24 గంటల్లో 251 మీ.మీ వర్షపాతం..10 మంది మృతి
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాజధాని కొల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తు తున్నాయి. సోమవారం అర్దరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం అంతటా రోడ్లు, నివాస సముదాయాలు జలమయమయ్యాయి. దీంతో మంగళ వారం నగరం అంతటా ట్రాఫిక్, ప్రజా రవాణా, రోజువారీ జీవితం స్తంభించి పోయింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా 10 మంది మరణించారు. వీరంతా విద్యుత్‌షాక్‌తో మరణించడం మరింత విషాదం. అలాగే, నగరంలో 24 గంటల కంటే తక్కువ సమయంలో 251.4 మీమీ వర్షపాతం నమోదయింది. 1986 తరువాత (259.5 మీ.మీ) ఇదే అత్యధిక వర్షపాతం. గత 137 ఏళ్లలో ఇది ఆరో అత్యధిక వర్షపాతం. నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని, గరియా కామదహరిలో కొన్ని గంటల్లోనే 332 మీ.మీ వర్షపాతం, జోధ్‌పూర్ పార్క్‌లో 285 మీ.మీ వర్షపాతం నమోదైందని కొల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) తెలిపింది. అలాగే, కాలిఘాట్‌లో 280 మీ.మీ, టాప్సియాలో 275 మీ.మీ, బల్లిగంజ్‌లో 264 మీ.మీ, ఉత్తర కోల్‌కతాలోని తంతానియాలో 195 మీ.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
తెల్లవారుజామున 2,30 గంటల నుంచి 5.30 గంటల మధ్యే ఎక్కువ వర్షపాతం నమోదయిందని పేర్కొంది. వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో దసరా సెలవులు రెండు రోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 నుంచి దసరా సెలవులను ఇప్పటికే ప్రకటించారు. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీటితో నిండిపోవడంతో మెట్రో సర్వీస్‌తో పాటు, హౌరా, కొల్కతా టెర్మినల్ స్టేషన్లకు రైలు సేవలను నిలిపివేశారు. విమాన ప్రయాణం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. కనీసం 30 విమానాలు రద్దు చేశారు. మరో 31 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కాగా, సోమవారం ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
కోల్‌కతాలో కుంభవృష్టి
- Advertisement -
- Advertisement -