– 42 శాతం రిజర్వేషన్ల ఖరారుపై
– స్పష్టత రాగానే స్థానికంపై ముందుకు
– ప్రభుత్వానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డులపై రిజర్వేషన్ల నివేదిక
– డీఈఓల నుంచి టీచర్ల డేటా తీసుకున్న కలెక్టర్లు
– 26న రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వడివడిగా సన్నద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో జారీ చేసిన వెంటనే ముందుకెళ్లాలనే ఆలోచనలతో అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నది. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఎలా ముందుకెళ్లాలనే విషయంలో రాష్ట్ర సర్కారు తర్జనభర్జన పడుతున్నది. మరోవైపు ఎన్నికల అధికారులు జడ్పీటీసీ, జడ్పీ చైర్మెన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల వివరాలను గోప్యంగా ఉంచారు. బీసీ కులగణన సర్వే ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు తెలిసింది. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల శాతంపై జీవో జారీ చేశాకే వాటి వివరాలను ప్రభుత్వం ప్రకటించనున్నది. రాష్ట్రంలో 5773 ఎంపీటీసీ స్థానాలు, 566 జెడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 31 జడ్పీ స్థానాలు, గ్రామపంచాయతీలు 12,777, వార్డులు 1,12,694 ఉన్నాయి. అందులో 2450 ఎంపీటీసీ స్థానాలు, 238 ఎంపీపీ, 238 జెడ్పీటీసీ స్థానాలు, 5363 గ్రామపంచాయతీలు, 47270 వరకు వార్డు స్థానాలు బీసీలకు కేటాయించినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
26న ఆర్వో, ఏఆర్వో, పీఓలకు శిక్షణ
ఎన్నికల నిర్వహణకోసం డీఈఓల నుంచి టీచర్లకు సంబంధించిన డేటాను కలెక్టర్లు తీసుకున్నారు. గెజిటెడ్, స్కూల్ అసిస్టెంట్లకు, ఇతర స్టాఫ్ చేపట్టాల్సిన విధులపై వివరాలు డీఈవోలు అందజేశారు. దాని ఆధారంగా త్వరలో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సీనియార్టీ ప్రకారం ఎవరికి బాధ్యతలు కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతున్నది. ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి(ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్‌ఓ)లకు కలెక్టర్లు ఈ నెల 26న శిక్షణ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం విడుదల చేశారు. అదే విధంగా మండలాల వారీగా పోలింగ్ ఆఫీసర్లు(పీఓ), ఏపీఓ, ఓపీఓలకు సైతం శిక్షణ నిర్వహిస్తున్నట్లు, అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కలెక్టర్లు ప్రకటించారు. ఆయా మండలాల అధికారులకు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీనే..
ప్రభుత్వం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఆ తర్వాతనే సర్పంచి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉంది.అందుకే మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఆర్‌ఓలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది.