పాతిక శాతానికి చేరిన పేదరిక రేటు : ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక
వాషింగ్టన్ డీసీ : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ దేశంలో పేదరికం పాతిక శాతం దాటింది. ఇవి ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక బయటపెట్టిన విషయాలు. దేశంలోని అత్యంత అణగారిన సమాజాలను రక్షించుకోవాలంటే తక్షణమే సంస్కరణలు సహా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచబ్యాంక్ ఆ నివేదికలో నొక్కి చెప్పింది. పాక్‌లో గత ఇరవై సంవత్సరాల కాలంలో కొనసాగిన పేదరికం, అమలైన సంక్షేమంపై ఈ నివేదిక తొలిసారిగా లోతుగా విశ్లేషించింది. అందుకోసం కుటుంబ సర్వేలు, ప్రభుత్వ రికార్డులు, ప్రాదేశిక విశ్లేషణలను పరిశీలించింది. పాకిస్తాన్‌లో అసమాన తలు పెరిగిపోతున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసిందని డాన్ పత్రిక తెలిపింది. ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం…గత మూడు సంవత్సరాల కాలంలో పాక్‌లో పేదరిక రేటు ఏడు శాతం పెరిగి 2024-25లో 25.3 శాతానికి చేరుకుంది. అయితే 2001-02లో 64.3 శాతంగా ఉన్న పేదరిక రేటు 2018-19 నాటికి 21.9 శాతానికి తగ్గింది. కానీ ఆ తర్వాత పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇందుకు కోవిడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల, వరదలు, ఆర్థిక అస్థిరత కారణమయ్యాయి.
వ్యవసాయం నుంచి సేవల రంగంలోని ఉద్యోగాల వైపు మళ్లడం తో పాక్‌లో అంతకుముందు పేదరికం తగ్గుముఖం పట్టింది. అయితే పాకిస్తాన్ ఆర్థిక పరివర్తనలో సమ తుల్యం లోపించింది. ఉద్యోగాల కల్పన మందగించింది. ఉత్పాదకతలో వృద్ధి, ఆర్థిక వైవిధ్యం నెమ్మ దించాయి. అసంఘటిత రంగంలోనే ఎక్కువగా ఉపాధి లభిస్తోంది. మొత్తం ఉద్యోగాలలో ఈ రంగం వాటా 85 శాతానికి పైగానే ఉంది. మహిళలు, యువతకు పెద్దగా పని దొరకడం లేదు. పాకిస్తాన్ సామాజిక సూచికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 40 శాతం మంది చిన్నారులు కుంగుబాటుకు గురవుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించాల్సిన చిన్నారు ల్లో మూడో వంతు మంది పాఠశాలలకు దూరమయ్యారు. బడికి వెళుతున్న వారిలో కూడా మూడు వంతుల మంది కనీసం చదవలేకపోతున్నారు. సురక్షిత మంచి నీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కూడా పరిమితమే. దేశంలో సగం కుటుంబాలకు మాత్రమే సురక్షితమైన తాగు నీరు లభిస్తోంది. సుమారు మూడో వంతు కుటుంబాలు సరైన పారిశుధ్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతు న్నాయి. కాగా ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రాంతీయ అసమానతలను కూడా ప్రస్తావించింది. నగరాలతో పోలిస్తే పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాలలో పేదరికం రెట్టింపు కంటే ఎక్కువగా కన్పిస్తోంది. చారిత్రకంగా అభివృద్ధికి నోచుకోని జిల్లాలు నేటికీ అవే పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాయి.