Sunday, September 21, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీస్త్రీ స్వేచ్ఛ, సమానత్వానికై బతుకమ్మ

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వానికై బతుకమ్మ

- Advertisement -

స్త్రీల పట్ల వివక్షతలు, వేదనలు, అసమానతలు, అత్తగారింటి ఆరళ్లు, దు:ఖం కన్నీళ్లు నిండిన మహిళల నిస్సహాయత, బతకలేని పరిస్థితి నుండి తమకు తాము ధైర్యాన్ని, ఓదార్పును పొందే సన్నివేశపు వ్యక్తీకరణే బతుకమ్మ పండుగ. ఇప్పటికీ మహిళల పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. అందుకే స్త్రీ సాధికారత కోసం నినదించే ఉత్సవంగా ఈ పండుగను కొనసాగించాలి.

మన ఉనికికి మూలం ప్రకృతి, సకల చరాచర ప్రాణులకు జన్మనిచ్చింది ప్రకృతి. ఆ ప్రకృతి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండుగ వేడుక. ఈ పండుగ ఒక ఉత్సాహం, ఉల్లాసమే కాదు. సంఘ జీవన తాత్వికతకు నిదర్శనం. స్నేహ మాధుర్యాలకు ప్రతీక. అన్నింటినీ మించి ‘బతుకు’ను నిర్వచించే నిలువెత్తు జీవనధనం. ఇలాంటి గొప్ప పండుగను స్త్రీ శక్తికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. బతుకమ్మ పాటల్లోని స్త్రీల మనోభావాల గురించి అనేక పరిశోధనలు జరిగాయి. ఇలాంటి పండుగను ఈ ఏడాది స్త్రీ స్వేచ్ఛకు, సమానత్వానికి ప్రతీకగా జరపుకుందాం. వివక్ష లేని సమాజం కోసం బతుకమ్మ ఆడుదాం..పాడుదాం..

బతుకమ్మ అంటేనే స్త్రీల పండుగ. పూల పండుగ. తెలంగాణ రాష్ట్రానికే సొంతమైన రంగురంగుల పండుగ బతుకమ్మ. వెయ్యేండ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ మహిళా శక్తికి ప్రతీక. పుడమి తల్లి గొప్పతనాన్ని తెలిపే పండుగ. ప్రకృతిని ఆరాధించేందుకు ఈ పండుగ వేదికగా నిలుస్తుంది. అన్నింటికంటే ప్రత్యేకమైనది ఈ పండుగలో స్త్రీలందరూ కలిసి పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ ఆనందోత్సాహాలతో గడుపుతారు. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ సంబరాలలో మహిళల ఆనందం అంబరాన్ని తాకుతుంది. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి సంతోషంగా జరుపుకుంటారు. స్త్రీలు ఎలాంటి అరమరికలు, ఆర్థిక కుల అంతరాల తేడాల్లేకుండా కలిసి నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. తరగని పెన్నిధి లాంటి భావాలు, పాటల నిధులను తమలో నిక్షిప్తం చేసుకున్న పండుగ బతుకమ్మ.

ఇది కేవలం పుష్పార్చన మాత్రమే కాదు. స్త్రీ శక్తి, స్వేచ్ఛ, సమానత్వం, స్వావలంబనకు ప్రతీక. ‘బతుకమ్మ’ అనే పేరు ‘బతుకు’ (జీవితం), ‘అమ్మ'(తల్లి) పదాల నుండి వచ్చి, స్త్రీ జీవన శక్తిని, మాతృ స్వభావాన్ని సూచిస్తుంది. ప్రతి మనిషినీ కదిలించే సాంస్కృతిక ఉద్యమ చేతనం బతుకమ్మ. ఏడాది పొడుగునా ఇంటా, బయటా పనులు చేస్తూ యాంత్రికంగా బతికే స్త్రీలకు బతుకమ్మ ఆటా పాట పెద్ద ఊరుట. ఈ కళారూపంలో వాన, చెరువు, బావి, చేను, మోట, పంట, ఆకుపత్రి, చీరసారెలు, ప్రసాదం అన్నీ వ్యవసాయ సంబంధాల చుట్టూ అల్లుకొంటాయి. కాకతీయుల కాలం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నారు. రాణి రుద్రమదేవి కాలంలో రాజాశ్రయం పొందింది. బతుకమ్మ ఆ స్వతంత్ర స్త్రీల చైతన్యానికి ప్రతిబింబం. నిజాం పాలనలో ఈ పండుగ జరుపుకోవడంలో అనేక ఆంక్షలు వచ్చిపడ్డాయి. అయినప్పటికీ గ్రామీణ మహిళలు రహస్యంగా బతుకమ్మ పండుగ జరుపుకునేవారు. ఇది వారి సాంస్కృతికతకు గుర్తింపు. స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం.

పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమిది రోజులు అ పండుగను జరుపుకుంటారు. అందరూ తమ ఇళ్లలో పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ… పాటలు పాడుతుంటారు. మొదటి నుండి బతుకమ్మ పాటలకు ఎంతో ప్రాధాన్యం వుంది. తెలంగాణ సాయుధ పోరాటం నాటి నుండి ఈ పాటలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. మహిళలు తమ రోజువారీ సమస్యలను, కష్టాలను, బాధలను పాటలుగా కట్టి బతుకమ్మ ఆడేవారు. నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతుంది. స్త్రీల నిత్యజీవన దు:ఖం వెళ్లబోసుకునే పాట ప్రక్రియ ఒక ఆలంబన. పూలతోనే ఇల్లు నిర్మించి, దు:ఖమొస్తే వెక్కి వెక్కి ఏడ్వడం అంతా పాటల్లో వ్యక్తమవుతుంది. మహిళలు, పూల పండుగగా భావించే బతుకమ్మ రోజున లింగ వివక్ష మాసిపోవాలని కోరుతూ అనేక మంది కవులు, రచయితలు పాటలు రాస్తున్నారు. సమాజంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వ వ్యక్తీకరణ
సామాజిక స్వేచ్ఛ: బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు అపూర్వమైన సామాజిక స్వేచ్ఛను పొందుతారు. తమ భావాలను, ఆకాంక్షలను పాటల రూపంలో ముక్తకంఠంతో పాడుకుంటారు, బతుకమ్మ ఆడతారు. వయసు, కుల, మత, ఆర్థిక స్థితి తేడాలు లేకుండా అందరూ కలిసిపోతారు. ఈ వేడుకలో మహిళలే ముఖ్య పాత్రధారులుగా ఉంటారు. పురుషుల అనుమతులు, ఆంక్షలు లేకుండానే పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపునకు మూలస్తంభం. దీని ద్వారా తెలంగాణ భాష, సాహిత్యం బలోపేతమవుతుంది. అంతేకాదు స్థానిక సంప్రదాయాలు తరతరాలకు బదిలీ అవుతున్నాయి.
వ్యక్తిగత స్వాతంత్య్రం: గ్రామాలలో, మహల్లాలలో బతుకమ్మ కమిటీలకు మహిళలే నేతృత్వం వహిస్తారు. కార్యక్రమాల ప్రణాళికలో, అమలులో ముఖ్య పాత్ర వహిస్తారు. కుటుంబ, బంధువుల పరిధిని దాటి విస్తృత సామాజిక నెట్‌వర్క్‌లను నిర్మిస్తారు.
స్త్రీ స్వావలంబనకు మార్గం
ఆర్థిక శక్తీకరణ: బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళలు అనేక ఆర్థిక అవకాశాలను సృష్టించుకుంటున్నారు.
స్వయం సహాయక సంఘాలు: పుష్పాలు, ప్రమిదలు, సాంప్రదాయ వస్త్రాలు తయారుచేసి అమ్ముకుంటారు. చిన్న చిన్న వ్యాపార వ్యవహారాలలో పాల్గొంటారు.
కళా నైపుణ్యం ద్వారా ఆదాయం: పుష్ప అలంకరణ నైపుణ్యం, సంప్రదాయ పాట-నృత్య కళలను బోధించడం, హస్తకళలు వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల వంటి ద్వారా ఆదాయం పొందుతారు.
టూరిజం అభివృద్ధి: బతుకమ్మ పండుగ కారణంగా తెలంగాణకు పర్యాటకులు రావడంతో మహిళలకు గైడ్‌, హోమ్‌ స్టే, ఫుడ్‌ సర్వీస్‌ వంటి అవకాశాలు లభిస్తున్నాయి.
డిజిటల్‌ యుగంలో కొత్త అవకాశాలు
ఈ ఆధునిక కాలంలో మహిళలు సోషల్‌ మీడియా, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా తమ కళలను విశ్వవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా సంప్రదాయ కళలను బోధిస్తున్నారు.
వ్యక్తిత్వ అభివృద్ధి: పండుగ సందర్భంగా మహిళల మధ్య జరిగే చర్చలు వారిలో సామాజిక అవగాహన పెంచేందుకు దోహదపడతాయి. సంఘటితంగా పని చేసే నైపుణ్యం, గ్రూప్‌ డైనమిక్స్‌లో నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతాయి.
ఆధునిక కాలంలో బతుకమ్మ
సర్కారి మద్దతు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. గ్రామాలకు, మొహల్లాలకు పండుగ నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తోంది. మహిళా స్వయం సహాయక సమూహాలకు ప్రత్యేక స్కీమ్‌లు, వ్యవసాయం, చిన్న వ్యాపారాల కోసం సహాయం అందిస్తోంది.

ప్రపంచవ్యాప్త గుర్తింపు
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలో ప్రవాస తెలుగువారు బతుకమ్మ జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ పండుగల్లో బతుకమ్మ ప్రదర్శనలు జరుగుతున్నాయి. యూఎన్‌ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో సైతం బతుకమ్మ జరుపుతారు.
సవాళ్లు
పట్టణీకరణ వల్ల అపార్ట్‌మెంట్‌ సంస్కృతిలో సంప్రదాయ పండుగలు జరుపుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కృత్రిమ పుష్పాల వాడకం పెరుగటం, వాటిని జలవనరులలో విసర్జన వల్ల కాలుష్యం పెరుగుతోంది. పండుగ వాణిజ్యీకరణ వల్ల వాయుకాలుష్యం సమస్యలు ఎదురవుతున్నాయి.
భవిష్యత్‌ అవకాశాలు
అంతర్జాతీయ గుర్తింపు: బతుకమ్మ పండుగను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆడపిల్లల రక్షణ కోసం: పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను కాపాడుకుందాం అంటూ నినదిస్తున్నారు. అలాగే బతుకమ్మ పండుగపై విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు విరివిగా జరుగుతున్నాయి.
సుస్థిర అభివృద్ధి: సేంద్రీయ పుష్ప సాగు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ అభివృద్ధి, పర్యావరణహితంగా జరుపుకోవడం వంటి దిశలో మార్పులు జరుగుతున్నాయి.
బతుకమ్మ గీతాలలో స్త్రీ స్వేచ్ఛ
బతుకమ్మ గీతాలు మహిళల మనోభావాలకు అద్దం పడతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో!’ – ఈ గీతలలో మహిళల స్వేచ్ఛ, స్వాతంత్య్ర చైతన్యం, సమానత్వ భావన ప్రతిఫలిస్తుంది. ఆధునిక కవులు, కవయిత్రులు స్త్రీ విద్య, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, లింగ సమానత్వం గురించి కొత్త గీతాలు రచిస్తున్నారు.
సామాజిక ప్రభావం-మార్పులు
కుటుంబ వ్యవస్థలో మార్పులు: బతుకమ్మ ద్వారా తల్లులు తమ కూతుళ్లకు సాంస్కృతిక విలువలను బోధిస్తారు. వారికి స్వేచ్ఛ విలువలను నేర్పుతారు. వీటి వల్ల యువతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
సమాజంలో మహిళా నేతృత్వం: గ్రామీణ ప్రాంతాలలో మహిళా సర్పంచ్‌లు బతుకమ్మను కేంద్రం చేసుకుని సమాజంలో మార్పులు తీసుకొస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలు ఏర్పడుతున్నాయి. బతుకమ్మ కమిటీల ద్వారా మహిళలు సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
ఆరోగ్య రంగంలో ప్రభావం: పండుగ సమయంలో మహిళలంతా కలిసి ఉల్లాసంగా ఆడిపాడే అవకాశం ఉంటుంది. దీదని వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సామూహిక కార్యక్రమాల వల్ల డిప్రెషన్‌ కూడా తగ్గి ఉత్సాహంగా ఉండగలుగుతారు. సంప్రదాయ నృత్యాల వల్ల శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహారాల గురించి అవగాహన పెరుగుతుంది.

ముగింపు
ఈ రోజు బతుకమ్మ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళా శక్తీకరణకు ప్రేరణోషస్సుగా మారుతోంది. భవిష్యత్తులో ఇది మరింత అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. ఈ పండుగ మహిళలను కేవలం గృహలక్ష్ములుగా చూడడం కాకుండా, సమాజాభివృద్ధికి కృషి చేసే శక్తివంతమైన వ్యక్తులుగా గుర్తించేలా చేస్తుంది. మహిళల్లో బతుకమ్మ పండుగ నింపే శక్తి భవిష్యత్‌ తరాలకు మార్గదర్శనంగా నిలుస్తుంది. బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది తెలంగాణ మహిళల స్వేచ్ఛ, సమానత్వం, స్వావలంబనకు ఒక ప్రతీకగా జరగాలి. మహిళలపై దాడులు, ఆడపిల్లలపై అడుగడుగునా వివక్ష చూపుతున్న సమాజానికి మహిళా శక్తి గురించి అవగాహన కల్పించాలి. అమ్మాయిలూ ఈ సమాజంలో భాగమే, స్వేచ్ఛగా బతికే అవకాశం ఉందని తెలియజేయాలి. అన్ని విధాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. సమాజికి, ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుకు సాగేలా అమ్మాయిలను తీర్చిదిద్దాలి. వీటన్నింటినీ సాధించుకోవడం కోసం ఈ బతుకమ్మ వేదిక కావాలని కోరుకుంటున్నాను.

శ్రీసుధ కొలచన, 9440470674

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -