హైదరాబాద్‌లో భారీ వర్షం..

హైదరాబాద్‌లో భారీ వర్షం..నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉపరితల అవర్తనం ప్రభావంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని పలుచోట్ల సాయంత్రం 5.30 గంటల తర్వాత ఒక గంట పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు మొదలుకొని అంతర్గత రోడ్లపై నీరు చేరింది.దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. వాహన దారులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల నాలాలు, డ్రయినేజీ లు పొంగి పొర్లాయి.లోతట్టు ప్రాంతాల్లోని పలు బస్తీలు, కాలనీల్లోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు పరేషాన్‌ అయ్యారు. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.అత్యధికంగా మలక్‌పేట్‌లో 7.1 వర్షపాతం నమోదు కాగా, చార్మినార్‌, కార్వాన్‌లో 6.9 సెం.మీ., గోషామహల్‌, నాంపల్లి ప్రాంతాల్లో 6.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. అలాగే నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్‌,బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, షేక్‌పేట్‌, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌, ఫీవర్‌ ఆస్పత్రి, నల్లకుంట, విద్యానగర్‌,ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌,చిక్కడపల్లి, సికింద్రాబాద్‌, బౌద్దనగర్‌, పద్మారావు నగర్‌, బోయిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది.ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌ పూర్‌, హిమాయత్‌ సారగ్‌, రాజేంద్రనరగ్‌, అత్తాపూర్‌, మైలార్‌దేవ్‌ పల్లి తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
జీహెచ్‌ఎంసీకి 24 ఫిర్యాదులు
నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కురవడంతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అలర్ట్‌ అయి.. వెంటనే డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులను రంగంలోకి దించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టారు. ఇక నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు 24 ఫిర్యాదులు అందగా.. ఇందులో చెట్లు విరిగాయని 02 ఫిర్యాదులు, రోడ్లపై నీరు నిలిచిందని 13, డ్రయినేజీ మ్యాన్‌హౌల్స్‌ పొంగిపొర్లడంపై 9 ఫిర్యాదులు అందాయి. సమా చారం అందుకున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు అందించాయి.

Spread the love