-సత్య
ఈనెల 22 నుంచి నవరాత్రి కానుకగా తగ్గించే జీఎస్టీ స్లాబులతో మీరు నేరుగా స్వర్గానికి భారతీయ పుష్పక విమానంలో పైసా ఖర్చు లేకుండా వెళ్లి రావచ్చన్నట్లుగా నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీహార్, తర్వాత జరగాల్సిన మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో ఈ ప్రచారం మోతమోగుతున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు పొందుతూ నరేంద్రమోడీ బొమ్మ పెట్టటం లేదంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తారు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. పన్నెండు, ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించే శ్లాబులను రద్దు చేసి ఐదు, పద్దెనిమిది శాతంతో పండగ చేసుకోవాలని చెబుతున్నవారు. ఒక్క మోడీ బొమ్మనేే ఎందుకు పెడుతున్నట్లు ? జీఎస్టీ తగ్గింపు నష్టాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తే మోడీ చిత్రం పెట్టుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ అలా కాదే, సగం నష్టాన్ని భరించేది రాష్ట్రాలు,రూ.8 వేల కోట్ల నష్టమని ఏపీలో చంద్రబాబు ఇంజన్ ధ్వనులు చేస్తోంది, ఆ పేరుతో దేనికి కోత పెడతారో అది వేరే అంశం. తెలంగాణ కూడా రూ.7వేల కోట్లు ఆదాయం కోల్పోతుందని, దాన్ని కేంద్రమే భరించాలని రేవంత్ సర్కార్ అంటోంది.
ఏ కారుకు ఎంత, ఏ మోటార్ సైకిలుకు ఎంత, ఇలా పన్ను భారం తగ్గే వాటి గురించి ఇప్పటికే కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. గిరాకీ గిడసబారి లాభాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే విలాస వస్తువులపై 28 నుంచి 18శాతానికి పన్నుల తగ్గింపు వారికి ఊరటనిచ్చే మాట నిజం. పన్నెండు పన్ను జాబితాలో ఉన్నవాటిని ఐదుశాతానికి తగ్గించారు. గత లావాదేవీలపై జరిపిన విశ్లేషణ క్రిసిల్ నివేదిక ప్రకారం ప్రతి వంద రూపాయల జీఎస్టీ రాబడిలో ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు నుంచి ఆరు రూపాయలు, పద్దెనిమిదిశాతం వాటితో 70 నుంచి 75, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి 13 నుంచి 15 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 28,12శాతాలు ఉండవు. అందువలన ప్రామాణిక పన్నుశ్లాబ్ నుంచి ఎంత అనేది కొద్ది నెలల తర్వాత గానీ వెల్లడికాదు. తాజా మార్పులు, ఆదాయపన్ను మినహాయిం పులు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో మొత్తం నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేర జనంలో కొనుగోలు శక్తి పెరిగేందుకు అవసరమైన సొమ్ము చేరుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని ఊరడిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాత్రూ ముల్లో తప్ప బహిరంగంగా ఏడవటానికి కూడా అవకాశం లేదు, ఎవరి బాధలు వారివి.
ఉక్రెయిన్ – రష్యా పోరు మనదేశం, చైనాలకు ఎంతో మేలు చేస్తున్నది. ఎందుకంటే, అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్ చమురు రాయితీ ధరలకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మిగులుతున్నది. విపరీతంగా పెంచిన చమురు సెస్‌లను రద్దు చేస్తే వస్తుకొనుగోలు ఇంకా పెరుగుతుంది. సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉన్న యువత ఇలాంటి విషయాల మీద ఎందుకు కేంద్రీకరించటం లేదు ? జీఎస్టీ తగ్గింపు ఏ మేరకు జనాలకు ఉపశమనం కలిగించినా మంచిదే. కానీ చమురు భారం సంగతేమిటి ? దాన్ని జీఎస్టీలో ఎందుకు చేర్చరు? రాష్ట్రాల మీద నెపం వేస్తున్నారు.ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి? వాటికి ఉన్న ఆదాయ వనరులలో అమ్మకపు పన్ను రద్దుచేసి జీఎస్టీ తెచ్చారు. నష్టం వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. అదే విధంగా చమురు మీద వేస్తున్న వాట్ బదులు జీఎస్టీకి మార్చి అదే విధంగా పరిహారాన్ని కేంద్రం ఎందుకు చెల్లించకూడదు? అలా చెల్లిస్తే ఏ రాష్ట్రమైనా వ్యతిరేకత తెలుపుతుందా? పోనీ వినియోగదారుల పట్ల ఏమైనా నిజాయితీగా ఉందా అంటే అదీ లేదు. దరిద్రం ఏమి టంటే దాని గురించి అడిగేవారేలేకపోయారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరిస్తామని ఒక విధానాన్ని అమలు జరిపిన ప్రభుత్వం 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి నిలిపివేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయంగా ముడిచమురు ధర పడిపోయినా, రష్యా నుంచి రాయితీ ధరకు కొనుగోలు చేసినా ఆ మేరకు వినియోగదారుడికి తగ్గించ లేదు. ప్రభుత్వమే అలా జనాల జేబులు కొట్టివేస్తున్నపుడు తగ్గించిన జీఎస్టీ పన్ను మొత్తాలను ప్రయివేటు కంపెనీలు బదలాయిస్తాయంటే నమ్మేదెలా? ధరల పెంపుదల మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు.
2023వ సంవత్సరంలో మన చమురు దిగుమతి బిల్లు రూ. 16,82,475కోట్లు, అది 2024లో రూ.14,80,232 కోట్లకు తగ్గింది. అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు, అయినప్పటికీ ఒక్క పైసా కూడా డీజిలు, పెట్రోలు ధరలు తగ్గించలేదు. సామాజిక మాధ్యమాల మీద కొన్ని ఆంక్షలు పెట్టినందుకే నేపాల్ యువత ఎలా స్పందించిందో చూశాము. మనవారికి ఎందుకు పట్టటం లేదు. ఇవేమీ తెలియని అంశాలు కాదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 93.15 డాలర్లు. నాడు నిర్ణయించిన ధరలే నేడు అమలు జరుగుతున్నాయి. అయిల్ ప్రైస్ డాట్ కామ్ సమాచారం ప్రకారం 2025 జనవరి 17న మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 84.1డాలర్లు కాగా సెప్టెంబరు 18న 69.9 డాలర్లకు తగ్గింది. అయినా ఎందుకు ధరలు తగ్గించలేదు, ఎవరైనా సమాధానం చెప్పేవారున్నారా? ఒక పీపా ముడిచమురు ధర పది డాలర్లు తగ్గితే దిగుమతి బిల్లులో లక్షా పదివేల కోట్లు మిగులుతాయి. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ధర 62 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. మన అవసరాల్లో 2025 జూలై నెలలో 31శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వేసిన గణాంకాల ప్రకారం 2022 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 1,260 కోట్ల డాలర్లు అంటే మన రూపా యల్లో లక్షా పదివేల కోట్లు మనదేశానికి మిగిలింది. గతంలో భారీ మొత్తాల్లో సెస్ విధించినపుడు ఒకసారి యుపిఏ ప్రభుత్వం చేసిన అప్పు తీర్చటానికి అని చెప్పారు.
మరోసారి కరోనా వాక్సిన్ ఉచితంగా వేశారంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనుకుం టున్నారు అని బుకాయించారు. ఇంకోసారి మనదేశ రక్షణకు అవసరమైన మిలిటరీ ఖర్చుల కోసం అని మరో కత చెప్పారు. ఒక వేళ నిజంగా వాక్సిన్ పేరుతో విధించి ఉంటే అవసరం తీరింది గనుక ఆ మొత్తాన్ని ఎందుకు రద్దు చేయలేదు ? కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్(కాగ్) తాజా నివేదిక ప్రకారం 2023-24 నాటికి విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం, స్వచ్ఛ భారత్, చమురు పరిశ్రమ అభివృద్ధి పేరుతో వసూలు చేస్తున్న సెస్ మొత్తాలను ఆ రంగాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రూ.3.69లక్షల కోట్ల మొత్తాన్ని వాటికి బదలాయించకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్ పేర్కొన్నది. సర్‌ఛార్జి, సెస్‌లో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు బదలాయించదు.
అసలు మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర ఎంత దాన్నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులైన డీజిలు, పెట్రోలుకు ఎంత పడుతున్నది, ఎంత వసూలు చేస్తున్నారు.
ఢిల్లీలో 2025 జూన్ నెలలో ఉన్న ధరల ప్రకారం లీటరు పెట్రోలు రూ.100గా ఉంది.దానిలో చమురుశుద్ధి కేంద్రాలు డీలర్ల వద్ద వసూలు చేసేది రూ.45, కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్, సెస్‌ల మొత్తం రు.32.90, ఢిల్లీ ప్రభుత్వం 30శాతం చొప్పున వ్యాట్ రు.23.25, డీలర్లకు ఇచ్చే కమిషన్ రూ.1.85, అంటే అసలు ధర కంటే పన్నుల వాయింపు 56.20 ఉంది.అదే డీజిలు మీద 51.3శాతం పన్నుల ున్నాయి. ఇతర రాష్ట్రాలు కొన్నింటిలో ఇంకా ఎక్కువ మొత్తం వ్యాట్ ఉంది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాలు చమురు మీద వసూలు చేసిన మొత్తం రూ.7.5లక్షల కోట్లు. ఇంత మొత్తం భారం మోపుతున్నప్పటికీ దాన్ని తగ్గించేందుకు మన దేశీయ ఉత్పత్తిని పెంచటం ఒక మార్గం. గడచిన పదేండ్లలో అంతకు ముందున్న దానికంటే ఉత్పత్తి తగ్గిందని చెప్పుకోవాలంటే పాలకులకుండదు గానీ మనకే సిగ్గేస్తున్నది!
జీఎస్టీ తగ్గింపు సరే! డీజిల్ ధరలు తగ్గించరేం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES