Monday, September 29, 2025
E-PAPER
Homeదర్వాజపాటతల్లి పెద్దకొడుకు 'గోరటి వెంకన్న'

పాటతల్లి పెద్దకొడుకు ‘గోరటి వెంకన్న’

- Advertisement -

గోరటి వెంకన్న సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కరలేని పేరు.ఆటపాటతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. హంస అవార్డు గ్రహీత. కాళోజీ పురస్కార సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్‌.

వెనుకటికి సంకీర్తనల్లో అన్నమయ్య తిరుమలేశుడి మహిమాన్విత గాధను రాగిరేకులపై రాసి సరిగమలు కట్టి పాడినట్టు, వెంకన్న మట్టిమనుషుల జీవితాలనూ పల్లెనూ ప్రకతిని శతిచేసి సాహిత్యపుటల్లో నమోదు చేస్తున్న ఒక inspirable balladeer. తెలుగుజాతి పది కాలాలపాటు inspirational narratives అని గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’, ‘వల్లంకి తాళం’, ‘ఏకునాదం మోత’, ‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’.. ఈ పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలదు.

ముఖ్యంగా గ్లోబలైజేషన్‌ ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘ పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్‌ పాపులారిటిలోనే కాదు, 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలివిడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్‌ సాంగ్‌. వాగు ఎండిపాయెరో, నల్లతుమ్మ, సంత, అద్దాల అంగడి, కంచెరేగి తీపివోలె, యలమంద, గల్లీసిన్నది గరీబోల్ల కత పెద్దది, ఇద్దరం విడిపోతె, జబ్బకు సంచి చేతుల జెండ, సేతానమేడుందిరా, వేకువ పూత, వానొచ్చెనమ్మా, అక్కో మీరింటర నా బాధ, అందుకోర గుతపందుకో, రాజ్యహింస పెరుగుతున్నాదో, ఇదేమి ధర్మం, పల్లె అందాలు, పాట పాడేటి పిల్లలు, రేలాదూలా తాలెల్లా, వల్లంకి తాళం, సంచారం, తరమెల్లిపోతున్నదో, పొద్దువాలుతున్నదో ఇత్యాది పాటలన్నీ ప్రతిశ్రోతకు కంఠోపాఠం. ఆద్య కళలో పురుడు పోసుకుని తాత ముత్తాతల నుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సాంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న.

దళిత బహుజన స్పహ, తెలంగాణ అస్తిత్వచైతన్యం, మార్క్స్‌- అంబేడ్కర్‌ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. ప్రజోద్యమాలకు మద్దతునిస్తూ ‘లోకల్‌ టు గ్లోబల్‌’ విభిన్న ఇతివత్తాలను వైభవోపేతంగా గానం చేసిన, చేస్తున్న జానపద విద్వాంసుడు, మనకాలపు మహాకవి గోరటి వెంకన్న. శ్రావ్యత, సరళత వెంకన్న పాటకు రెండు కళ్లు.వేదికల్లో ఆవేశం పూని ఆయన మాత్రమే చేసే యక్షగాన ఫణితినత్యం సభికులకు సదా ముచ్చటేసే సమరోత్సాహం.

ఇంతకూ స్ఫూర్తిదాయక వాగ్గేయకారుడు అంటే ఏమిటో? ఈ గౌరవానికి గోరటి వెంకన్న ఎట్లా ఆదరణీయుడో చూద్దాం. ‘An inspirable balladeer is a balladeer whose music and storytelling are inspirational, often a term for singers or poets who create and perform inspirational narratives or songs’ అని నైఘంటికార్థం.కథకు సంగీతాన్ని జోడించి సొగసైన కథనంతో పాటను ప్రదర్శన కళగా నిలబెట్టే ధీమంతుడే స్ఫూర్తిదాయక వాగ్గేయ కారుడు. ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం, స్థితిస్థాపకత, ఆశావహ దక్పథం, తాదాత్మ్యం నలుచదరంగా పరచుకున్న కుదురైన పాటలకు చిరునామాగా నిలిచిన గోరటి వెంకన్న అక్షరాలా స్ఫూర్తిదాయక వాగ్గేయకారుడు. మరి, వెంకన్న పాటలు inspirational narratives ఎట్లానో చూద్దాం.

‘Inspirational narratives are short stories, either real-life or fictional, that motivate and offer a positive outlook by highlighting themes of hope, courage, and resilience in the face of adversity’ అనేది స్ఫూర్తిదాయక కథనాలకు నిర్వచనం. సాధారణంగా ఏ కవి అయినా శ్రోతలకు పాటలో ఓ కథ చెబుతాడు. అయితే, వెంకన్న పాటలు కథను తిరగేసే ఉత్త భావగీతాలు కాదు. అమెరికన్‌ సంగీతవేత్త, పాటల కూర్పరి డేనియల్‌ జి. బ్రౌన్‌ వ్యాఖ్యానించి నట్టు ”Ballads are a form of narrative verse
that can be either poetic or musical; not all ballads are songs. Many ballads tell stories, but this is not a mandatory attribute of the form. Many musical ballads are slow and emotionally evocative” లాక్షణికత పాదపాదాన ఉట్టిపడుతూ కథాప్రధానం, సహజత్వం, జాను తెనుగు, నిర్దిష్ట వస్తువుతో కూడుకున్న విశిష్ట వస్తుగీతాలు. ప్రతి పాట అందంగా లయబద్దమై కథనంతో నేత్రపర్వంగా నడుస్తుంది.

చెట్టు, పిట్ట, కొండ, కోన, వాగు, వంక, చేను, చెలక, చెరువు సమస్త ప్రకతి మధురంగా మార్మికంగా వెంకన్న పాటల్లో మనతో మాట్లాడతాయి. ”ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/ తడిలేని వడగండ్ల తలపించు పూతలు/ నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను” అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు. ”నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/ తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ ఏకుతారొకచేత సిరుతలింకొక చేత/ వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/ రాగి బెత్తంలేని రాజయోగిలా ఉండు/ ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన” అంటూ పితభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం.

‘అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాట నే పాడను? బ్రతుకే పాటైన పసివాడను’ అంటాడు ఓ పాటలో వేటూరి సుందర రామమూర్తి. ఈ పాదాలు నూటికినూరుపాళ్లు సత్యప్రమాణంగా గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. వెంకన్న పాటలు అలవోకగా మనం పాడుకోగలం. కానీ, అంత సులువుగా పాట తయారుకాదనేది దాని రుచిని ఆరగిస్తున్నవాళ్లంగా మనకో ఎరుక తప్పనిసరి ఉండాలి. నిజమే, పాట ముందు పసివాడిలా మారిపోయి రోజులకు రోజులు ధ్యానంలో అవధానంలో ఉండిమాత్రమే వెంకన్న పల్లవి చరణాలను ఒక కట్టడంలా నిర్మిస్తాడు. అందుకే పాటలన్నీ ఆయన నోట ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత కావాల్సివస్తే అంత కంఠస్థంగా పెల్లుబికి సభలను మంత్రముగ్ధం చేస్తుంది. బ్రహ్మంగారిలా లోకులకు వివరం వివేకం ఎలుగెత్తి చెప్పినా, గద్దరన్నలా నూతన ప్రజాస్వామికవిప్లవం కోసం ధ్వజమెత్తినా వెంకన్నపాట ఎత్తూ పొడవూ వెడల్పుల్లో తనకు తానేసాటి. వెంకన్న పాట విస్తతికి ఊహాజనిత ఉత్ప్రేక్షరూపకోపమలు కారణం కాదు.తాను పుట్టిపెరిగిన పాలమూరు,దాపున్న దుందుభి, కాలుకొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ‘క్వాట్రైన్స్‌(Quatrains)’ రూపుదిద్దుకుంటవి.

ఇందుకు ”ధరాంతమున ధ్వనించె నాదం/ దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/ దాశరథి ఘనకవనపు యాగం/ ఎందరో వీరుల ఆశల స్వప్నం” అంటూ ఎత్తకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కవులు రాజకీయాలు మాట్లాడరు, రాస్తారు. పార్టీరాజకీయాల కంటే ప్రజారాజకీయాలే కవులు నడపాలని కాళోజీ నిరూపించాడు. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశాడు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో పురుడుపోసుకున్న ‘రాములోరి సీతమ్మా’ పాటలో ”ఎదపైని దిగులుబండ జరిగి బాధ తొలిగెనో/ ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో/ శ్రావణి ముందే మేలుకొని శంఖమూదెనో/ ఆషాడ మబ్బుజడిసి అడుగు వెనుకకేసెనో/ శెర వెట్టినట్టి అరవైయ్యేండ్ల బలిమి ఓడెనో/ కల నిజమాయని నేల తనను తడుముకున్నదో” అంటూ పరివర్తన ధ్యేయమై ప్రజలకోణం పరిఢవిల్లే కొత్త ముఖచిత్రాన్ని తెలంగాణకు కాంక్షిచాడు.

గోరటి వెంకన్న పాటకు- పర్వత పంక్తిలోంచి పొలంగట్లకు వాలిన పాలనురగతీరు జలసుగంధం ఎట్లా ప్రాప్తించిందో? తల్లిరొమ్మును కడుపార కుడిచి వాన వెలిసినాక పచ్చినేలపై లేత డెక్కెలతో గంతులేసే ఆవుదూడ ముద్దురూపం ఎట్లా తటస్థించిందో? రైతు పచ్చజొన్నచేలో మంచెపై నిలబడి వడిసెల విసిరితే కంకులపై నుంచి మూకుమ్మడిగా మేఘాల్లోకి బారుకట్టే పిట్టల దివ్యదశ్యం ఎట్లా సమకూరిందో? ఊరబాయి గడ్డమీద మేనుకు కుంకుమ బండారినద్దుకొని గొంతునిండా కొమరెల్లి రాగాలు మడుచుకొని తంబూరా కాలిగజ్జెలసౌరుతో సంక్రాంతి ఉదయాల్లో ఊళ్లోకొచ్చే జంగాల చంద్రయ్య తత్వాల వేడి ఎట్లా భాసికమైందో? తెలియాలంటే ఆయన ఎన్నుకున్న ”నే పోతా మా కొండదారుల్లో ఏ రాత గీత సోకు తెలవని/ చెయ్యి తిరిగిన చిత్రకారుని చేతికందని లోకంలోకి/ వన్నెలొలికే పున్నమి వెలుగుల సన్నంపు సరికెల వెంట/ లోకములున్న లేకున్నట్టుగ ఏకాకిగ నా లోకం నేనయి” అంటున్న తోవలెమ్మటి మనమూ కదలాలి.” పేట గౌరారం బాట బంగారం/ పేట బాట నడుమ కాలి సంచారం/ పచ్చనాకు మడులు పసరునొంపె తడులు/ తలపైన కొమ్మలనాడించె గాలులు/ తనువెల్ల తాళమై దరువేసె వంకలు/ పరవశించి మెరిసె పల్లె నెలవంకలు” ఘలంఘలలు వినిపించే ఆయన ‘పాట దారి’న బయలెల్లి పోవాల్సిందే. వెంకన్నకు ముందు ప్రజాక్షేత్రాన్ని వాగ్గేయకార సాంప్రదాయంలో నాజర్‌,సుద్దాల హనుమంతు,గద్దర్‌, వంగపండు ఉద్దీప్తం చేసి ఉన్నారు. అల సెంద్రవంక ముందుమాట’ పాటల ఇంద్రధనుస్సు’లో వెంకన్న ద్వారా ”ఆ సాంప్రదాయం మరొక్కసారి ఎలా రి అడ్జెస్ట్‌ అయ్యింది” చెపుతారు కె.శివారెడ్డి.

ఒకటిన్నర దశాబ్దం క్రిందటి శివారెడ్డి మాటకు చేర్పుగా గోరటి వెంకన్న తన పూర్వీకులను మించి ప్రజాసాహిత్యాన్ని ‘రి స్ట్రక్చర్‌ అండ్‌ రి టెక్ట్చర్‌’ అమర్చిన అక్షరస్తపతి అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. హార్వర్డ్‌ ఆచార్యులు మార్టిన్‌ పుచ్నర్‌ అన్నట్టుగా విప్లవం అంటే ఇరవై ఒకటవ శతాబ్దం ఆరంభంలో పూర్తిగా చరిత్రను మార్చే ఏక సంఘటనగా కాకుండా, క్రమేపి పునరావతమయ్యే బహుసంఘటనలుగా ఆధునికత నిర్వచించాల్సి వుంది’ అంటాడు. అంటే చరిత్రలో ఒకేసారి జరిగే భారీ మార్పుల కంటే, నిరంతరంగా జరుగుతున్న ఆయా పరిణామాలు ఆధునికతను రూపొందిస్తాయని పుచ్నర్‌ వ్యాఖ్యకు అర్థం. ఈ అర్థగౌరవాన్ని నిలబెడుతూ పాటకు రూప విప్లవం,వస్తు విప్లవం ప్రసాదించి తొంబైల అనంతర తెలుగుప్రజల చరిత్రను ప్రకార్యాత్మక దిశలకూ మలుపులకూ మళ్లించిన సాహిత్య విప్లవ కారుడు, బహుజన తాత్వికుడు గోరటి వెంకన్న. అమెరికన్‌ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సష్టించినందుకు బాబ్‌ డిలన్‌ కు స్వీడిష్‌ అకాడమీ నోబెల్‌ బహుమతినిచ్చింది.మరి, ఇంటా బయటా ఇరవై ఇరవైఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితోపాటు సరికొత్త వస్తువునూ జోడించి, Epic హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్‌ బాకీపడ్డాయో.

(గోరటి వెంకన్న రేపు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం -హైదరాబాద్‌ నుండి ‘గౌరవ డాక్టరేట్‌’ అందుకుంటున్న సందర్భంగా)
డా.బెల్లి యాదయ్య, 9848392690

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -