Wednesday, September 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమెట్రోరైల్‌…ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే!

మెట్రోరైల్‌…ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే!

- Advertisement -

8 ఏండ్లుగా అవే మూడు బోగీలు
భారీగా పెరిగిన రద్దీ… దానికి తగ్గట్టు ఏర్పాట్లు శూన్యం
చార్జీలు పెంచి, నష్టాలంటూ ఎల్‌ అండ్‌ టీ సన్నాయినొక్కులు
పార్కింగ్‌ ఫీజులూ వసూలు
సర్కారు కేటాయించిన భూముల్ని వాడుకోలేక చేతులెత్తేసిన వైనం
‘విస్తరణ’కు అదే సంస్థతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం ఒత్తిడి

ఎస్‌ మాధవరెడ్డి

హైదరాబాద్‌ మెట్రోరైల్‌… కూర్చోవడానికి సీటు సంగతి దేవుడెరుగు! అసలు బోగీలోకి ఎక్కేందుకు ఎంతమందిని మీరు తోసుకెళ్లారు… మిమ్మల్ని ఎంతమంది తోసారో గుర్తుందా? అంత రద్దీ పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం ఆఫీసు వేళల్లో అయితే కాలుపెట్టే ఖాళీ కూడా ఉండదు. ఆ రద్దీ తట్టుకోలేక ఊబర్‌, ఓలా వంటి క్యాబ్‌ సర్వీసుల్ని వినియోగించుకోవడమో, ఆర్టీసీ బస్సులు ఎక్కేయడమో తప్పట్లేదు.

2017 నవంబర్‌ 18న మొదటి ఎల్‌ అండ్‌ టీ నిర్వహణలో మెట్రోరైల్‌ పట్టాలెక్కింది. అప్పటి నుంచి కేవలం మూడు బోగీలతోనే నడుస్తోంది. ట్రిప్పుల సంఖ్యను పెంచుతుందే తప్ప, బోగీల సంఖ్యను మాత్రం పెంచలేదు. ఫలితంగా రద్దీ వేళల్లో మెట్రో స్టేషన్లలో వందల సంఖ్యలో ప్రయాణీకులు వెయిట్‌ చేస్తూ కనిపిస్తుంటారు. టిక్కెట్‌ రేట్లను పెంచినా, మెట్రోకు అలవాటైన ప్రయాణీకులు త్వరగా గమ్యస్థానాలకు చేరొచ్చనే కారణంతో ఆ ప్రయాణాన్నే ప్రిఫర్‌ చేస్తున్నారు. రోజుకు ఐదు లక్షలమంది ప్రయాణిస్తున్నా, ప్రయాణీకుల పూర్తి అవసరాలు తీరట్లేదు. దాన్ని సవరించే ప్రయత్నాలను ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఈ 8 ఏండ్లలో చేపట్టనూ లేదు. నష్టాలంటూ ఏటా కొత్త పల్లవి అందుకుంటూనే ఉంది. బహుళ ప్రయోజనార్థం ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టీ సంస్థకు వేల కోట్లు విలువైన 424 ఎకరాల భూమిని కేటాయించింది. దానిలో 267 ఎకరాలను వివిధ వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశం ఉంది.

నిర్మాణ సమయంలో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఆమేరకు ఒప్పందాలు కూడా చేసుకుంది. మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు పక్కన ఉండే ఫుట్‌పాత్‌లను పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. ప్రారంభంలో ఉచిత పార్కింగ్‌ అని చెప్పి, ఇప్పుడు గంటల లెక్కన చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటనల పేరుతో భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో షాపుల్ని అద్దెలకు ఇచ్చారు. అయితే కొన్నిచోట్ల మెట్రోస్టేషన్లలో వాణిజ్య కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి కిరాయిలను నిర్ణయించకుండా, అన్ని ప్రాంతాలకూ యూనిఫామ్‌గా చదరపు అడుగుల లెక్కన లీజు రేట్లు నిర్ణయించారు. ఆ రేట్లు గిట్టుబాటు కానందున, వాటిని తీసుకొనేందుకు వ్యాపార సంస్థలు ఆసక్తి చూపలేదు. ఫలితంగా కొన్ని స్టేషన్లలో షాపులు ఖాళీగా మిగిలిపోయాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు పథకం వల్ల మెట్రోలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) తగ్గిందంటూ మరో కారణాన్ని కూడా ఎల్‌ అండ్‌ టీ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనిపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి మెట్రోరైల్‌లో ఓఆర్‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ సిటీలో దాదాపు వెయ్యి బస్సు సర్వీసుల్ని తగ్గించేసింది. సకాలంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు గత్యంతరం లేక మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోలేక ఐటీ ఉద్యోగులు పూర్తిగా మెట్రోరైల్‌లోనే ప్రయాణం చేస్తున్నారు. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోలేని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నష్టాలంటూ పాత పల్లవినే ఏటా ఎత్తుకుంటున్నదని రవాణారంగ నిపుణులు చెప్తున్నారు.

విస్తరణకు నో
ఎల్‌ అండ్‌ టీ సంస్థ మొదటి నుంచి మెట్రో విస్తరణకు అడ్డుపడుతూనే ఉంది. కేవలం లాభసాటి రూట్లలో మాత్రమే ఆసక్తి చూపుతోంది. ప్రభుత్వం ప్రజారవాణా కోణంలో ఏర్పాటు చేసే రూట్లలో విస్తరణకు సహకరించేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ఎదుట ప్రస్తావించారు. ఇప్పటికే ఏటా నష్టాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థతో ఒప్పందం చేసుకుంటేనే మెట్రో విస్తరణకు అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రమేయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఓపెన్‌ బిడ్డింగ్‌కు అవకాశం ఉన్నప్పుడు ఎల్‌ అండ్‌ టీకే నామినేషన్‌ పద్ధతిలో పనుల్ని ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఒత్తిడి తేవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను ఆయన అనుమానించారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో మెట్రోరైల్‌ తొలిదశ ప్రాజెక్ట్‌ను ఇప్పటికీ అందుబాటులోకి తెలేదు. కానీ విస్తరణ పనుల అప్పగింతకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాష్ట్రంపై ఒత్తిళ్లు తెస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌ అండ్‌ టీ, గత ప్రభుత్వం తప్పులు చేస్తే, హైదరాబాద్‌ ప్రజలు ఎందుకు శిక్షకు గురికావాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్‌ ఈ ఒత్తిళ్ల ఫలితమేనని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -