Sunday, September 28, 2025
E-PAPER
Homeఆటలుఆసియా సవాల్‌

ఆసియా సవాల్‌

- Advertisement -

ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ ఢీ నేడు
జోరుమీదున్న టీమ్‌ ఇండియా
రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో.
.
ఆసియా కప్‌ భారత్‌, పాకిస్తాన్‌ సవాల్‌గా మారింది. గ్రూప్‌, సూపర్‌4 దశల్లో తలపడిన దాయాదులు.. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ పోరులోనూ ఢీకొడుతున్నాయి. అజేయ రికార్డుతో టీమ్‌ ఇండియా జోరుమీదుండగా.. పాకిస్తాన్‌ ప్రతీకార విజయం కోసం ఎదురుచూస్తోంది. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాక్‌ పోటీపడటం ఇదే తొలిసారి.

నవతెలంగాణ-దుబాయ్
ఆసియా కప్‌ ఆఖరు ఘట్టానికి చేరుకుంది. టైటిల్‌ కోసం ఎనిమిది జట్లు పోటీపడగా.. అంతిమంగా టైటిల్‌ పోరుకు రెండు జట్లు చేరుకున్నాయి. నిలకడగా విజయాలు సాధిస్తూ భారత్‌ అలవోకగా ఫైనల్‌కు చేరుకోగా.. నిలకడలేమి ఆటతీరుతో పాకిస్తాన్‌ తుది పోరుకు చేరుకుంది. అజేయ రికార్డుతో టైటిల్‌ నిలుపుకునేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమవుతోండగా.. ఆసియా కప్‌ టైటిల్‌తో భారత్‌ చేతిలో ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్‌ చూస్తోంది. భీకర బ్యాటింగ్‌, స్పిన్‌ మాయతో నేడు ఫైనల్లో భారత్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్‌ నేడు ఏం చేస్తుందో చూడాలి. భారత్‌, పాకిస్తాన్‌ ఆసియా కప్‌ ఫైనల్‌ నేడు రాత్రి 8 గంటలకు ఆరంభం. సోనీస్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.

భీకర ఫామ్‌లో భారత్‌
స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా వీడ్కోలుతో అభిమానుల్లో ఆసక్తి తగ్గినా.. కుర్రాళ్ల ఆటలో పస మాత్రం తగ్గలేదు. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ భీకర బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటుతో 309 పరుగులు బాదాడు. సూపర్‌4లో వరుస అర్థ సెంచరీలతో అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్‌ మాయగాడు కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రత్యర్థులను తిప్పేస్తున్నాడు. ఆరు మ్యాచుల్లో 9.84 సగటుతో కుల్‌దీప్‌ యాదవ్‌ 13 వికెట్లు పడగొట్టాడు. పరుగుల వేటలో అభిషేక్‌, వికెట్ల వేటలో కుల్‌దీప్‌ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా శుభ్‌మన్‌ గిల్‌లు అభిషేక్‌కు తోడుగా నిలుస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు కుల్‌దీప్‌తో కలిసి విజృంభిస్తున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, శివం దూబెలు దూకుడుగా ఆడుతున్నారు. బ్యాట్‌, బంతితో దూకుడు కొనసాగిస్తూనే.. ఫీల్డింగ్‌లో కాస్త మెరుగైతే నేడు టీమ్‌ ఇండియాకు ఎదురు లేదు.

పోటీ ఇవ్వగలరా?
పాకిస్తాన్‌ అనిశ్చితికి మారుపేరు. 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు హాట్‌ ఫేవరేట్‌గా వచ్చిన భారత్‌ను పాక్‌ అనూహ్య పంచ్‌ ఇచ్చింది. టైటిల్‌ లాంఛనమే అనుకుంటే.. పాక్‌ లాగేసుకుపోయింది. తాజాగా ఆసియా కప్‌లోనూ భారత్‌ గొప్పగా రాణిస్తోంది. గ్రూప్‌, సూపర్‌4 దశల్లో భారత్‌ జోరు చూశాక.. ఫైనల్లో పాకిస్తాన్‌ అసలు పోటీదారే కాదు అనిపించటం అతిశయోక్తి కాదు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో సత్తా చాటిన ఫకర్‌ జమాన్‌ ప్రస్తుత జట్టులో కీలక ఆటగాడు. దీంతో ఫకర్‌ జమాన్‌, సల్మాన్‌ ఆఘా, సయీం ఆయుబ్‌, ఫర్హాన్‌లు ఫైనల్లో చావోరేవో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. షహీన్‌ షా అఫ్రిది, హరీశ్‌ రవూఫ్‌, మహ్మద్‌ నవాజ్‌లు బంతితో పాకిస్తాన్‌కు కీలకం కానున్నారు.

పిచ్‌, వాతావరణం
దుబారు పిచ్‌ స్పిన్‌కు అనుకూలం. పేస్‌ బౌలర్లకు ఆశించిన అనుకూలత ఉండదు. స్లో వికెట్‌పై భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో మాయ చేస్తోంది. పాకిస్తాన్‌ శిబిరం సహజంగా పేస్‌ బౌలింగ్‌పై ఆధారపడుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం ఇరు జట్ల ఆటగాళ్లకు సవాల్‌గా మారనున్నాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండనుంది.

తుది జట్లు (అంచనా) :
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌, శివం దూబె, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
పాకిస్తాన్‌ : ఫర్మాన్‌, ఫకర్‌ జమాన్‌, సయీం ఆయుబ్‌, హుస్సేన్‌ తలట్‌, మహ్మద్‌ నవాజ్‌, సల్మాన్‌ ఆఘా, ఫహీం అష్రాఫ్‌, మహ్మద్‌ హరీశ్‌, షహీన్‌ షా అఫ్రిది, హరీశ్‌ రవూఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.


ఫైనల్లో ఆరోసారి ఢీ
భారత్‌, పాకిస్తాన్‌ అన్ని ఫార్మాట్లలో 210 మ్యాచులు ఆడాయి. కానీ టోర్నమెంట్‌ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖి పోరు అరుదు. గత 40 ఏండ్లలో ఐదు అంతకంటే ఎక్కువ జట్లు పోటీపడిన టోర్నమెంట్లలో దాయాది జట్లు ఐదుసార్లు ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్‌ మూడు సార్లు పైచేయి సాధించగా, భారత్‌ రెండు సార్లు గెలుపొందింది. 1989 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఫైనల్లో, 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధించింది. 1986, 1994 ఆస్ట్రల్‌-ఆసియా కప్‌ ఫైనల్స్‌ సహా 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ గెలుపొందింది. భారత్‌, పాకిస్తాన్‌ ఆసియా కప్‌ ఫైనల్లో తలపడటం ఇదే ప్రథమం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -