చైనా, భారత్‌లే ప్రధాన కారణం : యూఎన్‌జీఏ సమావేశాల్లో ట్రంప్ ప్రసంగం
న్యూయార్క్ : భారత్-పాక్‌తో సహా ఏడు యుద్ధాలను తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. తాను అధ్యక్షుడినైన తర్వాత కేవలం ఏడు మాసాల వ్యవధిలోనే అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న ఏడు యుద్ధాలను అంతమొందించానని పునరుద్ఘాటించారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే ప్రయత్నాలను కూడా ఆయన తీవ్రంగా నిరసించారు. వాతావరణ మార్పులపై పోరాటం ఈ భూగోళంపై జరిగే అతిపెద్ద మోసమని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాల్లో మంగళవారం ట్రంప్ ప్రసంగిం చారు. పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఆ యుద్ధాలేవీ ముగియడం లేదని, అలా సాగుతునే వున్నాయని, వాటిల్లో కొన్ని యుద్ధాలు 31, 36ఏండ్లుగా సాగుతునే వున్నాయన్నారు. ఈ యుద్ధాల న్నింటిలో వేలాదిమంది ప్రజలు మరణించారని, ఏ అధ్యక్షుడూ లేదా నాయకుడు కూడా వీటిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
కనీసం యుద్ధాలను పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి కూడా సాయం చేయడానికి ప్రయత్నించలేదని ఆయన విమర్శించారు. కేవలం మాటలు చెబితే సరిపోదని, ఆ మాటలేవీ కూడా యుద్దాలను ఆపలేవని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఏడు యుద్ధాలను ఆపినా ఐక్య రాజ్య సమితి నుండి ఒక్క ప్రశంస కూడా లేదని ట్రంప్ విమర్శించారు. తాను ఆపిన యుద్ధాలు ఇజ్రాయిల్-ఇరాన్, భారత్-పాకిస్తాన్, ర్వాండా-కాంగో, థాయిలాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిప్ట్-ఇథియోపియా, సెర్బియా-కొసావోల మధ్య యుద్ధాలని ఆయన వివరిం చారు. ఇన్ని యుద్ధాలను అంతమొందిం చినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని మరోసారి చెప్పుకున్నారు. కేవలం ఏడు మాసాల్లో తాను ఇదంతా చేశానన్నారు. మరే దేశమూ కూడా ఇంతలా చేయలే దన్నారు. ప్రపంచీకరణ వ్యవస్థలే ప్రపంచ వ్యవస్థను లేదా క్రమాన్ని దారుణంగా దెబ్బతీశాయన్నారు.
వలసలే పెద్ద సమస్య
అడ్డూ అదుపు లేని వలసలు పెద్ద సమస్యేనని ట్రంప్ స్పష్టం చేశారు. బైడెన్ ప్రభుత్వం అనుసరించిన ఓపెన్ సరిహద్దు విధానాన్ని ఆయన విమర్శించారు. క్రిమినల్స్ వస్తే వారిని వెనక్కి పంపడం ఖాయమన్నారు. సరిహద్దుల మధ్య అనియంత్రిత వలసలకు ఐక్యరాజ్య సమితి మద్దతునిస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితి వెంటనే ఇటువంటి ఆలోచనలకు నిధులు అందచే యడాన్ని నిలిపివేయాలని సూచించారు. దేశంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్యను మనం పరిమితం చేయాల్సి వుందని అన్నారు. ‘గర్వించదగ్గ దేశాలు తమ దేశాలను, ఆచారాలను, మతాన్ని తామెన్నడూ చూడని ప్రజల నుండి రక్షించుకోవడానికి అనుమతించాలి.’అని అన్నారు. బహిరంగ సరిహద్దులు అనే నేరాన్ని తక్షణమే అంతం చేయాలన్నారు. లండన్‌కు ప్రస్తుతం భయం కరమైన మేయర్ వున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వలసల కారణంగానే ఇది జరిగిందని పేర్కొన్నారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై గతంలో నూ ట్రంప్ అనేక కారణాలతో విమర్శలు చేశారు.
జీవాయుధాల అభివృద్ధి ఆపాలి
జీవ ఆయుధాలను అభివృద్ధిపరచడాన్ని ఆపాలని ట్రంప్ దేశాలను కోరారు. జీవ ఆయుధాల ఒప్పందం అమలుకు అంతర్జాతీయంగా జరిగే కృషికి తాను నేతృత్వం వహిస్తానని చెప్పారు. అణ్వాయుధాలు మానవాళికి తీవ్రమైన ముప్పుగా పరిణమిం చాయ న్నారు. అటువంటి అణ్వాయుధాలను ఇరాన్ కలిగి వుండేందుకు ఎన్నడూ అనుమతిం చబోమన్నారు. గాజా, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చూస్తామన్నారు. సహేతు కమైన శాంతి ప్రతి పాదనలు వచ్చినా హమాస్ వ్యతిరేకించిందని అన్నారు.
చైనా, భారత్‌లే ప్రధాన కారణం
రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధానికి చైనా, భారత్‌లే ప్రధానంగా నిధులు సమకూర్చేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురును వారు కొనుగోలు చేయడాన్ని కొనసాగి స్తున్నందువల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై టారిఫ్‌లు తప్పవని హెచ్చరించారు. అలాగే యూరప్ దేశాలు కూడా రష్యా చమురును ఉపయోగించడాన్ని ఆపాల న్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ మరోపక్క విమర్శిస్తున్నారని, ఇది ఆపాల్సిన అవసర ముందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తాను నిరంరతరంగా కృషి చేస్తూనే వున్నానని, అయినా దాన్ని అంతం చేయడం కష్టసాధ్యంగా మారిందని వ్యాఖ్యానిం చారు. రష్యాను చెడుగా చూసేందుకు ఈ యుద్ధం కారణమవుతోందన్నారు.
వాతావరణ మార్పుపై పోరు అతిపెద్ద మోసపూరిత పని
వాతావరణ మార్పులపై పోరాటం అనేది అతిపెద్ద మోసపూరితమైన పని అని ట్రంప్ విమర్శించారు. ఇదొక హరిత ఇంధన కుంభకోణమన్నారు. రాజకీయం గా సరిదిద్దుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఇది చేస్తూనే వుంటారు. కానీ మన చర్యల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల భావన బూటకమైనదని వ్యాఖ్యానించారు. మాదకద్రవ్యాల అక్రమరవాణాను అంతమొందిస్తామని ప్రతిన చేశారు. వెనిజులాకు చెందినవిగా ఆరోపణలు చేస్తున్న మూడు బోట్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేసే ప్రతి తీవ్రవాదిని నిర్మూలిస్తామనిఆయన హెచ్చరించారు.