- 22 నుంచి ఆఫర్లు ప్రకటించిన ప్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రం జిఎస్‌టి శ్లాబులను మార్చింది. జనానికి ఎంత లాభమో స్పష్టత లేదుగానీ, ఇప్పుడు దాన్ని అడ్డంపెట్టుకుని పలు కంపెనీలు ఆఫర్ల పేరుతో సరుకు అమ్ముకునేందుకు భారీగా వ్యూహం పన్నాయి. ఈ నెల 22 నుంచి జిఎస్‌టి కొన్ని వస్తువులపై పెంచారు. కొన్నింటిపై తగ్గించారు. ధరల్లోనూ ఈ వ్యత్యాసాలు ఉంటాయి. దీన్ని పలు వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం వినియోగించుకునే ప్రక్రియను చేపట్టాయి. జిఎస్‌టి తగ్గిందనే ప్రచారంతో మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలు వస్తువుల కొనుగోళ్లపై ఇప్పటికే దృష్టి సారించాయి.
ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ఇప్పుడు చిన్నకార్ల వినియోగం పెరిగింది. ఈ నెల 22 నుంచీ కార్ల ధరలు తగ్గుతాయనే ధీమాతో ఉన్నారు. ఎందుకంటే చిన్నకార్లపై జిఎస్‌టి 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది (పెద్ద కార్లపై 40 శాతం పెంచారు). దీంతో, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగింది. కార్ల కంపెనీలు కూడా ఇటీవల ఆఫర్లు ప్రకటించి కార్లను భారీగానే అమ్మాయి. ఇప్పుడు జిఎస్‌టి తగ్గినందున కార్ల ధరలు ఎంతోకొంత తగ్గించాలి. జిల్లాల్లో ఎన్నో విదేశీ కార్ల షోరూములు పెట్టారు. జనం కార్ల షోరూములకు వెళ్లి మోడళ్లను చూసుకుంటున్నారు.
ఇప్పుడున్న ధరలు ఎంత? జిఎస్‌టి తగ్గించాక ఎంతధర తగ్గుతుందనే సమాచారం తీసుకుంటున్నారు. మోటారు సైకిళ్లపైనా జిఎస్‌టి తగ్గించారు. వీటి ధరలు కూడా తగ్గనున్నాయి. జిఎస్‌టి తగ్గుతుందనే చర్చతో చాలామంది కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఇక ప్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర వంటి ఆన్‌లైను పోర్టర్లు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెల 22 నుంచీ ప్రత్యేక డిస్కంట్ల పేరుతో వస్తువులను భారీగా అమ్మడానికి ప్రచారం మొదలు పెట్టాయి. యువత ఆఫర్ల సమయం కోసం, తమకు కావాల్సిన వస్తువులను ఆ రోజు బుక్ చేసుకునేందుకు ఎదురుచూస్తోంది. అన్ని రకాల బ్రాండెడ్ వస్తువులపై ఆఫర్లు ఇచ్చారు. సెల్‌ఫోన్ల ధరలూ తగ్గిస్తున్నారు. అన్ని విదేశీ కంపెనీలు తమ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులపై భారీగా తగ్గింపు ఇస్తున్నాయి. 40 నుంచి 50 శాతంపైగా డిస్కౌంటు ఇచ్చే వస్తువులను పోర్టర్లలో ముందుగానే పెడుతున్నారు.
వాటికోసం ఎగబడుతున్నారు. ఆన్‌లైన్లో కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇప్పుడు దుకాణాల్లో కొంటే ధరలు తగ్గింపు తక్కువగా ఉంది. దీంతో, ఇప్పుడు వ్యాపారంలో 50 శాతంపైగా కొనుగోళ్లు ఆన్‌లైను పోర్టర్లలోనే నడుస్తున్నాయి. వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా అమ్మకాలకు అవకాశం కల్పించింది. వీటివల్ల పట్టణాల్లో ఎప్పటి నుంచో ఉన్న దుకాణాల వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. ఇక్కడ దుకాణంలోకొనే వస్తువు ధరకూ, ఆన్‌లైన్‌లో కొనే అదే వస్తువు ధరకూ తేడాలు ఉంటున్నాయి. అందుకే యువతకు ఆన్‌లైన్ వైపే అలవాటైపోయింది. జిఎస్‌టి తగ్గింపు పేరుతో కంపెనీలు ఎప్పటి నుంచో నిల్వలుగా పేరుకుపోయిన వస్తువులను అమ్ముకునేందుకు భారీగా వ్యూహం వేశాయి.