ప్రేమ..స్నేహం

Love..friendshipప్రేమంటే మానసిక పరమైన, ఆనందకరమైన భావన. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మంచి మనసుతో ఇంకొకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకోవడం. ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరిపైన, ఎందుకు పుడుతుందో చెప్పలేము. అలాంటి ప్రేమను సాధించడానికి ఏం చేయడానికైనా నేటి యువతరం సిద్ధంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురుకొని ప్రేమించిన వారిని పెండ్లి చేసుకోవడం పెద్ద విజయంగా భావిస్తున్నారు. అయితే పోరాడి సాధించుకున్న ప్రేమను జీవితాంతం నిలుపుకుంటున్నారా అనేదే ఇప్పుడు అసలు సమస్య. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌…
అశోక్‌కు 28 ఏండ్లు ఉంటాయి. అనుతో వివాహం జరిగి రెండేండ్లు అవుతుంది. వారిది ప్రేమ వివాహం. ఇంట్లో వాళ్లను ఎదిరించి, స్నేహితుల సహాయంతో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కూడా వారి సహకారంతోనే విడిపోవాలని ఐద్వా దగ్గరకు వచ్చారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో తెలుసుకుందాం.
అశోక్‌, అనూ ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు. ఇద్దరి కులాలు వేరు కావడమే దీనికి ప్రధాన కారణం. ఇక చేసేది లేక స్నేహితుల సహకారంతో రిజిస్టర్‌ ఆఫీసులో పెండ్లి చేసుకున్నారు. ఆరు నెలలు బాగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. అశోక్‌ అందరితో సరదాగా, కలివిడిగా ఉంటాడు. అది నచ్చే అనూ అతన్ని ప్రేమించింది. కానీ ఇప్పుడు అదే ఇద్దరి మధ్య సమస్యలను తీసుకొస్తుంది.
పెండ్లి తర్వాత ఎవరితో మాట్లాడొద్దు, కలవద్దు అంటుంది. ఆఫీసులో ఇతరులతో కలవకుండా, మాట్లాడకుండా పని చేయడం అసాధ్యం. అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది. టీమ్‌ వర్క్‌ ఉంటుంది. టీమ్‌లో ఏ ఒక్కరు పని చేయకపోయినా, టిమ్‌ సభ్యుల మధ్య గొడవలు వచ్చినా వర్క్‌ మొత్తం నష్టపోతారు. అలాంటిది ఎవరితో మాట్లాడవద్దు అంటే ఎలా పని చేయాలో అతనికి అర్థం కావడం లేదు. మహిళా ఉద్యోగులు ఫోన్‌ చేసినా గొడవ చేస్తుంది. అనూ కూడా అతనితో పాటే ఉద్యోగం చేస్తుంది. ఆఫీసు వాతావరణం అక్కడి పరిస్థితి, పని విధానం మొత్తం అనూకు తెలుసు. అయినా ఎందుకు తను అలా చేస్తుందో అశోక్‌కు అర్థం కావడం లేదు. దానితో ఇద్దరూ కలిసి ఒక దగ్గర వర్క్‌ చేస్తే ఆఫీసులో గొడవలు వస్తాయని అశోక్‌ వేరే కంపెనీలో చేరాడు. అప్పటి నుండి పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.
‘ఇక్కడ ఆఫీసులో నువ్వు ఎవరితో మాట్లాడినా, సంబంధాలు పెట్టుకున్నా నాకు తెలుస్తుందని వేరే ఆఫీసులో ఉద్యోగం చూసుకున్నావా’ అంటూ గొడవ పెట్టుకుంది. అశోక్‌ చిన్నప్పటి స్నేహితురాలైన సుమతితో మాట్లాడితే మాత్రం ఆ రోజు ఇంట్లో యుద్ధమే. సుమతి గురించి అనూకు ముందు నుండే తెలుసు. అప్పట్లో వీరి స్నేహం గురించి ఎంతో గొప్పగా చెప్పేది. సుమతితో అనూ కూడా స్నేహంగా ఉండేది. సుమతి భర్త కూడా వీళ్ల ఇంటికి వచ్చిపోతుండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆమెతో మాట్లాడితే అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. దాంతో తనకు కష్టంగా ఉన్నా సుమతితో మాట్లాడటమే తగ్గించాడు. ఇలా అనూ పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఆమె నుండి విడిపోవాలనుకుని సలహా కోసం ఐద్వా అదాలత్‌కు వచ్చి…
‘మేడమ్‌ అనూతో విడిపోవడం సరైనదో కాదో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమె సంతోషం కోసం తనకు నచ్చినట్టు ఉంటున్నాను. నాకు ఇష్టం లేకపోయినా ఆమె చెప్పినట్టు వింటున్నాను. అంతకు ముందు నేను అందరితో సరదాగా ఉండేవాడిని. ఇప్పుడేమో అవసరమున్నా మాట్లాడలేకపోతున్నాను. నా ఐడెంటిటీనే కోల్పోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మీరే ఏదైనా సలహా ఇవ్వండి’ అని అడిగాడు.
మేము అనూని పిలిపించి అశోక్‌ చెప్పిన దాని గురించి అడిగితే ఆమె ‘అశోక్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెద్దవాళ్లను ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఆయన ప్రేమ నాకు మాత్రమే సొంతం. నేను ఆయన ప్రేమను ఎవరితోనూ పంచుకోలేను. ఆయన అందరితో సరదాగా కలిసిపోతారు. నాకూ వాళ్లకు ఏమాత్రం తేడా లేదు. అందరికంటే నాతోనే ఎక్కువ సరదాగా మాట్లాడాలి. ప్రేమగా ఉండాలి అనుకోవడంలో తప్పేముంది. నా భర్త నాకు మాత్రమే సొంతం. అశోక్‌ ఇతరులతో మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. సుమతితో మాట్లాడుతుంటే మాత్రం నాకు బాగా కోపం వస్తుంది. అందుకే అశోక్‌ను కంట్రోల్‌ చేస్తున్నాను. అయితే వారిద్దరి గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని నాకు బాగా తెలుసు. కానీ నాకు తెలియకుండానే అలా గొడవపడుతున్నాను. అశోక్‌ ఇక్కడి వరకు వచ్చాడు అంటే అతన్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. కానీ నేనేం చేయాలి. నా ప్రేమలో స్వార్థం ఎక్కువ అనుకుంటా. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను’ అంటూ బాధపడింది.
దానికి మేము ‘మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. కానీ అనవసరమైన గొడవలతో బాధపడుతున్నారు. అశోక్‌ చేసే ఉద్యోగం గురించి నీకు బాగా తెలుసు. అతను ఎంత మందితో మాట్లాడినా నీ భర్త. నీతోనే ప్రేమగా ఉంటాడు. వాళ్లతో కేవలం సరదాగా ఉంటాడు. కానీ నీతో ప్రేమగా ఉంటాడు. అది నువ్వు గుర్తించాలి. నువ్వు తనకు సపోర్ట్‌ చేస్తేనే కదా ఆ ప్రేమను నువ్వు పొందగలవు. అలా కాకుండా ఊరికే గొడవ పడుతుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరూ ఎంతో ప్రేమించుకొని పెద్దలను ఎదరించి పెండ్లి చేసుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలి’ అని ఆమెకు చెప్పాము.
అలాగో అశోక్‌తో ‘మీరు అనూతో మరింత సమయం గడపాలి. ఆమెలో అభద్రతా భావం ఉంది. మీరు అందరిలాగే తనతో ఉంటున్నారని అనుకుంటుంది. తనకు మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఆమెకు అర్థం కావాలి. ప్రేమ ఉంటే సరిపోదు. అది ప్రత్యేకంగా చూపించాలి. అప్పుడే తనకు మీపై నమ్మకం వస్తుంది. ముందు ఇద్దరూ కలిసి సరదాగా ఓ వారం రోజులు ఏదైనా టూర్‌కి వెళ్ళిరండి. అప్పుడు సగం సమస్యలు పరిష్కారమవుతాయి. ఇప్పటి నుండి ఇద్దరూ సంతోషంగా ఉండండి. లేనిపోని సమస్యలతో సంతోషాన్ని పాడు చేసుకోకండి’ అని సర్ది చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051

Spread the love