Monday, September 29, 2025
E-PAPER
Homeదర్వాజకవికి అత్యంత ముఖ్యమైనది దృక్పథ చైతన్యం

కవికి అత్యంత ముఖ్యమైనది దృక్పథ చైతన్యం

- Advertisement -

ప్రముఖ కవి, రచయిత, గాయకులు, సామాజిక ఉద్యమకారులు గాజోజు నాగభూషణంతో జరిపిన సంభాషణ. కవి అంతరంగ ఆవిష్కరణ…

మీకు సాహిత్యాభిరుచి కలగడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
నేను పుట్టింది పెరిగింది కల్లోల ప్రాంతమైన జగిత్యాలలో. నా చుట్టూ రైతాంగ పోరాటాలు పెచ్చరిల్లుతున్న వేళ, ఆ ఉద్యమాలతో మమేకమై ఉన్న నేను, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ పాదాల్ని గోడలపై నినాదాలుగా రాసినవాన్ని. ఆయన కవిత్వాన్ని తెలిసీ తెలియని వయసులోనే చదివి, ఏదో తెలియని ఒక విద్యుత్‌ ప్రవాహం నాలో వెల్లువెత్తిన అనుభూతికి లోనయ్యాను. ఆ ఉద్యమాల నుండి బయటకు వచ్చి కరీంనగర్కు నా నివాసాన్ని మార్చడం ద్వారా, సాహిత్యంలో ఉధ్ధండులైన ఎందరో సాహితివేత్తల ప్రసంగాలు నాలో సాహిత్యం పట్ల మక్కువను పెంచి, సజన బీజాలను నాటింది.

కవిగా, కథకునిగా, గాయకునిగా భిన్న ప్రక్రియల ప్రవేశం ఎలా జరిగింది?
తెలంగాణ ఉద్యమ ప్రభావము, తెలంగాణ రచయితల వేదికలో భాగస్వామ్యము, తెలంగాణ ప్రజా జీవితాలతో మమేకమైన అనుభవాలు నన్ను కవిత్వాన్ని రాయడానికి పూరికొల్పిన సందర్భాలు.
సాహిత్య ప్రక్రియల్లో పాట అత్యంత ప్రభావ శీలమైంది. సినిమా పాటలు, భక్తి గీతాలు పాడుకొనే నేను.. ప్రజా ఉద్యమాలతో అనుసంధానమైన తరువాతనే, ప్రజా గాయకులు పాడిన పాటలు విని, ఒక దక్పథ చైతన్యంతో ప్రజలను సమీకరిస్తూ, ప్రజలకోసం పాటలు రాసి పాడడం జరిగింది.
దుఃఖ భరిత తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించడానికి కవిత్వం కంటే విస్తతమైన కాన్వాస్‌ కలిగిన కథ బలమైన సాహిత్య ప్రక్రియ అని భావించి కథలు రాయడం మొదలుపెట్టాను.

మీ సమకాలీన కవుల నుంచి మిమ్మల్ని భిన్నంగా నిలిపే అంశం ఏమిటి?
నేనే కాదు, ఏ కవి అయినా ఒకరితో ఇంకొకరిని భిన్నంగా నిలిపి ఉంచే అంశాలు.. ముఖ్యంగా వస్తువు ఎంపిక, కవి యొక్క శిల్ప నైపుణ్యం, భాష నైపుణ్యం దానితోపాటు అత్యంత ముఖ్యమైన దక్పధ చైతన్యం.. ఇవి ఒకరికొకరిని భిన్నంగా నిలిపే అంశాలు. నా వరకైతే పాలకులను ప్రశ్నించి, సకల ఆధిపత్యాలను ధిక్కరించి, ప్రజల కోసం రాయాలనే ఎరుకతో నేను రాసిన నా కవిత్వం నన్ను నన్నుగా నిలబెట్టిందని భావిస్తాను.

తెలంగాణ వచన కవిత గురించి మీ అభిప్రాయం ఏమిటి?
తెలంగాణ వచన కవిత నేల విడిచి సాము చేయదు. దాని మూల ధాతువు ప్రజా జీవితమే. ప్రజల జీవితాల్లోని సకల సంవేదనల్ని సంలీనం చేసుకొని రాసిన కవిత్వమే ఎక్కువ పాల్లుగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చెలరేగిన ప్రజా ఉద్యమాలు తెలంగాణ సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఇక్కడ ఉద్యమాలు.. సాహిత్యం పరస్పరపూరకాలుగా పనిచేశాయి.అయితే,ఉద్యమాల ఛాయలో కవిత్వం కొంత పలుచబడిందని కొందరు మాట్లాడినా, కొత్త అభి వ్యక్తులతో,సాంద్రత నిండిన బలమైన వచన కవిత్వం ప్రస్తుతం తెలంగాణ నుండే వస్తుందని భరోసాతో చెప్పవచ్చు.

కవికి స్పష్టమైన రాజకీయ దక్పథం అవసరమేనా?
నా వరకైతే అవసరమేనని నమ్ముతాను. ఎందుకంటే రాజకీయం లేకుండా జీవితం లేదు. జీవితం లేకుండా కవిత్వం లేదు. మన జీవితాల్ని శాసించేవి రాజకీయాలే కాబట్టి,ఆ రాజకీయ దక్పథంతో కవి మూడో కన్నుతో భవిష్యత్తును దర్శించి రాసిన కవిత్వమే ప్రజలను మేలుకొలుపుతుంది.

కవిగా, కథకుడిగా, గాయకుడిగా, ఉద్యమకారుడుగా వివిధ సంఘాలతో కలిసి ప్రయాణించిన అనుభవాలు మీ జీవితాన్ని, సాహిత్యాన్ని ఎలా ప్రావితం చేశాయి?
వివిధ సంఘాలతో కలిసి నడిచిన అనుభవాలు నా జీవితాన్ని, సాహిత్యాన్ని గుణాత్మకమైన మార్పుకు గురిచేశాయి. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలతో కలిసి నడుస్తూ.. నేను చేసిన అనేక క్షేత్ర పర్యటనల ద్వారా ప్రజా జీవితాల్లో దాగిన అనేక చీకటి కోణాలను, వారి కన్నీళ్లను, కష్టాలను పరిశీలించడం ద్వారా నా సాహిత్యం సాంద్రతను సంతరించుకుందని చెప్పవచ్చు. నేను ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఎవరి కోసం రాయాలి అన్న సోయిని నాకు ఈ సంఘాలతో కలిసి నడిచిన చైతన్యమే అందించింది. ముఖ్యంగా తెలంగాణ రచయితల వేదిక నాకొక కొత్త చూపును,పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది.

ఉద్యోగ విరమణ చేస్తున్నారు కదా.సజన కారుడిగా, యాక్టివిస్టుగా మీ భావి జీవితం ఎలా ఉండబోతుంది?
కవిగా, ఒక యాక్టివిస్ట్‌ గా నేను ఈ సమాజాన్ని ఇంకా మెరుగైనదిగా ఉండాలని కోరుకుంటున్నాను. సమాజంలో కొనసాగుతున్న సకల ఆధిపత్యాలు, స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, కులాలు.. మతాల పేర చెలరేగుతున్న మంటలు, పర్యావరణ విధ్వంసాలు, యుద్ధాల పేరుతో కొనసాగుతున్న భయానక జన హననాలు అన్నీ అంతరించి అవతరించే ప్రేమ మయ ప్రపంచాన్ని కలగంటున్నాను. ఆ లక్ష్యం కోసమే పరితపిస్తాయి నా కలమైనా..గళమైనా.
ధన్యవాదాలు..

మోతుకూరి శ్రీనివాస్‌
9866061350

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -