Wednesday, September 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుయూరియా కోసం అన్నదాతల అరిగోస

యూరియా కోసం అన్నదాతల అరిగోస

- Advertisement -

తొక్కిసలాటలో మహిళకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
పోలీసుల పహారాలో యూరియా పంపిణీ

నవతెలంగాణ-పెద్దవూర
యూరియా కోసం అన్నదాతలు అరిగోపడుతున్నారు. సొసైటీలు, రైతు సేవాకేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే లైన్‌లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో రైతుసేవ సహకార సంఘం కార్యాలయానికి యూరియా వచ్చిందన్న సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం క్యూ కట్టారు. సహకార సంఘానికి 860 బస్తాల యూరియా రావడంతో రైతులకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు విడుదల చేశారు. వీటితోపాటు మరో 450 బస్తాలు వచ్చే అవకాశం ఉండటం తో వాటికి కూడా టోకెన్లు ఇచ్చారు. మహిళా రైతులకు, రైతులకు వేర్వేరుగా లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అందరికీ యూరియా అందుతుందో లేదోనన్న ఆందోళనలతో ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో గేమ్యా తండాకు చెందిన రమావత్‌ లక్ష్మి సొమ్మసిల్లి పడిపోయింది.

పోలీసులు వెంటనే ఆమెను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక సహకార సంఘం భవనం ముందు క్యూలో నిలబడిన చల్లకుర్తి గ్రామానికి చెందిన ఈసూరాజు శ్రీనివాస్‌ను ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ గట్టిగా లాగాడు. ఉదయం నుంచి లైన్‌లో నిలబడిన తాను.. బయటికి వెళ్లి తిరిగి అదే ప్లేస్‌లో నిలబడేందుకు తాడు దాటి లోపలికి వచ్చానని, కానిస్టేబుల్‌ వెనుక లైన్‌ నుంచి రావాలని గట్టిగా లాగాడని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగర్‌ సీఐ శ్రీను నాయక్‌ ఆధ్వర్యంలో పెద్దవూర, నాగార్జునసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల సిబ్బంది భద్రతాచర్యలు చేపట్టారు. పెద్దవూర ఎస్‌ఐతోపాటు సాగర్‌ ఎస్‌ఐ ముత్తయ్య సిబ్బంది బందోబస్తులో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -