– రెడ్‌లైట్ ఏరియాను తలపిస్తున్న ‘షో’
– కోర్టు నోటీసులకు భయపడి దాక్కున్న నాగార్జున : సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ షోను వెంటనే నిషేదించాలని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి షోలు కుటుంబాలను సైతం విచ్ఛినం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ సమాజానికి మంచి సంకేతాలను ఇచ్చే కార్యక్రమమే అయితే.. దీని హౌస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున కేసుకు సంబంధించి ఇప్పటీ వరకు ఎందుకు నోటీసులను తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షోలో యువతి, యువకులను నాలుగు గోడల మధ్య బంధించడం ఎందుకంటూ ప్రశ్నించారు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ చేస్తున్న ఈ షో ముంబాయి రెడ్‌లైట్ ఏరియాను తలపిస్తోందని వాఖ్యానించారు. గతంలో తాము కోర్టులో వేసిన కేసు ఈ నెల 27న విచారణకు రానుందని గుర్తు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిషేదించేంత వరకు విశ్రమించబోమని హెచ్చరించారు.
బీజేపీది లూటీ కోరు ప్రభుత్వం
దేశంలోని కొంతమంది కార్పొరేట్ ఆర్థిక నేరగాళ్లు రూ.16లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోతే, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేండ్లలో జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్ల ప్రజల ధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు. అదే బీజేపీ నాయకులు జీఎస్టీ తగ్గింపు పేరుతో ప్రతి కుటుంబానికి నెలకు రూ.15 వేల అదా చేస్తున్నామంటూ నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీహర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడఖ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రజల అసంతృప్తిని చల్లార్చకపోతే ఎవరైనా వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సిందేనన్నారు. యువతలో చైతన్యం పెరగడంతో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ఏ రాజకీయ పార్టీలు అక్కడి ప్రభుత్వాలను కూల్చలేదనీ, ప్రజా ఉద్యమాల వల్లే అవి పతనమైయ్యాయని గుర్తుచేశారు.
బీజేపీ అధికార దాహానికి ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం : సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
బీజేపీ తన అధికార దాహానికి ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలన్ని కలిసి కట్టుగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఖమ్మంలో డిసెంబర్ 26న సీపీఐ వందేండ్ల జాతీయ స్థాయి ముగింపు ఉత్సావాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందులో పార్టీ జాతీయ నాయకులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహా పాల్గొన్నారు.
బిగ్‌బాస్ షోను వెంటనే నిషేదించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES