Wednesday, September 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజీఎస్టీ భజన

జీఎస్టీ భజన

- Advertisement -

ఇటీవల ప్రధాని మోడీకి జనంపై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. జీఎస్టీ శ్లాబ్‌లు తగ్గింపు పేరుతో మళ్లీ స్వదేశీజపం అందుకున్నారు. ఇటీవల జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో శ్లాబులు తగ్గింపు ఆత్మనిర్భర్‌ భారత్‌కు నిదర్శనమని అంటున్నారు. ఇప్పుడు ఎక్కడచూసినా శ్లాబుల తగ్గింపు మోతే. మోడీ అంటే అభిమానం ఉన్నవారు, బీజేపీ ప్రభుత్వం వల్ల లబ్ది పొందిన పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్లు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, జీఎస్టీ శ్లాబుల తగ్గింపు, కొన్ని వస్తువులను అందులోనుంచి మినహాయించడం సామాన్యులకు లాభమేనని జనాన్ని అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భజన బృందాలు కీర్తనలు మొదలేశాయి.

నాలుగు జీఎస్టీ శ్లాబులను కేంద్రం రెండుగా చేసిన విషయం తెలిసిందే. 12శాతం, 28శాతం శ్లాబులను ఎత్తివేసి 5శాతం, 18శాతం శ్లాబులకు కుదించింది. వీటి వల్ల కేంద్రం రూ.48వేల కోట్ల ఆదాయం కోల్పోతుందని కేంద్రం చెబుతోంది. ఇదంతా తమ ఘనతగా చెప్పుకుంటోంది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చిన నష్టాలను భరించకుండా శ్లాబుల తగ్గింపును తమ ఖాతాలోకి ఎలా వేసుకుంటుందనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. కేంద్ర, రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలను మోడీ తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరం. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్‌ క్లాస్‌కు ప్రధాని మేలు చేశారని బీజేపీ అంటోంది. మోడీ వల్లనే ఈ రోజున మధ్యతరగతి పేదవర్గాలు అనూహ్యంగా లబ్ధి పొందుతున్నాయని జనంలోకి వెళ్లి గట్టిగా చెప్పుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంవత్సరంపైగా రైతులు ఉద్యమం చేస్తే గానీ వాటి రద్దుకు దిగిరాని మోడీ సర్కార్‌ ఎవరూ కోరకుండానే జీఎస్టీ శ్లాబులను మార్చి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేందుకు తగ్గించామని ఊదరగొడుతున్నది ఎందుకో కూడా మనకు తెలుసు!

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు, తర్వాత వీసా ఫీజుల పెంపు ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బలు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి, వ్యాపార వర్గాల్లో నిరు త్సాహం పెరిగింది. సాధారణ ప్రజలలోనూ ఖర్చులు పెరిగాయి. ఆదాయం స్థిరంగా లేదు. ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబరులో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారు రాష్ట్రంలో ఓట్లచోరీ జరిగిందన్న వార్తలు దేశప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకూ, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేక్రమంలో మోడీ ప్రభుత్వం శ్లాబుల తగ్గింపు అస్త్రాన్ని ప్రజలమీదకు వాడింది. అయితే తొమ్మిదేండ్ల నుంచి జనం గోళ్లూడగొట్టి వసూలు చేసింది ఈ ప్రభుత్వమే. ఇప్పుడేదో ప్రజలకు మేలు కార్యక్ర మం చేస్తున్నట్టు ప్రచారజోరు. అదేవిధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు కూడా మోడీని పొగుడుతూ పేపర్‌ ప్రకటనలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావాలి.

జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల వినియోగం కనీసం పదిశాతం పెరిగినా, దేశ ఆర్థిక వ్యవస్థకు అదనంగా రూ.ఇరవై లక్షల కోట్లు జత అవుతుందని కేంద్రం అంచనా. దీన్నిబట్టి చూస్తే మోడీ సర్కార్‌ ఈ జీఎస్టీ శ్లాబుల మార్పుతో పేద, మధ్య తరగతి జనానికి పండుగ కానుకలు ఇచ్చిందా? కానే కాదు. మధ్యతరగతి ఆదాయాలు పడిపోయాయి. నిజవేతనాలలో పెరుగుదలలూ లేవు. 2017లో జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చినప్పుడు పాత చరిత్రను అది మార్చిందని, ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు కొత్త చరిత్రను సృష్టించడానికి నాంది పలికిందని మోడీ అంటున్నారు. జీఎస్టీ తీసుకురావడం చారిత్రాత్మక అడుగు ఎలా అవుతుందో మోడీనే చెప్పాల్సింది. ఆ రోజు నుంచి ఇన్నేండ్ల వీరి పాలనలో జీఎస్టీ నిర్ణయాలతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు నష్టపోయింది ఎంతో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

జీఎస్టీ శ్లాబులతో చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు అతలాకుతల మయ్యాయి. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. దేశంలోని ఆరు కోట్ల ముప్పయి లక్షల చిన్న వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాల సంఖ్య తగ్గింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుల జీవనం ఛిన్నా భిన్నమైంది చూశాం. జీఎస్టీతో ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ గాయాలు మానలేదు. తగ్గింపు పట్ల ప్రజల్లో సంతోషం లేదు. జీవించడానికి కష్టమైనప్పుడు వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి పేదలకు ఉండదు. జీఎస్టీతో పన్నులు పెరిగి ఆదాయం పెరుగుతుందని ఊరించిన కేంద్రం..రాష్ట్రాల్లో ఏర్పడిన నష్టాన్ని ఎలా పూరిస్తారన్న దానికి సమాధానం లేదు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారమనేది సృష్టం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -