కర్నాటక, మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలకు సంబంధించి వెలువడుతున్న ఆరోపణల తీరు చిత్రవిచిత్రంగా ఉంది. ఈ వ్యవహారం కర్నాటకలోని అలంద్ నియోజకవర్గంలో మొదలైంది. ఆన్‌లైన్‌లో ఫారం 7 ద్వారా ఓటర్ల తొలగింపును కోరుతూ 2022 డిసెంబర్‌లో 6018 అభ్యర్థనలు అందాయి. ఈ మొత్తం వ్యవహారం సందేహాస్పదంగా మారింది. ఎన్నికల సంఘం తనంతట తానుగా ఈ వాస్తవాలను వెల్లడించలేదు. మూడేండ్ల తర్వాత బట్టబయలైన ఈ వ్యవహారం గురించి పదే పదే ఆరోపణలు వస్తున్నా, ఆఖరుకు ఈ నెలలో మరోసారి సదరు ఆరోపణలను లేవనెత్తినా ఎన్నికల సంఘం తొలుత ఇవన్నీ నిరాధారమైనవని కొట్టి పడేసింది. ఆ తర్వాత కర్నాటక ఎన్నికల సంఘం ముఖ్యాధికారి ఇందులో 24 మాత్రమే వాస్తవమైనవి, మిగిలిన 5,994 దరఖాస్తులు మోసపూరితమైనవని ప్రకటించాక కేంద్ర ఎన్నికల సంఘానికి జరిగిన తప్పు ఒప్పుకోక తప్పింది కాదు. బ్లాక్ స్థాయి అధికారుల ప్రాథమిక విచారణానంతరం ఈ విషయమై ఎన్నికల అధికారి కల్బుర్గి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.
కర్నాటకలోని అలంద్ శాసనసభా నియోజక వర్గంలో ఓటర్ల తొలగింపు, మహారాష్ట్రలోని రాజురా శాసనసభా నియోజకవర్గంలో ఓట్ల చేర్పు ఏ ఒక్క వ్యక్తో చేసిన పని కాదు. ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏదైనా కంపెనీ గానీ, కాల్ సెంటర్ గానీ ఈ అవకతవకలకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎంపిక చేసిన కేంద్రాలలోని ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్ 1 నుండి తొలగింపునకుగానీ చేర్పుకు గానీ అభ్యర్థనలు నమోదు చేశారు. ఇదంతా పక్కా ప్రణాళిక ద్వారా చేసిన వ్యవహారమే అనడానికి బలమైన ఆధారాలున్నాయి. అలంద్‌లో ఇద్దరు దరఖాస్తుదారులు ఫారం 7 సమర్పిస్తూ ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగించమని పెట్టుకున్న దరఖాస్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అంటే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా కానీ రాజకీయ ప్రయోజనాలతోనే ఇందుకు ఒడిగట్టారని స్పష్టం అవుతున్నది. ఓట్ల తొలగింపుకు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసిన దరఖాస్తులలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఫోన్ నంబర్లను పేర్కొన్నారు.
ఇదంతా ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల లక్ష్యంగా మారుమూల ప్రాంతం నుండి నడిపించారని అర్ధమవుతున్నది.ఈ అక్రమాలకు పాల్పడిన వారి కోసం కర్నాటక సిఐడి విచారణ చేపట్టింది. జనవరి 16న సిఐడి కర్నాటక ముఖ్య ఎన్నికల అధికారికి ఒక లేఖ రాస్తూ ‘మా విచారణలో ఎన్నికల ప్రధానాధికారి ఈ దరఖాస్తులు నమోదు చేసిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐ.పి) లాగ్ వివరాలు ఇచ్చింది కానీ ఐ.పి గమ్యస్థానం వివరాలు గానీ, పోర్టు గమ్యస్థానం వివరాలు గానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ వివరాలు అందించాల్సింది’గా కోరింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు ప్రయత్నించిన వారి ఉనికి, ఆవాస ప్రాంతం కనుక్కోవడానికి ఈ వివరాలు చాలా అవసరం.ఎన్నికల సంఘం ఈ వివరాలు అందచెయ్యని పక్షంలో అలంద్ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన పెద్ద తలకాయ (అది వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఏ కాల్ సెంటరో కావచ్చు) ఎవరనేది బట్టబయలు చెయ్యలేరు.
కర్నాటక సిఐడి 18 నెలలలో 18 అభ్యర్థనలు పంపినా ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఆ వివరాలు ఇవ్వలేదు. తొలుత కేవలం ఆరోపణలనుకున్నవి అక్రమాలేనని స్పష్టం అవుతున్నది. ఇదంతా ఒక పథకం ప్రకారం చేపట్టిన చర్యే అని కూడా స్పష్టం అవుతున్నది.కర్నాటక ఎన్నికల సంఘం ప్రధానాధికారి వివరణను అనుసరించి అలంద్‌లోని 10 పోలింగ్ కేంద్రాలలో ఓట్ల తొలగింపుకు పెట్టుకున్న దరఖాస్తులలో 5,994 ఫోర్జరీవే అని తెలియ వస్తుంది. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఈ మోసాన్ని గురించి బ్లాక్ స్థాయి అధికారులను హెచ్చరించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయించారు. ఈ మొత్తం వ్యవహారం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది: ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ ద్వారా ఫారం 7 సమర్పించి ఓటు తొలగించమని వచ్చే అభ్యర్థనలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షించే ప్రక్రియ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరుగుతుందా లేదా? మన దేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత పచ్చిగా నీరుగార్చేందుకు ప్రయత్నించడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనున్నది? ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయడానికిగాను వ్యక్తులు, కంపెనీలు ఆటోమాటిక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయా?
అవకతవకలు జరిగాయనేందుకు ప్రాథమికంగా విశ్వసనీయమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మొదటి నుండీ ఈ ఆరోపణలను ఎందుకు తోసిపుచ్చుతూ వచ్చింది? ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నదా? ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి ఒకటకటిగా అనేక ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టే సామర్థ్యాన్ని సంతరించుకోవాలనే ఆలోచన ఎన్నికల సంఘానికి ఉన్నట్లా? లేనట్లా? ఎన్నికల్లో సమన్యాయం దక్కడం లేదన్న ఆందోళన నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో పౌరులను విశ్వాసంలోకి తీసుకుని ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నదా? లేదా? అత్యున్నత స్థాయి జుడిషియల్ కమిషన్‌ను నియమించడం ద్వారా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించడం కానీ, అన్ని రాజకీయపక్షాల ప్రతినిధులు, ఎన్నికల రంగ నిపుణులతో కూడిన కమిటీతో పారదర్శకంగా విచారణ జరిపించడానికి కాని ఎన్నికల సంఘం సిద్ధపడాలి. స్వయం ప్రతిపత్తిగల సంస్థగా కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత నేలబారుకు చేరింది. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగంలోని 324, 326 అధికరణాల స్ఫూర్తితో సమ్మిళిత, సార్వజనీన ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(సెప్టెంబర్ 24 ‘పీపుల్స్ డెమోక్రసీ’)
ఆధునిక సాంకేతికతతో భారీ రిగ్గింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES