ఒక కవి రాసిన సమగ్ర కవిత్వాన్ని చదవటం నా మటుకు నాకు ఒక గమ్మత్తైన అనుభూతి అనిపిస్తుంది.కవి ఎప్పుడూ బాహ్యంగా కనిపించే మనిషి కాడు. అతని లోపలి మనిషే కవిత్వమై బయటకు వస్తుంటాడు.అలా ఒక కవి తన జీవితంలో ముప్ఫై,నలభై సంవత్సరాల పాటు కవిత్వంతో ప్రయాణించినపుడు తను నడచిన ఆ దారిలో అతనెన్నో అనుభూతులు పంచుతాడు. అనుభవాలను ప్రోది చేస్తాడు. తాను ఎదుగుతూ తన కవిత్వాన్ని ఓ శంఖారావం చేస్తాడు. కవి ఇలా ఎదిగే క్రమాన్ని చాలా మంది గమనించరు. వారికెంతసేపు ఆ కవి రాసిన కొత్త పద్యమే స్మ్రతిలో ఉంటుంది. కవిత్వంతో ఆ కవి చేసిన పరిష్వంగం తాలూకు ఉద్వేగాన్ని హత్తుకోరు. ఇలాంటి సందర్భాల్లో ఆ కవి సమగ్ర కవిత్వం ఒక సంకలనంగా వెలువడినప్పుడు అది ఎన్నో ఖాళీలను పూరిస్తుంది. ఎన్నో మౌనాలకు సమాధానమవుతుంది..
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పాతనగరం రచయితల సంఘానికి ఆశ, శ్వాసగా భాసిల్లే కవి కొరుప్రోలు హరినాథ్ సమగ్ర కవిత్వం పరిశీలించినప్పుడు వారిలోని వస్తు వైవిధ్యం, కవితా వైశాల్యం ఆశ్చర్యపరిచాయి. కవి నాళేశ్వరం శంకరం పేర్కొన్నట్లు కవి కొరుప్రోలు హరినాథ్ లో రెండు జీవనదులున్నాయి. ఒకటి అభ్యుదయ కవిత్వం.రెండవది పరిణయ కవిత్వం. అభ్యుదయ కవి పరిణయ కవిత్వాన్ని ఎందుకు ఎంచుకున్నాడన్న అంశానికి తర్వాత వద్దాం. ఎనభైల్లో మినీ కవిత్వం ఉద్యమమై ఎగసినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్న కవుల్లో కవి హరినాథ్ ముందు వరుస కవి. చిరుప్రాయంలో చిరుతలా మినీ కవితలతో చెలరేగిన కవి తను. అప్పటి మినీ కవిత్వాన్ని, ఇప్పుడీ సమగ్ర సంకలనంలో చదువుకునే అవకాశం కలిగింది. ఆ కవితల్లోని వేడి, వాడి పదునెక్కిన భావాల బుసబుసలు మనలను తాకుతాయి. ఒకింత ఆశ్చర్యపరుస్తాయి కూడా.
మనుషుల స్వభావాలను, సమాజం వికత పోకడలను కవి భలే పట్టుకున్నాడు అనుకోక మానం. మంట అనే కవితలో ఈ పంక్తులు చూడండి ”వాడు/ అధఃపాతాళంలోకి/ కూరుకు పోతున్నా/ తన గురించి/ వాడు యోచించడు/ కాని-/ ఎదుటివాడు/ పైపైకిపోతున్నాడన్నదే/ వాడి మంట” ఇది రోజూ మనం చూసే తంతే. కానీ ఈ ఆలోచన కవి మస్తిష్కం చేరినప్పుడు పదునైన కవిత అవుతుంది. ఇలాంటి ఎన్నో కవితలు స్వర్ణపుష్పాలు సంపుటిలో చోటు చేసుకున్నాయి.. కొన్ని కవితల్లో బలమైన వ్యక్తీకరణలు కానవస్తాయి. నగసత్యం అనే కవితలో ఈ భావచిత్రం ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. వెలుగును/ చీకట్లో/ బంధించటం/ ఎంత కష్టతరమో/ నల్లధనాన్ని/ సంపన్నులనుంచి/ వెలుగులోకి/ తీసుకు రావటం కూడా/ అంతకంటే/ కష్టతరం.
1994లో వెలువడిన సంపుటి ఇది. వీరి రెండవ కవిత్వ సంపుటి హౌరు..1998లో ప్రచురింపబడింది. ఈ సంపుటిలో కవి మినీ కవితల నుంచి తన కవితా శరాలను వ్యవస్థపై ఎక్కుపెట్టాడీసారి.
ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం సరే ప్రపంచాన్ని ఎప్పుడైనా చదివామా? అన్న ప్రశ్న వేసుకోమంటున్నాడు..
హోరు సంపుటిలో ఆయన వస్తువుగా అనేక అంశాలు తీసుకున్నారు కవి.. కొన్ని ఎలిజీ కవితలు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల ఆవేశం, కొన్ని చోట్ల ఆవేదన కలగలిసి పాఠకుడిని చింతాక్రాంతుణ్ణి చేస్తాయి. ఇందులో నగరంలో నగ సత్యాలు అనే దీర్ఘకవిత ఉంది. ఈ కవిత నగరాన్ని కెలీడియోస్కోపు చేసి చూపుతుంది. కవి తన మనోనేత్రంతో నగరపు లోగుట్టును వీక్షింప చేస్తారు.కొన్ని పంక్తులు చూడండి… ”ఇంటర్నెట్‌ల సుడిగుండాలు/ సైబర్ నేరాల చిట్టాలు” అన్న వాక్యంలో రానున్న ఇరవైఏళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో కవి ముందే చక్కగా అంచనా వేశాడు అనిపిస్తుంది.హైదరాబాద్ నగరంపై ఒక వీడియోను రూపొందించి ఈ కవిత వాయిస్ ఓవర్ గా చేస్తే ఎంత బావుంటుందో కదా అనిపించేలాంటి కవిత.. ఆవేశాన్ని వెల్లువ చేసే కవిత.. నగరాన్ని అమ్మేద్దామని కాచుక్కూచున్న రాబందుల కబంధ హస్తాలు భయపెట్టే కవిత..
మరో సంపుటి రాగమోహనం 2017లో ప్రచురించబడింది.. ఇందులో చాలా వరకు ప్రణయకవితలే చోటుచేసుకున్నాయి. అభ్యదయకవి ప్రణయ కవిగా ఎలా మారాడన్న ప్రశ్న హరినాథ్ గారిని అడిగినప్పుడు ప్రేమ పేరుతో యువత పెడదారిలో పయనిస్తోందంటారు. ప్రేమ వేరు.. కామం వేరు.. ప్రేమలోని విశాలత్వాన్ని, నిశ్చలత్వాన్ని తెలపటానికి ఏ ఈ కవితలు సజించానంటారు వారు. ఇదే మాటను తేడా అనే కవితలో ఎలా చెప్పారో చూడండి. ”కామం/ క్షణికావేశంలో/ సెకన్లలో/ కరిగిపోయే/ మకరందం ప్రేమ/ నిత్యయవ్వనంలా/ ఎన్నో వసంతాలు/ గుబాళించే/ మకరందం”
విచిత్రంగా ఈ ప్రేమ కవితలన్నీ చాలా సున్నితంగా మన హదయానికి సన్నిహితంగా ఉంటాయి. ధిక్కారాన్ని వ్యక్తం చేసిన ఆ కవేనా ఈ కవి అనిపిస్తుంది.. సామాజిక మాధ్యమమైన ఫేస్ బుక్ చక్కగా ఉపయోగిస్తే ఎంతగా మనకు చిక్కుతుందో చెబుతూనే బట్ బి కేర్ ఫుల్/ యూజ్ ఇట్/ ఇన్ ప్రాపర్ వే అనే హెచ్చరిక కూడా జారీ చేస్తారు.. రాగమోహనం లోని కవితలన్నీ మదు మంజుల వీణనాదమై కవితా వస్తువు లోని తీయదనాన్ని గ్రోలమంటాయి..
2022లో ప్రచురించిన ఊహకే ఊపిరొస్తే కవిత్వ సంపుటి కూడా యాసిడ్ దాడులు, ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు తల్లడిల్లితూ కవి బాధతో స్పందించిన వేదనల సమాహారం.ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలం ఆశించేది కాదని నమ్మేవారిలో కవి కూడా ఉన్నాడు. రహదారి కవిత్వ సంపుటి 2023 లో వెలువడింది.. మళ్ళీ ఈ సంపుటి లో ఆయన కలం అభ్యుదయం బాట పట్టింది.. దానితోపాటు ఈ సంపుటిలో ఆయనో తాత్వికుడిగా గోచరిస్తాడు.. వారి అనుభవం, కవితానుభవం ఆయన్నో మార్మిక చింతనాపరుణ్ణి చేశాయనిపించింది.. కవి కవిత్వంతో మమేకమైపోయిన సందర్భం మనం చూడొచ్చు. రహదారి కవితలో గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తాడు కవి. రాలిపడుతున్న/ ప్రతి ఆకునంచి/ కవిత్వం ఉద్భవిస్తుంది అని ఆనందపడతాడు కవి.
ఈ సమగ్ర సంకలనంలో కొరుప్రోలు హరినాథ్ గారి ఆరు కవిత్వ సంపుటిలు చోటు చేసుకున్నాయి.
కవిత్వంలో వస్తువు గొప్పదా, శిల్పం గొప్పదా అన్న ప్రశ్నపై నిరంతర చర్చలు మనం చూస్తుంటాం. ఎప్పుడైతే కవికి స్పష్టత ఉంటుందో అప్పుడు కవిత్వం చిక్కగా ఉంటుంది.. హరినాథ్ తనని తాను వస్తు ప్రధాన కవిగానే ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే వస్తువులో సార్వజనీనత ఉంటుందో అప్పుడు పాఠకుడు కూడా ఆ కవిత్వంతో పెనవేసుకుని ఉంటాడు. అది కవిగా కొరుప్రోలు హరినాథ్ సాధించిన విజయం అనుకోవచ్చు.హరినాథ్ కు ఇష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. వ్యక్తిగతంగా ఆయన ప్రశంసలు పొందిన కవి. పాతనగర కవుల సంఘాన్ని సుసంపన్నం చేస్తున్నారు.. వారి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కోరుప్రోలు హరినాథ్ కాలాన్ని జయించిన కవిగా గుర్తుండిపోతాడంటే ఆశ్చర్యం లేదు.
సి.యస్.రాంబాబు