న్యూఢిల్లీ : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ‘సెలెక్టివ్’గా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. విచారణ పూర్తికాకముందే పైలెట్లను నిందించడం ‘బాధ్యతారాహిత్యం’ అని విమర్శించింది. నివేదికలోని కొన్ని భాగాలను బహిరంగంగా వెల్లడించిన విధానం తప్పుదారి పట్టించే అభిప్రాయాన్ని సృష్టించిందని పేర్కొంది. ‘ప్రాథమిక విచారణ నివేదికను ఎంపిక చేసి, ముక్కలు ముక్కలుగా ప్రచురించడం దురదృష్టకరం. విచారణ పూర్తయ్యే వరకు, సంపూర్ణ గోప్యతను కాపాడుకోవడం ముఖ్యం’ సుప్రీంకోర్టు అని పేర్కొంది. ఈ ప్రమాదంపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మాజీ పైలట్ అమిత్ సింగ్ నేతృత్వంలోని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రమాదం జరిగి 100 రోజులకు పైగా గడిచినా ఏమి జరిగిందనే దానిపై లేదా ఇటువంటి విషాదాలను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టత లేదని పిటిషన్ విమర్శించింది.