Monday, October 6, 2025
E-PAPER
Homeదర్వాజఖడ్గధారినై……

ఖడ్గధారినై……

- Advertisement -

నా చుట్టూ కొత్త రెక్కలు కట్టుకొని
కొన్ని పక్షులు ఎగురుతున్నాయి
నేను ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుంటున్నాను
లేకపోతే నాకు జ్వరం రావడం ఏంటి
నాటి ఏ వేప కొమ్మల గాలి వాసనో
పెంకుటింటి అరుగు స్మతి స్పృహో
ఏదో ఒక అనామక కంఠం అ సందర్భ వాచక ప్రేలాపనో
అట్లా గుండె గొంతులోకి రాకుండా ఆపుతున్న విషాదం బహుశా ఇక్కడ నన్ను కట్టిపడేసి ఉంచవచ్చు
బహుశా గుండెలో ఎగిసి పడే ప్రాణం అక్షరమై
గొంతు దాటని పొలగా
ఇంకా కొత్త దర్శనాలని గురించి నన్ను హెచ్చరించవచ్చు.
రాలిపోయిన చుక్కల్లో మిగిలిన ఆకాశస్పృహ
నన్ను భూమిలో నిదరోతున్న మహా వృక్షం చేసి ఉండవచ్చు
ఊపిరి సెలయేటికి అడ్డుపడ్డ ఏదో మహా పర్వతం
నన్ను అర్ధరాత్రి నది ఒడ్డున
పడి గిలగిలలాడే చేపను చేయవచ్చు
నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందనుకున్న అస్తమా ప్రేయసి
మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చి కౌగిలించుకోవడం ఏమిటి?
జీవితానికి మరణానికి నడుమ
కనిపించని సన్నని పొర నాకు పునరాహ్వానం పలికిందా?
నా చుట్టూ ఆకుపచ్చగా విరిసిన పద్యాల తోటలు
తొడుగులు లేని నగపు మాటలు
సుగంధ భరిత మానవ పుష్పాలు
ఎల్లలు లేని ఏదో ప్రేమామత ధార
వైకుంఠపాళీ లో పాము ఎన్నిసార్లు మింగినా
మళ్లీ కొత్త నడకను ప్రసాదిస్తోంది.
నేను ఎవరో కదుపుతున్న పావును కాదు.
నేనై కదులుతున్న జీవన సౌందర్యాన్ని.
ఖడ్గ ధారినై ముళ్ళకంచెలలో కొనసాగే అవ్యక్త చైతన్యాన్ని.

డా. కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు, 9676096614

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -