్లో సమగ్ర నివేదిక
జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌
నడిగడ్డతండాలో ఎమ్మెల్యేతోపాటు అధికారుల పర్యటన

నవతెలంగాణ-మియాపూర్‌
సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలకు, నడిగడ్డ తండా ప్రజలకు మధ్య ఉన్న సమస్యపై గతంలోనే సీఆర్‌ఎఫ్‌ ఐజీఈతో చర్చించామని, తండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ తెలిపారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందుతుందని, వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని నడిగడ్డ తాండాలో నెలకొన్న పలు సమస్యలపై స్థానికుడు స్వామినాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌, పీఏసీ చైర్మెన్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కలెక్టర్‌ నారాయణరెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్‌ డెరైక్టర్‌ కళ్యాణ్‌ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌, చంద్రారెడ్డి, కస్టోడియన్‌ ఎనిమి ప్రాపర్టీ డిప్యూటీ సెక్రటరీ అశోక్‌కుమార్‌, సీఆర్‌పీఎఫ్‌ సెకండ్‌ కమాండెంట్‌ అమిత్‌ మిశ్రా.. నడిగడ్డ తాండాలో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ మాట్లాడుతూ.. నడిగడ్డతండా, సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌, ఓంకార్‌ నగర్‌ కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామన్నారు.

తండా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా బలగాల నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, తండా అభివృద్ది బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. రోడ్లు, డ్రయినేజీ, తాగునీటి సరఫరా, బస్తీ దవాఖాన, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందరికీ ఇండ్లు నిర్మించుకునే విధంగా సహకారం అందిస్తామన్నారు. నడిగడ్డతం డాలో ఆస్పత్రి, శ్మశాన వాటికను నిర్మిస్తామన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి రామేశ్వరిదేవి, వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకారెడ్డి, డీసీ శశిరేఖ, కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -