Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఎసిబి విజయవాడ యూనిట్‌లో కేసుల కొట్టివేతపై సుప్రీం ఆగ్రహం

ఎసిబి విజయవాడ యూనిట్‌లో కేసుల కొట్టివేతపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -

మధ్యంతర ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: ఎసిబి విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌లో నమోదైన కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌కు పోలీసు స్టేషన్‌ హోదా లేదని ఇటీవల కేసులను ఎపి హైకోర్టు క్వాష్‌ చేసింది. దీనిని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది. ఇంత దారుణంగా కూడా చట్టాలను అన్వయించుకుంటారా? అని ప్రశ్నించింది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? దర్యాప్తు ఏం జరుగుతుందో కూడా చూడకుండా కేసులు కొట్టేయడమేంటని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎసిబి నమోదు చేసిన అక్రమాస్తుల కేసులను ఇలా ఏకపక్షంగా కొట్టేయడమేంటని పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులిచ్చిన ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులు మరో ఏ ఒక్క కేసుకు అమలు కావని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న 11 ఎఫ్‌ఐఆర్‌లపై తదుపరి విచారణ కొనసాగించి చార్జిషీట్‌లు దాఖలు చేసేందుకు అనుమతినిస్తూ మధ్యంతర ఆదేశాలను ధర్మాసనం ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. విజయవాడలో యూనిట్‌ ఏర్పాటుచేసి, తదుపరి కార్యకలాపాలు సాగించేందుకు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదు పరి విచారణ ఆరు వారాలు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -