మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన వివాహ వ్యవస్థను ఇతర దేశాల వారు ఎంతో గౌరవిస్తారు. నేటి కాలంలో వివాహం దాని, ప్రాముఖ్యత తెలియక తెలుసుకోక చిన్న చిన్న విషయాలకే గొడవలు తెచ్చుకొని విడాకుల వరకు తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు ఎదుటి వారి బలహీనతలను, బలాలను అర్థం చేసుకొని దంపతులిరువురూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, జీవితంలో కష్టసుఖాలను పంచుకుంటూ ముందుకు వెళితే అది పండంటి సంసారం అవుతుంది. సంసారాన్ని నిలుపుకోవడం కోసం చిన్న చిన్న మెళకువలు తెలుసుకుంటూ కొంత లౌక్యంతో వ్యవహరిస్తే ఆ సంసారం సంతోషంగా సాగుతుంది.
దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోవడం తలరాత మీదనో అదృష్టం మీదనో ఆధారపడి ఉండదు. దానికోసం భార్యాభర్తలు ఇరువురూ కలిసికట్టుగా కృషి చేయాలి. నమ్మకంతో ఉండాలి.
ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. వాటిని ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూస్తూ భాగస్వామి గురించి ఏదో ఒక అభిప్రాయాన్ని స్థిరపరచుకుని జీవితాంతం అదే భావనతో ఉండకూడదు.
మార్పు నిత్యనూతనం. తనలోని బలహీనతలను గుర్తించి నిరంతరం వాటిని సరిదిద్దుకుంటూ, ఎదుగుతూ మార్పుకు గురవుతున్న భాగస్వామిని ఎప్పటికప్పుడు తాజాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలంటే దానికోసం ఏమిచేయాలో ఎలా ఉండాలో తెలుసుకుందాం. కుటుంబానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అయినా భాగస్వామి పాత్ర అవసరం. తద్వారా ఇరువురూ తమకు చేతనైనంత స్థాయిలో బాధ్యతలు నెత్తిన వేసుకొని కష్టపడి పనిచేస్తారు. ఇద్దరూ సంసార రథానికి చక్రాలు కావడంవల్ల ఒకరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవడం వలన, శారీరక శ్రమతో పాటు తగిన విశ్రాంతి లభించక పోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు, చికాకులు కలగడం సహజం. వీటి నుంచి కొంచం రిలాక్స్ అవ్వాలంటే ఇద్దరు ఏదైనా విహార యాత్రకు వెళ్లి ఏకాంతంగా గడిపి వస్తే శారీరకంగా, మానసికంగా కొత్తశక్తిని పుంజుకున్న వారవుతారు.
భార్యాభర్తలు పదిమందిలో ఉన్నప్పుడు ఒకర్నొకరు విమర్శలు చేసుకోవడం తగదు. ఒకరు చేయలేని పనులను రెండోవారు పూర్తి చేయగలిగేలా వుండాలి. పూర్తి బాధ్యత తీసుకునే నేర్పు, ఓర్పు వుండాలి. భార్యకు భర్త ఇంట్లో చిన్న చిన్న పనులలో సాయం చేయాలి. ఇలాంటి సహకారం ఇరువురిలోనూ ఉండాలి.
ఏ విషయానికి సంబంధించినవి అయినా తమ ఆలోచనలను, ఉద్వేగాలను, భాగస్వామితో మనసు విప్పి చెప్పుకునే వాతావరణం ఉండాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు పోల్చి చూసుకోకూడదు. తాము ఊహించినట్లు భాగస్వామిలో అందం, తెలివితేటలు లేవని చింతించ కూడదు. సష్టిలో ప్రతి మనిషి ఎవరికివారే ప్రత్యేకం. ఆ విషయం గుర్తుంచుకుంటే ఇద్దరిమధ్య పొరపొచ్చాలు రావు.
దంపతుల సంతోషంలో ఆర్థిక అంశాల పాత్ర కీలకం. ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలతలకు ప్రధాన కారణం. ఫలితంగా ఆ బంధం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఉమ్మడిగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కషి చేయాలి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం, వైద్యం కోసం ఖర్చు పెట్టాలని అవగాహన ఇరువురిలోనూ ఉండాలి. కాపురం సజావుగా సాగాలంటే ఇటువంటి అంశాలపై దృష్టిసారించి ఒకరినొకరు అర్థం చేసుకొని సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరికొకరు తోడుగా ఉంటూ పండంటి కాపురం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపవచ్చు. వివాహం అనేది ఒకరి కొకరు తోడు.ఈ తోడు ఎంత అవసరమో వయసు మళ్ళిన తర్వాత కానీ గుర్తించరు. ఈ బంధం ప్రాధాన్యతను తెలుసుకుని కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ..
పాలపర్తి సంధ్యారాణి
9247399272