Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్‌లపై హైకోర్టులో పిటిషన్‌

బీసీ రిజర్వేషన్‌లపై హైకోర్టులో పిటిషన్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల కల్పనకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని, 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరతాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్ధిపేట జిల్లాకు చెందిన మరొకరు పిటిషన్లు వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీకు 26 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు ఉన్నాయనీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్లు 50 నుంచి 68 శాతానికి పెరగడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమస్యగా మారుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285 (ఏ) ప్రకారం ఇప్పుడున్న రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285(ఏ) తొలగించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి శాసనసభ తీర్మానించిందన్నారు. ఈ తీర్మానానికి గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదం తెలపలేదన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నందున ఇక్కడ ఎందుకు అమలు చేయరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. తమిళనాడు కేసు వివాదం సుప్రీం కోర్టులో ఉందన్నారు. ఈ తరువాత రిజర్వేషన్లను పెంచాలన్న బీహార్‌ ప్రయత్నాలు కోర్టులో వీగిపోయాయని తెలిపారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిపేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎన్నికల సంఘం, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్ధిపేట కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం విచారణ చేపట్టనున్నారు.

పిటీషన్లు కొట్టేయండి
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్‌ గ్రామంలో 1521 ఎకరాలు శ్రీ సీతారామస్వామి గుడివేనని, వాటి అక్రమణలకు పాల్పడిన వారి పిటీషన్లను కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ సీసీఎల్‌ఏ 2014లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌పై వేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరింది. ఈ వ్యవహారంపై సీసీఎల్‌ఏ విచారణ చేసి సమర్పించిన నివేదిక ప్రకారం 1400 ఎకరాలకుపైగానే ఆలయ భూమి అని తేలిందన్నారు. విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ ప్రకటించారు.

గ్రూప్‌ 1పై నేడు విచారణ
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలపై సింగిల్‌ జడ్జి గత నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించనుంది. క్వాలిఫై అయిన అభ్యర్థి వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సర్వీస్‌ కమిషన్‌ లాయర్‌ కల్పించుకుని టీజీపీఎస్సీ కూడా అప్పీల్‌ వేసిందని, బుధవారం విచారణ చేయాలని కోరారు. ఇందుకు హైకోర్టు అనుమతిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసి ఎంపిక ప్రక్రియను అమలు చేయాలని అప్పీల్‌లో కోరారు.

రూల్స్‌ ప్రకారమే చేయాలి
గుట్టలు, కొండలను పేల్చి నివాసయోగ్యంగా చదును చేసే చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌ న్యాయవిహార్‌ వెనుక భాగంలో రాత్రిపూట పేలుళ్లు నిర్వహిస్తుండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్స్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ విచారణ పూర్తి చేసింది. న్యాయ విహార్‌లో పేలుళ్లు చట్ట ప్రకారమే జరిగాయని, ఇప్పుడు జరగడం లేదని ప్రభుత్వం చెప్పడంతో విచారణను మూసివేసింది.

ఘోష్‌ రిపోర్ట్‌ అమలు ఆపండి-స్మిత సబర్వాల్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిర్వహణ, నిర్మాణాల్లో అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన కమిషన్‌ రిపోర్టును ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. సీఎంఓలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ వేసిన పిటిషన్‌లో కమిషన్‌ తనపై ఆరోపణలు చేసే ముందు, చట్టప్రకారం తన వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. విచారణ కమిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 8బి, 8సి ప్రకారం నోటీసులు జారీచేయలేదని అన్నారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పారు. దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -