అమెరికా అధ్యక్షుడి తీరు ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్టుగా తయారైంది. ఇప్పటికే భారత్‌పై భారీ ఎత్తున సుంకాలను విధించిన ట్రంప్…ఇప్పుడు భారతీయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా హెచ్ 1బీ వీసా పొందాలంటే ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని హుకుం జారీచేశాడు. ఈ నిర్ణయం అమెరికాకు వెలుపల ఉన్న హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన, గందరగోళం, ఆగ్రహం కలగలిసి వ్యక్తమయ్యాయి. వైట్‌హౌస్ ప్రకటన వచ్చిన వెంటనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఒక రోజులోనే తిరిగి అమెరికాలో ఉండాలని ఆదేశించాయి. దీంతో టెకీలు తమ ప్రణాళికలను వదిలిపెట్టి, ఆదరా బాదరాగా విమానాశ్రయాలకు పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష డాలర్లు నిబంధన కొత్త దరఖాస్తులకే వర్తిస్తుందని వైట్‌హౌస్ ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా…అది సిలికాన్ వ్యాలీలో చెలరేగిన ఆందోళనలను కూడా చల్లార్చలేకపోయింది.
ట్రంప్ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మౌన దాస్యాన్ని కొనసాగి స్తున్నారు. ఫీజు పెంపు అమల్లోకి వచ్చిన ఆదివారం ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగింస్తూ జీఎస్టీ రేటు సంస్కరణ ‘ప్రయోజనాలను’ వల్లెవేశారే తప్ప జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్య గురించి కనీసం ప్రస్తావించలేదు. అమెరికా చర్య భారతదేశానికి చెందిన ఐటీ ఉద్యోగులతో సహా నైపుణ్యం కలిగిన కార్మికులకు తీవ్ర హాని కలిగిస్తుందన్న నిపుణుల మాటలు సైతం ప్రధాని చెవులకు ఎక్కడం లేదు. విదేశీ కార్మికులపై కంపెనీలు భారీ మొత్తంలో ఖర్చుచేయడానికి విముఖత చూపిస్తే, భారతీయ నిపుణుల ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఐటీ, టెక్ రంగాల్లో విదేశాలలో ఉద్యోగాలు కోరుకునే భారతీయుల కలలు చెదిరిపోతాయి.
ట్రంప్ యాభైశాతం ప్రతీకార సుంకం విధించినప్పుడు, భారత ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగ వ్యాఖ్యలు చేసినప్పుడు మోడీ వినయాన్నే ప్రదర్మించారు. హెచ్-1బీ వీసా పొందిన వారిలో మూడొంతులు భారతీయులే. వాస్తవా నికి మూడున్నర దశాబ్దాల క్రితం తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా విధానం నవీన ఆవిష్కరణలు అమెరికా పరపతిని పెంచింది. ఇది అమెరికా ఆర్థికాభి వృద్ధిలోనూ కీలకపాత్ర పోషించింది. ఆ వాస్తవాలు ఎరుకలో ఉండబట్టే హెచ్-1బీ వీసాలపై గత అధ్యక్షులెవరూ ముట్టుకోలేదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ వలస వ్యతిరేక జాతీయవాదంతో రంకెలేస్తున్న ట్రంప్ తీవ్ర అనాలోచిత నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మన దేశంపై అత్యంత తీవ్ర ప్రభావం చూపే, కొన్ని లక్షలమంది బతుకులను ప్రశ్నార్థకం చేసే నిర్ణయంపై మన ప్రధాని మౌనం వహించడం, అమెరికా చర్యలపై మాట్లాడకపోవడం అత్యంత దారుణమైన విషయం.
ఏఐ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో ప్రపంచ దేశాల మధ్య పోటీ అధికమైంది. అయితే ఆయా సాంకేతికతల్లో తగినంత సామర్థ్యమున్న నిష్ణాతులు అమెరికాలో లేరు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులైన హెచ్-1బీ వీసాదారులను ట్రంప్ బలవంతంగా నిలువరిస్తుండటం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుందని నిపుణుల మాట. ఆయన పెడధోరణులు స్టార్టప్‌లు, మధ్యతరహా సంస్థలపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రష్యా, చైనాలతో సహకరించాలనే భారతదేశ చర్యలను బెదిరింపుల ద్వారా నిరోధించడానికి, వాణిజ్యచర్చల్లో అన్యాయమైన పైచేయి సాధించడానికి అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రష్యన్ చమురుపై అదనపు సుంకాలను విధించిన ట్రంప్, ఇరాన్‌లోని భారత నియంత్రణలో ఉన్న చాబహార్ ఓడరేవుపై కూడా ఆంక్షలను తిరిగి విధించింది.
నయానో భయానో ఇండియా దారికి తెచ్చుకునేందుకు అసహనంతో బుసలు కొడుతున్నారు. ట్రంప్ దుర్బుద్ధికి ఇవి తార్కాణాలు మాత్రమే. కుటుంబం కావాలా? అమెరికాలో ఉండటం కావాలా? తేల్చుకోవలసిన పరిస్థితి. భారీ టెక్ కంపెనీలో పనిచేస్తున్న చాలామంది ఇండియన్ ప్యాసింజర్స్ అర్ధాంతరంగా ఎక్కిన విమానాన్ని దిగిపోయారంటే ఎంత భయానక వాతవరణం అమెరికాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలపై, ముఖ్యంగా ఐటీ నిపుణులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు అది భస్మాసుర హస్తమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను సైతం కూల్చేసే అవకాశం లేకపోలేదని నిపుణులంటున్నారు. దేశ యువత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలో జోక్యం చేసుకుంటుందనే భరోసాను కలిగించడంలో మోడీ విఫలమయ్యారు.
‘ట్రంపా’సుర హస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES