Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమీడియా నియంత్రణ బిల్లుకు మాల్దీవుల పార్లమెంట్‌ ఆమోదం

మీడియా నియంత్రణ బిల్లుకు మాల్దీవుల పార్లమెంట్‌ ఆమోదం

- Advertisement -

మాలే : పాత్రికేయులు, ప్రతిపక్ష పార్టీల నిరసనల నేపథ్యంలో మాల్దీవుల పార్లమెంట్‌ వివాదాస్పద మీడియా-బ్రాడ్‌కాస్ట్‌ రెగ్యులేషన్‌ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పత్రికా స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెడుతోంది. పత్రికా స్వేచ్ఛను అంతమొందించేందుకు, మీడియా స్వతంత్రతను దెబ్బతీసేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నారని మాల్దీవుల జర్నలిస్ట్‌ సంఘం గత నెలలోనే మండిపడింది. బిల్లును పాత్రికేయులు ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ 60 మంది ఎంపీలు దానికి అనుకూలంగా ఓటేశారు. దేశాధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజు నేతృత్వంలోని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు 93 మంది సభ్యులున్న పీపుల్స్‌ మజ్లిస్‌ ( పార్లమెంట్‌)లో మెజారిటీ ఉంది. ప్రతిపక్ష సభ్యుడొకరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ప్రతిపక్ష మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులను అంతకుముందే పార్లమెంట్‌ నుంచి తొలగించారు.

చర్చకు ముందు బిల్లును పరిశీలించడానికి కనీసం పదిహేను నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని ప్రతిపక్ష ఎంపీ అమీన్‌ ఫైసల్‌ విమర్శించారు. దేశంలో ఉనికిలో ఉన్న మాల్దీవుల మీడియా కౌన్సిల్‌, మాల్దీవుల బ్రాడ్‌కాస్టింగ్‌ కమిషన్‌లను రద్దు చేసి వాటి స్థానంలో మాల్దీవుల మీడియా-బ్రాడ్‌కాస్టింగ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. కమిషన్‌లోని మొత్తం ఏడుగురు సభ్యుల్లో ఛైర్మన్‌ సహా ముగ్గురిని దేశాధ్యక్షుడు నియమిస్తారు. మిగిలిన నలుగురినీ మీడియా సంస్థలు ఎంపిక చేస్తాయి. అయితే వారిని దేశాధ్యక్షుడు తొలగించవచ్చు. మీడియా సంస్థలపై కమిషన్‌కు విశేషాధికారాలు ఉంటాయి. దుష్ప్రచారాన్ని, విద్వేష ప్రసంగాలను కట్టడి చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -