కూల్చినచోట ఇందిరమ్మ ఇండ్లు కట్టించివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
గాజులరామారంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెద్దలను వదిలేసి పేదలపై హైడ్రా ప్రతాపం చూపడం దారుణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం ప్రాంతంలో ఇటీవల ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని స్థానిక సీపీఐ(ఎం) శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు నివసిస్తున్న ఇండ్లను కూల్చిన చోటే ఇందిరమ్మ ఇండ్లు కట్టించివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాజులరామారం సర్కిల్‌లోని సర్వే నెంబర్ 307లోని గాలి పోచమ్మ బస్తీ మంజూరునగర్ బస్తీ, బాలయ్యనగర్ తదితర బస్తీలలో 40 సంవత్సరాల నుంచి పేదలు చిన్నచిన్న ఇండ్లు కట్టుకొని నివసిస్తూ క్వారీ గుంతలలో పనిచేస్తున్నారని తెలిపారు. వారి ఇండ్లను హైడ్రా, ప్రభుత్వ యంత్రాంగం ఆదివారం కూల్చేశాయని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు.
పేదలు కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే ప్రజా ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదన్నారు. బడా పెట్టుబడిదారులను కాపాడుతూ పేదలపై మాత్రమే హైడ్రా పేరు మీద దాడులు చేయిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ బస్తీలకు వచ్చి ”మీరంతా పేదలు.. మీకందరికీ సొంత ఇండ్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తాను” అని చెప్పి ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పేదల ఇండ్లు కూలగొట్టించడం సరికాదన్నారు. ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పెట్టుబడిదారులకు పెట్టినట్టు.. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నదని అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ చైర్మెన్ డిజి నర్సింహారావు మాట్లాడుతూ.. చెరువుల భూములను ఆక్రమించిన వారి ఇండ్లను హైడ్రా కూలగొట్టాలి కానీ ఎలాంటి చెరువులూ లేని క్వారీ గుంతలలో కష్టపడి పని చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చడం సిగ్గుచేటన్నారు. పేదల ఇండ్లను కూల్చిన చోటనే కట్టించాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, నాయకులు బి.వెంకటరామయ్య, ఎం.శంకర్ రాథోడ్ సంతోష్, బాల వెంకటేశ్వరరావు, బాలపీర్, శ్రీను, దేవదానం, ఎండి.ముక్తార్, వజీర్, ఎండి.మోసిన్, శ్రీనివాస్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.