Thursday, October 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగ్రూప్‌-1 అభ్యర్థుల భవితవ్యమేమిటి?

గ్రూప్‌-1 అభ్యర్థుల భవితవ్యమేమిటి?

- Advertisement -

నాటి రామాయణంలో పద్నాలుగేండ్లు రాజ్యాధికారానికి దూరంగా ఉండి అడవులపాలై తిరిగి వచ్చిన శ్రీరాముడికి మరల రాజ్యం అప్పగించాడు భరతుడు. ఆధునిక భారతంలో పద్నాలుగేండ్లుగా గ్రూప్‌ పరీక్షల ద్వారా నియామకాలకై ఎదురుచూసిన నిరుద్యోగులకు మాత్రం వరుసగా ఆశాభంగం తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న అభ్యర్థులు ప్రతిసారి నిరాశకు గురికావడం శోచనీయం. అసలు మన ప్రభుత్వాలకు పరీక్షలు సక్రమంగా నిర్వహించే సామర్థ్యం లేదా లేక అధికారులకు పరీక్షలు సజావుగా నిర్వహించే సమర్ధత లేదా అనేది నేడు చర్చనీయాంశమైంది.కారణమేదైనా బలవుతున్నది ఆశావాహ నిరుద్యోగులే. లక్షల రూపాయలు పోసి చదువుకుని, వేల రూపాయలు వెచ్చించి హైదరాబాదు నగరంలో అద్దెకుండి కోచింగ్‌ తీసుకుంటూ, తిని తినక తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుందామనుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆశాభంగమే ఎదురవుతున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌ ఉద్రిక్తతల మధ్య ఉద్యమ నేతల హామీల మధ్య బహిష్కరించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్‌ వన్‌ పరీక్షకు నోటిఫికేషన్‌ ఇవ్వడానికి దాదాపు ఎనిమిదేండ్లు పట్టింది. నాటి టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ప్రశ్నపత్రాన్ని అమ్ముకోగా పేపర్‌ లీక్‌ అయింది. దాంతో అక్టోబర్‌ 2022లో పరీక్ష రద్దయింది. తిరిగి 11 జూన్‌ 2023 నాడు నిర్వహించినప్పుడు అభ్యర్థుల హాజరు బయో మెట్రిక్‌ పద్ధతిన సక్రమంగా నమోదు కాలేదని ఓఎంఆర్‌ షీట్‌లపై హాల్‌ టికెట్‌ నెంబర్లు లేవని సెప్టెంబర్‌ 23న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ పరీక్షలు రద్దు చేసింది. పరీక్ష రెండుసార్లు రద్దు కావడం నిరుద్యోగుల్లో అసంతృప్తికి బీజం పడింది, ఆగ్రహజ్వాలలకు దారితీసింది. తదుపరి వెంటనే వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి ఆకర్షితులై నిరుద్యోగులు ఆపార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దోహదపడ్డారు. 2024 ఫిబ్రవరి 19 నాడు మరో 60 పోస్టులు కలిపి 563 పోస్టులకు తిరిగి కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. జీవో 55ను రద్దు చేస్తూ 29ని జారీ చేసింది. దీనివల్ల రిజర్వుడ్‌ కేటగిరి అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇక టీజీపీఎస్సీ బాధ్యతలలో ముఖ్యమైనవి – పేపర్‌ సెట్టింగ్‌, పరీక్ష నిర్వహణ మూల్యాంకనం, ఫలితాల ప్రకటన. ప్రశ్నాపత్రం తయారీకి కమిషన్‌ నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపిక చేయకపోవడం వల్ల పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో 10, 11 తప్పులున్నట్లు అభ్యర్థులు ఆరోపించారు. పరీక్ష నిర్వహణ అస్తవ్యస్తంగా సాగింది. సహజంగా ప్రిలిమ్స్‌ పరీక్షకు క్వాలిఫై అయి మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్‌ నెంబర్‌ ఉంటుంది. కానీ టీజీపీఎస్సీ ఈసారి మెయిన్స్‌ పరీక్షకు మరొక హాల్‌టికెట్‌ నెంబర్‌ కేటాయించడంలోనే అభ్యర్థులు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల కేటాయింపులలోను గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపణలున్నాయి. హాజరైన అభ్యర్థుల సంఖ్య కూడా 21075 నుండి 21085కు పెరిగింది. పక్క పక్కన, దగ్గర దగ్గర, వరుస హాల్‌ టికెట్‌ నెంబర్‌లపై పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం పరీక్షా నిర్వహణ విధానాన్ని మొత్తాన్ని ప్రశ్నిస్తోంది. ఇలాంటివి కొన్ని వందల కేసులు ఉన్నాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో బాగా మార్కులు సాధించిన వారు 72శాతం నుండి 76శాతం ఉండగా కొన్ని కేంద్రాల నుండి పరీక్ష రాసిన వారు 22నుండి 38శాతం మాత్రమే ఉండడం గమనార్హం. టాపర్ల జాబితాలోనూ కేవలం రెండు సెంటర్ల నుండే 74 మంది ఉన్నారు. మొత్తం 719 మందికి ఒకే మార్కులొచ్చాయి. ఇవన్నీ మూల్యాంకనం తర్వాత బయటపడ్డ అవకతవకలు.

అసలు మూల్యాంకన ప్రక్రియ బ్లూ ప్రింట్‌ లేకుండానే జరగడం విడ్డూరం. సహజంగా రాష్ట్రంలో నిర్వహించే పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రమాణంగా భావిస్తారు. వాటిలోని సమాచారమే ప్రామాణికమైనదిగా స్వీకరించి మూల్యాంకనం ఉంటుంది. కానీ విచిత్రంగా మన సర్వీస్‌ కమిషన్‌ వికీపీడియాలోని సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని మార్కులు కేటాయించడం దారుణం. కొత్తగా డిగ్రీ కళాశాలలకు లెక్చరర్లుగా పదోన్నతి పొందినవారు, కాంట్రాక్టు సిబ్బంది కోచింగ్‌ సెంటర్ల ఫ్యాకల్టీ కూడా ఈ మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనడం న భూతో న భవిష్యతి. తెలుగు మీడియం పేపర్లు కూడా ఇంగ్లీష్‌ మీడియం ఎగ్జామినర్లు దిద్దడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇంగ్లీష్‌ మీడియం అభ్యర్థులు దాదాపు 90 శాతం ఎంపిక కాగా తెలుగుమీడియం అభ్యర్థులు పదిశాతంలోపే ఉండడం అనుమానాలను బలపరు స్తున్నాయి. ఏ రకమైన మెటీరియల్‌ అందుబాటులో లేకున్నా ఉర్దూ మీడియం అభ్యర్థి టాప్‌ మార్కులతో నిలవడం దేనికి సంకేతం? అసలు చేతిరాత చూసి మార్కులు వేసి అభ్యర్థుల తలరాత మార్చే శారని వింటున్నాం. రోజుకు వందకు పైగా జవాబు పత్రాలు దిద్దడం ఎలా సాధ్యమవుతుంది? రీకౌంటింగ్‌ కూడా హడావుడిగా ఆరు రోజుల్లోనే తొమ్మిది వేల పేపర్లకు పూర్తి చేశారు.

ఈ యేడు మార్చి 10న సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలు విడుదల చేసి ఆ తర్వాత ర్యాంకుల జాబితా కూడా ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ కూడా పూర్తిచేసింది. ఈ దశలోనే అన్యాయం జరిగిందనుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన మన ఉన్నత న్యాయస్థానం ఈనెల పదిన 222 పేజీల తుదితీర్పు వెలువరించింది. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలు సజావుగా జరగలేదని సింగిల్‌ బెంచి ధర్మాసనం అభిప్రాయపడింది. పారదర్శకత లోపించిందని కమిషన్‌ తాను నిర్దేశించుకున్న నిబంధనలను తానే ఉల్లంఘించిందని కోర్టు ఆగ్రహించింది. పునర్మూల్యాంకనం లేదా పునర్నిర్వహణ జరగాలని, ఆ ప్రక్రియ అంతా ఎనిమిది నెలలలోనే పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. మెరిట్‌ లిస్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఇన్ని అవకతవకలకు బాధ్యులెవరన్న చర్చ పక్కన పెడితే లిస్టు ప్రకారం ఎంపికైన నిజమైన అభ్యర్థుల భవితవ్యమేమిటి? పునర్‌ మూల్యాం కనంలో లోపాలు జరగవన్న గ్యారెంటీ ఏముంది? డివిజన్‌ బెంచికో లేక సుప్రీంకోర్టుకో సర్వీస్‌ కమిషన్‌ వెళ్లాలని నిర్ణయిస్తే అది ఎంత కాలయాపనకు దారి తీసేనో? ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలు చేత మరణించారని తెలుస్తోంది.

ఇవన్నీ అభ్యర్థులలో అసహనానికి, ఆందోళనకు దారితీసే కారణాలు. ప్రభుత్వాలకు పరీక్షలు నిర్వహించడం చేతకాదా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మంత్రులు పోస్టులమ్ముకు న్నారని ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అసలు 14 కేసులు కోర్టులో ఉండగా ప్రభుత్వం ఎందుకు పరీక్ష నిర్వహించవలసి వచ్చిందో ప్రభుత్వం లేదా కమిషన్‌ జవాబు చెప్పాలి. జీవో 29కి వ్యతిరేకంగా అభ్యర్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీఛార్జ్‌ చేసి మరీ పరీక్ష నిర్వహించవలసిన అగత్యం ఉన్నదా? అయినా రెండున్నర లక్షల మంది దరఖాస్తు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోదలచారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ రాదని, డిఏ, పిఆర్సీలు అమలు కావని తెలిసి కూడా తాము ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి ప్రజలకు సేవ చేయాలనుకున్న వారు ఈ విధంగా నిరుత్సాహానికి గురి కావడం వ్యవస్థ మనుగడకు శ్రేయస్కరం కాదు. నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వాలది లేదా చట్టబద్ధ సంస్థలదేనని గుర్తుంచుకోవాలి. హామీలిచ్చి గద్దెనెక్కిన పార్టీలు వాటిని నిలబెట్టుకోకపోతే చరిత్రహీనులవుతారు.

శ్రీశ్రీ కుమార్‌ 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -