న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. గురువారం వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరైన ఆయన జస్టిస్ సచిన్ దత్తాకు హామీ ఇచ్చారు. ‘ఈరోజు నుంచి పది రోజుల్లోగా ఆయనకు (కేజ్రీవాల్) తగిన వసతి కేటాయిస్తాం. మీరు నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయవచ్చు’ అని అన్నారు. కాగా, 2024 అక్టోబర్‌లో ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలిగిన అరవింద్ కేజ్రీవాల్, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. నాటి నుంచి మండి హౌస్ సమీపంలోని మరో పార్టీ సభ్యుడి అధికారిక గృహంలో ఆయన నివసిస్తున్నారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన లోధి ఎస్టేట్‌లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించాలని ఆప్ కోరుతున్నది. అయితే ఆ నివాసాన్ని ఒక సహాయ మంత్రికి కేటాయించినట్టు కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా, కేజ్రీవాల్‌కు టైప్ 7 లేదా టైప్ 8 బంగ్లాకు అర్హత ఉన్నదని, ఆయన హౌదాను టైప్ 5 బంగ్లాకు తగ్గించకూడదని ఆయన తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టులో వాదించారు.