Sunday, September 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిముప్పేట దాడిలో మీడియా సమరం

ముప్పేట దాడిలో మీడియా సమరం

- Advertisement -

ప్రపంచవ్యాపితంగా యాభై దేశాల్లో రెండువందల మీడియా సంస్థలు సెప్టెంబర్‌ మొదటి తేదీన అంతకుముందెన్నడూ లేని రీతిలో నిరసన తెలిపాయి. మొదటి పేజీని నిరసనాత్మకంగా ప్రచురించి గాజాలో వరుసగా జర్నలిస్టులపై హత్యాకాండనూ, అణచివేతను దృష్టికి తెచ్చాయి. ఇజ్రాయిల్‌-అమెరికా కూటమి కుట్రలకు బలైన గాజాలోనే కాదు, ప్రపంచమంతటా కూడా మీడియా ఇదే విధమైన దాడులకు దౌర్జన్యాలకూ గురవుతున్నది. మీడియా స్వరూపం అనేక కొత్త రూపాల్లోకి మారిన నేపథ్యంలో అవన్నీ కూడా ఈ దాడికి నలిగిపోతుండడం ఇప్పటి ప్రత్యేక సవాలు. నిజానికి ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వరకూ ప్రతిచోటా ఇదే పరిస్థితి. భారతదేశంలో సంఘ పరివార్‌తో పాటు మోడీ ప్రభుత్వం ప్రత్య క్షంగానూ భావజాల పరంగానూ విమర్శకులపై దాడికి దిగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ప్రధాన పాలక పార్టీలూ విమర్శించే మీడియాను ఆడిపోసుకోని రోజుండటం లేదు. ఇదిగాక సినీ సాంస్కృతిక రంగాలకు సంబంధించి కూడా కార్పొరేట్‌ పడగనీడన ప్రగతి నిరోధక శక్తులు మీడియాను వేటాడుతున్నాయి. ఈ దాడిని మూడు రకాలుగా చూడొచ్చు. మొదటిది-అధికారంతో రాజకీయ ప్రాబల్యంతో, రెండు- అభివృద్ధి నిరోధక ఫాసిస్టు తరహా భావజాలంతో, మూడు- కార్పొరేట్‌ యాజ మాన్య పద్ధతులు, ప్రలోభాలతో. అధికారంలో ఉన్నవారు అరెస్టులు, కేసులు, ఆంక్షలు, అణచి వేతలతో అడ్డుకుంటారు. అభివృద్ధి నిరోధక కార్పొరేట్‌ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, బలమైన ప్రత్యామ్నాయ శక్తులకు చోటు కల్పించకుండా దిగ్బంధం చేస్తారు.

ట్రంప్‌ వేషాల మధ్య..
ఈ సమయంలోనే చూడండి-అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేరుగా మీడియాపై విరుచుకు పడటమే గాక డెమోక్రాట్లను బలపర్చిన న్యూయార్క్‌టైమ్స్‌పై పరువు నష్టం కేసు వేశారు.(కాకపోతే కోర్టు కొట్టివేసింది) మీడియా గోష్టులలో నేరుగా విలేకరులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు, బెదిరింపులు దిగుతున్నారు. అమెరికా సైనిక కేంద్రమైన పెంటగాన్‌నుంచి వార్తలు సమాచారం సేకరించేవారు తాము నిబంధనలు పాటిస్తామని ముందే హామీపత్రం రాసివ్వాలనీ, ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలో కూడా ఆంక్షలు అనుసరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికా, అందులోనూ ట్రంప్‌ ఉన్మాదాహంకార పాలనలో కుట్రలూ కుత్సితాలతో చెలరేగిపోతుంటే, ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా బహిరంగ విధానమే తీసుకున్నా రన్నమాట. మరో పెద్ద విపరీతం ఏమిటంటే ట్రంప్‌ రక్షణశాఖకు యుద్ధశాఖ అని పేరు మారుస్తున్నారు. 1949 వరకూ ఆపేరే ఉంటే తర్వాత మార్చారు. కాని నేరుగా యుద్ధశాఖ అనడమంటే ఎవరో ఒకరిమీద యుద్ధం చేయడం, యుద్ధాలను రెచ్చగొట్టడమే విధానమని ప్రకటించుకోవడమే కదా. వీటన్నిటికీ కేంద్రం పెంటగాన్‌ గనకే ఈ ఇనుపతెర.ప్రపంచంలో మొదటి ప్రజాస్వామ్య దేశమని తమకు తామే కితాబిచ్చుకుని పత్రికాస్వాతంత్య్రం కోసం తొలి రాజ్యాంగ సవరణ తెచ్చామనే చోటనే ఇంత ప్రత్యక్షదాడిని ఎలా చూడటం? అమెరికా మీడియా మొత్తంగా మితవాదం గుప్పిట్లోకి పోయిందని గార్డియన్‌ ఇటీవల పతాకశీర్షిక ప్రచురించింది. సిబిఎస్‌ దానికి అనుబంధమైన పారమౌంట్‌ సంస్థలు నేరుగా ట్రంప్‌కు వంతపాడుతుంటే రూపర్ట్‌మర్డోక్‌ ఫ్యాక్స్‌న్యూస్‌ కూడా అటూ ఇటూ తిరిగి ఆ వైపే మొగ్గుతున్నాయి. ఏమంటే ట్రంప్‌ వచ్చాక వారి షేర్లధరలు నలభై శాతం పెరిగాయట. న్యూయార్క్‌ టైమ్స్‌ మొన్నటి ఎన్నికల్లో కూడా నేరుగా కమలాహారిస్‌ను బలపర్చింది గానీ విధానాల పరంగా ఆ పరిధికి భిన్నమేమీ కాదు.మొత్తంపైన వేలమంది పాత్రికేయుల తొలగింపు,ఆంక్షలు భారాల పెంపు, హామీల రద్దు వంటివాటితో కూడా కార్పొరేట్‌ సంస్థలు లొంగదీసుకుంటున్నాయని రిపోర్టర్స్‌ శాన్స్‌ బార్డర్డ్‌(సరిహద్దులులేని విలేకరులు) అనే సంస్థ సవివరంగా ప్రకటించింది. భారతీయులతో సహా ట్రంప్‌ తాకిడికి గురవుతున్న తీరు చూస్తున్నాం గానీ ఈ కొత్త ఆంక్షల్లో సోషల్‌మీడియా ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించడం గమనించదగింది. గాజాలో జర్నలిస్టులు నేరుగా పోస్టులు పెట్టి ప్రాణాలు కోల్పోతుంటే పట్టలేదు గానీ అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు, బుద్ధిజీవులు పాలస్తీనాకు సంఘీభావం చెప్పడాన్ని నిషేధించడం చూస్తున్నాం.

మోడీ మేనేజిమెంట్‌లో..
ఇక స్వదేశానికి వస్తే మోడీ సర్కారు మీడియాపై ఉక్కు పిడికిలి అంతకంతకూ బిగిస్తున్న పరిస్థితి.మీడియా స్వేచ్ఛకు సంబంధించిన సూచికలో మన దేశం 180 దేశాల్లో 151 స్థానంలో ఉంది. ఈ విషయమై ఆర్జెడి సభ్యుడు మనోజ్‌కుమార్‌ పార్లమెంటులో ప్రశ్న వేస్తే సమాచార పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎల్‌ మురుగన్‌ సమాధానమే దాటేశారు. దేశంలో 1,54,000 ప్రచురణలు నడుస్తున్నాయనీ,700 ప్రయివేటు టీవీ ఛానళ్లు ఉన్నాయనీ,అసంఖ్యాకమైన యూట్యూబ్‌ ఛానళ్లున్నాయని ఏవేవో లెక్కలతో సరిపెట్టారు.1995 కేబుల్‌టీవీ నెట్‌వర్క్‌, 2021 ఐటి చట్టం దేశంలో మీడియాకు వర్తిస్తాయని పైపైనే జవాబిచ్చారు. అంతేగాని మీడియాస్వేచ్ఛకు సంబంధించి ఎందుకు వెనకబడి పోయామన్నది మాత్రం మాట్లాడలేదు. ఎమర్జన్సీ యాభై ఏండ్ల సందర్భంలో అప్పటి సెన్సార్‌ షిప్‌ను అప్రజాస్వామిక పోకడలను ఖండించేప్పుడు ప్రస్తుత పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా ఉందని మీడియా విమర్శకులు సోదాహరణంగా చెబుతున్నారు. వాస్తవానికి భారత ప్రధాన మంత్రిగా మోడీ ఇంతవరకూ ఒక్క మీడియా గోష్టి కూడా జరిపింది లేదు. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 2002 జాతిహత్యాకాండ గురించి గట్టిగా అడిగినందుకు టీవీ ఇంటర్య్యూ నుండి లేచిపోయారు. దానినుంచి మీరు నేర్చుకున్న గుణపాఠమేమిటని ఎవరో అడిగితే మీడియా మేనేజిమెంటు బాగాచేసి ఉండాల్సిందన్నారు. అంతేగానీ మత రాజకీయాలు, పాలనలో ప్రజాస్వామ్యం వంటివాటి జోలికిపోలేదు.ప్రధాని అయ్యాక మోడీ ఆ పాఠమే అమలు చేసి నిర్ధాక్షిణ్యంగా, నిక్కచ్చిగా మీడియా మేనేజిమెంటు మొదలెట్టారు. అస్మదీయ మీడియాకు వేల కోట్ల రూపాయల అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తూ గోడీ మీడియాను సృష్టించుకున్నారు.టీవీ ఛానళ్లు పత్రికలు మొత్తంగా గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సోషల్‌మీడియాలే సంఫ్‌ుపరివార సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నారు. మోడీ భజన, ప్రత్యర్థులపై ప్రగతిశక్తులపై విష విద్వేష ప్రచారానికి అవి పనిముట్టుగా మార్చుకున్నారు. ఈ అదుపాజ్ఞలు, నియంత్రణలు, ప్రలోభాల మధ్య మీడియా మోడియాగా మార్చివేయబడింది. ఇందుకు కార్పొరేట్‌ శక్తుల అండదండలు పుష్కలం. అదానీ మిగిలిన రంగాలను ఆక్రమించడంతో పాటు మీడియాలోనూ నలభై శాతం కైవసం చేసుకున్నారు.ఎన్‌డిటివి కన్నా ఇందుకు మరో ఉదాహరణ ఉండదు. ఇంతచేసినా కొరకరాని కొయ్యలా ప్రజాస్వామ్యం, లౌకిక భావజాలం,సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం అనే మీడియాను అణచివేసేందుకు రాజ్యబలాన్ని, ధనబలాన్ని విచ్చలవిడిగా ప్రయోగించడం పరిపాటిగా మారింది.న్యూస్‌క్లిక్‌, వైర్‌ వంటివాటి విషయంలో జరిగిందేమిటో దేశమంతా చూసింది.

అదానీ రక్షణలో
వైర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ కథనాలు తీసివేయించడమే గాక కొంతకాలం అందుబాటులో లేకుండా చేశారు.తీరా చూస్తే అప్పుడు ఏం జరిగిందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక అదానీపై అమెరికా మీడియాలో కథనాలు ఆరోపణలు వచ్చినా మన దేశంలో మాత్రం బడా మీడియాలో ఆపగలిగారు.ఇప్పుడు ట్రంప్‌తో దాగుడు మూతల వెనక ఆ ప్రభావం కూడా ఉందనే అంచనాలున్నాయి.తాజాగా సెబీ ద్వారా అదానీకి క్లీన్‌చిట్‌ ఇప్పించారు. మరోవైపున రవినాయర్‌, అభిర్‌దాస్‌గుప్తా తదితర జర్నలిస్టుల బృందం పదిమంది అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌(ఎఇఎల్‌)నిర్వాకాలపై పరిశోధనాత్మక కథనం ప్రచురించకుండా ఢిల్లీ కోర్టు స్పెషల్‌ జడ్జి ద్వారా ఉత్తర్వు వెలువడింది.దాన్ని ఎత్తివేయాలని వారు కోర్టుకు వెళ్తేే ఆలస్యం చేసి మొన్న బుధవారం నాడు ప్రచురణకు అనుమతించింది. అయితే వాటి నిజానిజాలు ఏమిటో ఈదశలో నిర్ధారణ చేయలేమని కూడా ముక్తాయించారు.ఈ కేసులో పిటిషనర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప పరంజయ గుహఠాకూర్‌ తదితరులకు వర్తించబోదని మెలికపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కనీసం పదిహేను మంది జర్నలిస్టులపై నిర్బంధానికి పాల్పడి నోరునొక్కేందుకు ప్రయత్నించింది, అరెస్టులు చేసింది.హత్రాస్‌ ఘటనలో సిద్ధిక్‌ కప్పన్‌ దీర్ఘకాలం జైలులో మగ్గవలసి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోనైతే రోడ్డు కాంట్రాక్టు మాఫియాపై కథనాలు రాసిన ముఖేశ్‌ చంద్రాకర్‌ మరణ ఉదంతం సంచలనం కలిగించింది, ఆఖరుకు మామూలు యూట్యూబర్లను కూడా వీరు వదలిపెట్టడం లేదు. బీజేపీ అధికారంలో లేని తమిళనాడు, కర్నాటక వంటి చోట్ల సంఘ పరివార్‌ సంస్థలు కేసులతో దాడి చేస్తాయి.ప్రసిద్ధ రచయితలుగా స్టార్టప్‌ కమెడియన్లుగా ఉన్నవారు కూడా ఈఉచ్చులో చిక్కిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే.ఈ ప్రయివేటు కేసులకు పోలీసులు ఎక్కడ లేని విలువనిచ్చి ఆగమేఘాల మీద వారి నోరునొక్కేందుకు దిగిపోతున్నారు.సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు పలు తీర్పులిచ్చినా మొత్తం నడక అటే.

రెండు శిబిరాలుగా…
తెలుగు మీడియాలోనూ ఈ లక్షణాలు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రముఖంగా వెలువడే పత్రికలు ప్రసారమయ్యే చానళ్లలో ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరగడమే గానీ దేశాన్ని పాలించే బీజేపీకి, మోడీ సర్కారుకు వ్యతిరేకంగా విమర్శనా త్మక కథనాలు నామమాత్రంగా మారిపోతున్నాయి. వాటి యాజమాన్య స్వరూపంలోనూ మార్పులు వచ్చేశాయి. చెప్పాలంటే ఒక ప్రముఖ పత్రికలో ఎడిట్‌పేజీ వ్యాసాలు కూడా అభిప్రాయ ప్రకటనలుగాగాక కాలక్షేప సాధనాలుగా మారాయి. మొత్తం 16 లేదా20 పేజీల్లో రాజకీయేతర సమాచారం కథలు కబుర్లు పెద్ద భాగం ఆక్రమిస్తున్నాయి. ఇక ఆ పత్రికలు, ఛానళ్లు, ప్రాంతీయ పార్టీల పట్ల తమ అను కూల ప్రతికూలతలను బట్టి అస్మదీయ తస్మదీయ పాత్ర పోషిస్తుంటాయి. ఒకరు ఏం చేసినా తప్పు పట్టడం, ఒకరు ఏం చేసినా పొగడటం వాటి ఏకైక సూత్రం. జాతీయంగా మోడీ మోతే. ఏవో కొన్ని స్వల్ఫ మినహాయింపులు లేవని కాదుగానీ ప్రజాసమస్యల విస్తృత కోణం మాత్రం మాయమైపోవడం ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యం.ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రమాణస్వీకార వేదికనుంచే నచ్చని మీడియాపై దాడి ఎక్కు పెట్టారు. తర్వాత సోషల్‌మీడియాపైనా కేసులు, అరెస్టులు నడిచాయి. ఇప్పుడు చూస్తే టీడీపీ కూటమిలోనూ అంతకు పెద్ద భిన్నమైన పరిస్థితి కాదు.డబులింజన్‌ సర్కార్‌ అంటూ కేంద్ర పద్ధతులను ఇక్కడ అమలు చేస్తూ ప్రత్యర్థి మీడియాపై కేసులు నడిపిస్తున్న స్థితిపై ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సోసైటీ(ఐఎన్‌ఎస్‌) ఎడిటర్స్‌ గిల్డ్‌ వంటివి కూడా నిరసన చెబుతున్నాయి.మెడికల్‌ కాలేజీల ప్రయివేటీకరణ, విశాఖ ఉక్కు అమ్మకం పథకాల వంటివాటి పైన కూడా ఈ మీడియాల కథనాలు వాటి వాటి కోణంలో ఉంటున్నాయే తప్ప విశాల ప్రజా ఉద్యమ ప్రతిధ్వనులుగా లేవు. టీటీడీతో సహా ఆలయాలు, మత వ్యవహారాల పైన కూడా ఇదే ద్వంద్వవైఖరి.
తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కూడా ఇదే ఘర్షణ, ప్రతిధ్వనులు మీడియాలో చూస్తుంటాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిట్‌ చాట్‌ సంప్రదాయంతో కొంత సమాచారం పంచుకోవడానికి ప్రయత్నించడం గతంలో కేసీఆర్‌ అనుసరించిన పద్ధతికి భిన్నంగా నడుస్తున్నది. కానీ, మీడియా లక్షణాల్లో పెద్ద తేడా లేదు. బీజేపీ జాతీయంగా పోషించే పాత్ర ఇక్కడా చూపించడంతో పాటు వీలుచిక్కినప్పుడల్లా మతతత్వ కోణాలు తీసుకురావడం, కేంద్రం అధికారాన్ని ప్రదర్శించడం అదనం. రెండు చోట్లా కూడా సమస్యలపై విధానపరమైన అంశాల కన్నా వ్యక్తిగత దూషణలు, చవకబారు సవాళ్లు మీడియా చర్చలను ఆక్రమించడం రివాజుగా మారిపోయింది. మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ ప్రజాస్వామిక లౌకికభావుకులు, సంస్థలూ తమ పాత్ర నిర్వహిస్తున్నా అవకాశవాద ధోరణులు కూడా తొంగిచూస్తుంటాయి. ఆ ముసుగులో పార్టీలకు వంతపాడటం, స్వప్రయోజనాలు సాగించుకోవడం, రకరకాల పిల్లిమొగ్గలతో దారితప్పించడం చూస్తుంటాం. అన్ని కోణాలూ ఒకేచోట పరిశీలించడం సాధ్యం కాని పని.అయితే ప్రజావరణంలో మీడియా భావస్వేచ్ఛను కాపాడుకోవడం,ఇందుకోసం పనిచేసేవారికి రక్షణ ఉండేలా చూడటం మాత్రం అత్యవసరం. ఆ పైన ఎవరు, ఎందుకు, ఏం చెబుతున్నారు, చూపిస్తున్నారనేది ప్రజలు అప్రమత్తంగా నిర్ణయించుకో గలరని విశ్వసించాలి. ఆ అవగాహనా పెంచాలి.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -