విద్యార్ధులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..

– సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌
– బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
విద్యార్థుల మధ్య సఖ్యత పెంచాలని, ఉత్తమంగా మానవులు పరిమళించే సంస్కృతిని విద్యార్థుల్లో పెంచాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ‘ఉపాధ్యాయ దినోత్సవ వేళ ఆటపాటల మేళ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో మూడో వంతు జనాభా బాల బాలికలు ఉన్నారని అన్నారు. భారతదేశంలో ప్రతిరోజూ సగటున 70 వేల మంది జన్మిస్తున్నారని, వారందరికీ విద్య బోధనలు చెప్పి విజ్ఞానవంతులుగా.. నేటి బాలలే రేపటి భవిష్యత్తుగా తీర్చిదిద్దే కార్యక్రమమే ఉపాధ్యాయ దినోత్సవ ఆటపాటల మేళా అన్నారు. కొన్ని విద్యాలయాల్లో విద్యార్థులకు విష బీజాలు నాటుతున్నారని, మతపరమైన, కుల ఆలోచనలు పసి హృదయాల్లో నాటుతూ వారిని కల్మషులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాలు విష వలయాలుగా మారకూడదన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మానవతా విలువలను, మేధో శక్తిని ఉపాధ్యాయులు పెంపొందించాలన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న మేధో పరిజ్ఞానం, శాస్త్రీయ ఆలోచన, మానవీయ విలువలను వెలికి తీయడం కోసం విద్యావనాలు విజ్ఞాన నిలయాలుగా మారాలన్నారు. విద్యను ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. పిల్లల్లో వైఫల్య బలం ఎదుర్కొనే మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు బోధించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవ జనరల్‌ సెక్రెటరీ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, సహాయ కార్యదర్శి మమత, సైన్స్‌ శాస్త్రవేత్త హరిబండి ప్రసాద్‌ రావు, జన విజ్ఞాన వేదిక కోయ వెంకటేశ్వర్‌, శాంతారావు, రమేష్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love