నేటి నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు
పలు సవాళ్ళు, అనిశ్చితుల నేపథ్యంలో సమావేశమవుతున్న ప్రపంచ నేతలు
గాజా, ఉక్రెయిన్, సూడాన్, ట్రంప్ వైఖరి తదితర అంశాలపై చర్చ
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి 80ఏండ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అనేక సవాళ్ళను, అస్థిర, అనిశ్చిత పరిస్థితులను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ నేతలు సమావేశమవుతున్నారు. జనరల్ అసెంబ్లీ చాంబర్‌లో మంగళవారం జరిగే ఉన్నతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు గానూ వీరు విచ్చేస్తున్నారు. ప్రపంచ దేశాలనుద్దేశించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ప్రసంగించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడతారు. గాజా, ఉక్రెయిన్‌ల్లో సుదీర్ఘంగా సాగుతున్న దాడులు, యుద్ధాలు, మరోపక్క ప్రపంచ దేశాల పట్ల అమెరికా వైఖరిలో మార్పులు, ఎక్కడ చూసినా ఆకలి కేకలు, అత్యంత వేగంగా మారుతున్న సాంకేతికతలతో ప్రపంచ పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా వున్నాయి. ప్రపంచ దేశాలు ఎదుర్కొనే రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారాలకు కలిసికట్టుగా కృషి చేయాలనే లక్ష్యంతో రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితే ప్రస్తుతం సంక్షోభంలో వుంది. మన జీవిత కాలాల్లో ఎన్నడూ చూడని విధంగా అంతర్జాతీయ సహకారం అనేది తీవ్రమైన ఒత్తిళ్ళకు లోనవుతోందని గత వారం గుటెరస్ వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే జనరల్ అసెంబ్లీ సమావేశాలకు దాదాపు 150 దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానులు, రాజులు హాజరవుతున్నారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నందున ఈ అవకాశాన్ని వదులుకోకుండా చక్కని చర్చ జరగాలని గుటెరస్ ఆకాంక్షించారు. ”ఒకపక్క భూగోళం వేడెక్కిపోతోంది. మరోపక్క సరైన రక్షణలు లేకుండానే సాంకేతికతలు శరవేగంగా దూసుకువస్తున్నాయి. అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరింత మెరుగైన ప్రపంచం కోసం మనందరం ఏకమవాలని ఆయన అభిలషించారు. ఈ సమావేశాలకు హాజరయ్యే 150మంది నేతలు, మంత్రులు ఒకరితో ఒకరు ముఖాముఖి సమావేశాలు జరిపేలా, చర్చలు జరిగేలా, ఏమైనా అభిప్రాయ బేధాలు వుంటే అవి సమసిపోయేలా, వున్న ముప్పులను తగ్గించుకునేలా, పరిష్కార మార్గాలు కనుగొనేలా చూసేందుకు తాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నట్లు గుటెరస్ చెప్పారు.
అన్ని దేశల్లో దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు, ప్రతి ఒక్క బిడ్డకు నాణ్యత గల చదువును అందించడంతో సహా ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను 2030కల్లా నెరవేర్చడానికి కావాల్సిన నిధులను కూడా సమీకరించుకోవాల్సి వుందన్నారు. కేవలం ఫోటోలకు పోజులిస్తూ, శుష్క వాగ్దానాలు చేసి వెళ్ళిపోకుండా నేతలు కచ్చితంగా పురోగతి సాధించాలని ఆయన కోరారు. అయితే తీవ్రమైన విభేదాలు, ఘర్షణలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో గాజా, ఉక్రెయిన్, సూడాన్‌ల్లో కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించడం లేదు. అసలు ఈ ఉన్నత స్థాయి సమావేశాలు ఎలాంటి పురోగతినైనా సాధిస్తాయా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిందని ఐక్యరాజ్య సమితి పర్యవేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండేళ్ళుగా దాడులతో కుదేలైన గాజా పరిస్థితులే ప్రధానంగా చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికి 145కి పైగా దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించగా, సోమవారం నాటి సమావేశాల్లో మరో 10కి పైగా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించినట్లు ప్రకటించనున్నాయి. గురువారం మధ్యాహ్నం గాజాపై భద్రతా మండలి భేటీ కావచ్చనని భావిస్తున్నారు.
కలిసికట్టుగా ఎదుర్కొందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES