ఈగ, దోమకు స్నేహం ఏర్పడింది. ఒక రోజు దోమ బాధతో ఉండటం ఈగ గమనించింది.
”ఏమిటి దోమా చాలా బాధగా వున్నావు”
”ఈగ మిత్రమా పిల్లలేమో ఆకలంటున్నారు. అక్కడొక మానవుడు ఉండటం చూసి వద్దన్నా వినకుండా నా ఇద్దరు పిల్లలు అతనిని కుట్టడానికి వెళ్తే ఆ అమానవుడు గమనించి రెండు దోమలను దెబ్బతో చంపేశాడు. అన్నీ తెలిసీ
మరో ఇద్దరు పిల్లలూ ఆకలంటున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు”
”దీనికేనా ఇంత బాధపడుతున్నావు. నాతో పాటు రండి మీకు ఎటువంటి ఆపద కలగకుండా కుట్టడానికి దారి చూపిస్తాను” అంటూ ఈగ వెళ్తుంటే దాని వెనుక తల్లి దోమ పిల్లదోమలతో కలసి వెళ్ళింది.
పక్కింటికి వెళ్లి అక్కడ ఒక అబ్బాయిని చూపించి ”వాడిని కుట్టి మీ ఆకలి తీర్చుకోండి” అంది.
”వాడు కుట్టేసమయాన నొప్పితో కొట్టాడంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది” భయంతో అంది తల్లి దోమ
”మిత్రమా వాడిని మీరే కాదు వంద దోమలు కలసి కుట్టినా ఏమీ పట్టించుకోడు. నా మీద నమ్మకం ఉంటే వెళ్ళండి” అంది ఈగ
తల్లి దోమతో పాటు పిల్ల దోమలు కలసి వాడిని కుట్టి రక్తం పీల్చుకొని తిరిగి వచ్చాయి.
”ఈగ మిత్రమా చాలా థాంక్స్, నీవల్లన మా ఆకలి తీరింది” అంది తల్లి దోమ.
”ఈగ ఆంటీ, వాడ్ని ఎంతగా కుట్టినా ఎందుకు కదలకుండా రాయిలా వున్నాడు” అడిగింది కుట్టి దోమ.
”కుట్టి దోమా, వాడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. అది వాడి ఆరోగ్యానికి చదువుకు పెద్ద ఆటంకం అని తెలిసినా వుండలేక పోతున్నాడు. వాడిప్పుడు పిడుగులు పడినా పట్టించుకోడు”
”ఆ సెల్ ఫోన్ వీడియో గేమ్స్ అంత ప్రమాదకరమైనదా” ఆశ్చర్యంతో అంది చిట్టి దోమ
”వాడికి ప్రమాదకరమైందిగా వున్న వీడియో గేమ్స్ మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు వాడిని కుట్టినా వీడియో గేమ్స్ వలన పట్టించుకోడు” అంది ఈగ
”అమ్మా ,ఇక మీదట వీడియో గేమ్స్ ఆడే వారిని కుట్టి మనం ఆకలి తీర్చుకొందాము” అన్నాయి పిల్ల దోమలు.
ఓట్ర ప్రకాష్ రావు,09787446026