Saturday, September 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆల్మట్టి ఎత్తు పెంపుతో మరణశాసనమే

ఆల్మట్టి ఎత్తు పెంపుతో మరణశాసనమే

- Advertisement -

రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై మహౌద్యమ నిర్మాణం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు కర్నాటక కాంగ్రెస్‌ మరణశాసనం రాసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర చేస్తుంటే సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. దాని ఎత్తు పెరిగితే కృష్ణా జలాల్లో తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో కేసుండగా కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయం తీసుకుంటే రేవంత్‌ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? మహారాష్ట్ర సీఎం స్పందించినా రేవంత్‌కు చలనం రాదా? 5 ఫీట్ల ఎత్తు పెంచడానికే రూ.70 వేల కోట్ల నిధుల్ని ఖర్చు చేస్తుంటే, 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేయడంలో తప్పేం ఉంది? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్నాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుని మూడు రోజులైనా రేవంత్‌ రెడ్డికి చలనం లేదని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదనీ, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించారు.

ఈ కుట్రపై ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలని సూచించారు. కర్నాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహౌద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పనికిరాకుండా పోతుందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ హయాంలో 90 శాతం పనులు పూర్తైన పాలమూరు రంగారెడ్డి పథకం నిర్వీర్యమవుతుంటే రేవంత్‌ చూస్తూ ఊరుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతేకాదు కర్నాటక నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జూరాలే నిండదన్న కేటీఆర్‌, రేవంత్‌ మొదలుపెట్టిన నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోత ల పథకం కూడా పడావు పడుతుందని హెచ్చరించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ చేసిన అవినీతి ఆరోపణలను కేటీఆర్‌ తిప్పికొట్టారు. కేవలం ఐదు అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే రూ.70 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు లక్షా 30 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నామని కర్నాటక ప్రభుత్వం చెపుతుందని తెలిపారు.

మరి 5 అడుగుల భూసేకరణకే అంత ఖర్చయితే, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంపింగ్‌ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్‌, 1,700 కిలోమీటర్ల కాలువలు, 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్ల ఖర్చు చేయడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌ లో ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కష్ణా వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌-2 ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిందని తెలిపారు. ఎత్తు పెంపుతో మన రైతాంగ హక్కులు దెబ్బతింటాయని వాదించి స్టే తెచ్చిందని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసి ఆ స్టే కొనసాగేలా చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఏపీకి ధారాధత్తం చేస్తున్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు కృష్ణా జలాలను కర్నాటకకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు జీవనదులపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాస్తున్న ఈ దుర్మార్గ జలదోపిడీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంతో పాటు రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ మహౌద్యమాన్ని నిర్మిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -