అలంకారాలకు (tropes) కవిత్వంలో ప్రధానమైన స్థానం ఉంది. పాశ్చాత్య విమర్శలోని మెటానమీ, సినిక్డికీ, సీజురా మొదలైన ఎన్నో కవిత్వ ఉపకరణాలు లేదా సాధనాలు (poetic devices) మన తెలుగు కవులకు, పాఠకులకు అందరికీ తెలియకపోయినా ఈ అలంకారాలు మాత్రం తెలుసు. తెలుగు పాఠ్య పుస్తకాలలో ఈ అంశాన్ని చేర్చడమే అందుకు కారణం. ముఖ్యంగా పద్యకవులకు వీటి మీద మంచి అవగాహన ఉంటుంది. అయినా, వచన కవిత్వం రాసే కవులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, తదనుగుణంగా వివరిచడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
ఉపమ (simile), రూపకం (metaphor), ఉత్ప్రేక్ష (supposition or poetic fancy), అతిశయోక్తి (hyperbole) అలంకారాలు తెలుగులో ఎక్కువగా ప్రచలితమైనవి. ఇవి అర్థాలంకారాలు. ఇవి కాక మరెన్నో ఉన్నాయి. శబ్దాలంకారాలలో ఛేకానుప్రాస, యమకం, ముక్తపదగ్రస్తం మొదలైనవి చెప్పుకోదగినవి. పోలికను తెస్తూ లా(గా), వలె అనే పదాలను ఉపయోగించి రాసినదాన్ని ఉపమ అంటారని దాదాపు అందరికీ తెలుసు. ఇంగ్లిష్‌లో అయితే as, like లను వాడుతారు. పోలిక లేనప్పుడు ఆ మాటలు ఉన్నా అలంకారం సంభవించదు. ఉదాహరణకు, I work as a teacher/ నేను ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాను అనే వాక్యంలో as/ లా(గా) ఉన్నప్పటికీ అందులో పోలిక లేదు కాబట్టి, అది ఉపమ కాదు. ఉపమకు ఉదాహరణగా చెప్పబడే ప్రసిద్ధ తెలుగు వాక్యం, ”ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది.” ఇందులో ఆమె ముఖం ఉపమేయం కాగా చంద్రబింబం ఉపమానం. ఆంగ్లంలో వీటిని అదే క్రమంలో tenor, vehicle గా పేర్కొని, ఈ రెండింటి మధ్య గల భేదాన్ని వివరించాడు ఐ.ఎ. రిచర్డ్స్ అనే ఆంగ్లేయ విమర్శకుడు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాళిదాస కవి ఉపమకు ప్రసిద్ధుడు. అందుకే ఉపమా కాళిదాసస్య అన్నారు.
ఇక రూపకాలంకారం అంటే ఉపమానం, ఉపమేయంల మధ్య భేదం ఉన్నప్పటికీ వాటి మధ్య అభేదాన్ని లేదా తాద్రూప్యాన్ని వర్ణించడం. కవన భేరి (కవనం అనే భేరి), కవితా కన్యక (కవిత్వం అనే కన్యక), జీవన శకటం (జీవనం అనే శకటం) మొదలైనవాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. రూపకాలంకారంలో పరోక్ష రూపకం (implicit metaphor), మిశ్రమ రూపకం (mixed
metaphor), మృత రూపకం (dead metaphor) మొదలైన రకాలున్నాయి. వాటన్నిటిని వివరిస్తూ పోతే వ్యాసం చాలా పెద్దది అవుతుంది కనుక, ఆ పని చేయడం లేదు. ఉపమ, రూపకం – ఈ రెండు సమానంగా ప్రచలితాలు. రెండవది ఎక్కువ కవితాత్మకతను సాధిస్తుందని అనిపిస్తుంది కానీ, ఈ అభిప్రాయాన్ని కొందరు కవులు ఒప్పుకోకపోవచ్చు. దుఃఖం నన్ను మేఘంలా కమ్ముకుంది అనడం ఉపమ. దుఃఖం నన్ను మేఘమై కమ్ముకుంది, లేదా దుఃఖమేఘాలు నన్ను కమ్ముకున్నాయి అనడం రూపకం.
ఉపమానంలోని లక్షణాలు ఉపమేయంలో కూడా ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ ఊహించడం అనేది కీలకమైన మాట. ”లోపల దీపాలు ఉన్నాయా అన్నట్టుగా వెలుగుతున్నాయి ఆమె కళ్లు” అన్న వాక్యాన్ని ఉదాహరణగా సూచించవచ్చు. అతిశయోక్తి అలంకారం పేరులోనే సూచన ఉంది. ఇందులో వాస్తవానికి మించిన అతిశయ వర్ణన ఉంటుంది. ఉదాహరణకు, వాడు కొండలను పిండి చేయగల బలశాలి. ఈ తరం కవుల కవితలలో ఉపమాలంకారం తరచుగా కనిపిస్తుంది. దృష్టి మాత్రమే అనే కవితలో బి.వి.వి. ప్రసాద్ ”దృష్టి ఒకటే/ ఏదీ తాకలేని ఆకాశంలా,/ ఆకాశమంత సూర్యునిలా ప్రకాశిస్తుంది” అంటారు. ఇందులోని రెండు ‘లా’లు రెండు ఉపమలను చూపిస్తున్నాయి. చెర్వొక కల అనే కవితలో దాసరాజు రామారావు ”కిన్లే వాటర్ బాటిల్‌ను చూస్తున్నావా! నాకేమనిపిస్తుందో చెప్పనా- బంగారు పంజరంల బందీ అయిన మన ఊరి చెరువులా లేదూ!” అంటారు. ఇది రూపకం. ఇక్బాల్ చంద్ తన ఒక కవితలోని రెండు పంక్తులలో ఒక ఉపమను, రెండు రూపకాలను మెరిపిస్తారు: జలదరిస్తున్న దేహంలా/ సౌభాగ్యం నౌకను దౌర్భాగ్యం తుఫాను నడిపిస్తోంది.
వర్తమాన కవులలో ఉపమను చాలా విరివిగా ఉపయోగించిన, ఉపయోగిస్తున్న కవి రఘు శేషభట్టర్. మొక్కజొన్న పొత్తుల్లా విచ్చుకోవడం, దొప్పల్లా విప్పుకోవడం, మినుముల్లా రాలడం, పూలదిండులా ఒదగడం – ఇటువంటివి ఒకే చిన్న కవితలో ఆరు, ఏడు, ఎనిమిది ఉపమలు దర్శనమిస్తాయి. ప్రతీకలు, అలంకారాలు (ముఖ్యంగా ఉపమలు) లేకుండా ఈ కవి ఒక్క కవితను కూడా రాయలేదనడంలో అతిశయోక్తి లేదేమో. ”చాలాసార్లు నిద్రని దండెంమీద ఆరేసి” అన్న కవితా పంక్తిలో ఎంత అద్భుతమైన రూపకం ఉంది! దుఃఖమెప్పుడూ శేషమే అనే కవితలో వి. ప్రతిమ పొందుపరచిన ఈ అలంకారాన్ని మామూలు మెటఫర్‌గా కాకుండా surreal metaphor గా, conceptual metaphor గా చెప్పుకోవాలి. ”పీడకలలు పిచికారి చేసిన నీడల్ని/ ఏమి చేయాలో తేల్చుకోలేకపోతావు (శ్రీసుధ మోదుగు)” కూడా ఉన్నతస్థాయి రూపకం. ఇందులో మానవీకరణ (personification) కూడా ఉంది. కొన్ని రూపకాలలో కవితాత్మకతకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని అన్నది ఇందుకే.
”మస్తిష్కాకాశంలో ఎగిరే/ భావాల సీతాకోక చిలుకలను/ కాగితాల వనాలలో/ అలంకరిద్దామంటే/ ఈ విశాల విశ్వంలో/ ఇసుమంతైనా స్థలం శూన్యం” (మందరపు హైమవతి) ఇందులోని మొదటి మూడు పంక్తులలో ఒక్కొక్కదానిలో ఒకటి చొప్పున మూడు రూపకాలంకారాలున్నాయి. ఇదే కవితలో పరిహాసశూలం, తలపుల తుమ్మెదలు మొదలైన మరికొన్ని రూపకాలున్నాయి.
”ఎండమావుల/ వెండి కత్తుల వంతెన మీదుగా/ నడచి వస్తున్నాను/ మండే మధ్యాహ్నం లోంచి” (నాగరాజు రామస్వామి). ఇందులో కూడా చక్కని రూపకాలంకారం ఉంది. అడిగడిగి గొంతు పూడ్కపోయిన మోటబాయైంది (గోముఖ వ్యాఘ్రాలు – కొండపల్లి నీహారిణి). ఇది కూడా రూపకానికి ఒక మంచి ఉదాహరణ. తక్కిన అలంకారాలు పైన చెప్పిన రెండు అలంకారాలకన్న కొంచెం తక్కువగానే కనిపిస్తాయి నేటి కవిత్వంలో. అతిశయోక్తి అలంకారం విషయానికి వస్తే, కరోనా అనే తన కవితలో డాక్టర్ అమ్మంగి వేణు గోపాల్, ”విశ్వం విషాద గీతాన్ని రచిస్తున్నది/ విహాయసం దాకా ఆర్తస్వరం వినిపిస్తున్నది” అంటారు. ఇందులోని రెండవ పంక్తి అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ.
”కలుపు తీసే కూలీల పాటలతో/ గాలిలో వాయులీనాలు ఎగురుతుండేవి” (పొలాల తలాపిన – ఎమ్వీ రామిరెడ్డి) కూడా అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణే. ఈ కవి మెటానమీ (metonymy) అనే కవిత్వ సాధనాన్ని కూడా ప్రభావవంతంగా వాడటం మనం గమనించవచ్చు. సందర్భం వచ్చినప్పుడు సంబంధిత పంక్తులను ఉదాహరిస్తాను. సూరీడంత బొట్టు పెట్టుకుని (అంబటి వెంకన్న), ఆకాశానికి గోరుకొయ్యలు కాయించి (కౌముది) – ఇలా అతిశయోక్త్యలంకారం కూడా ఆధునిక వచన కవిత్వంలో కనిపిస్తుంది. కవులు తమ కవిత్వంలో అలంకారాలను ప్రయత్నపూర్వకంగా చొప్పించాలి అనడం మంచి విషయం కాదు. అవి కవితలలో సహజంగా ఒదిగితే బాగుంటుంది. ఈ కవితలో నేను ఈ అలంకారాలను, కవిత్వ ఉపకరణాలను పొందుపరుస్తాను, అని ఏ కవీ ముందుగానే అనుకోడు బహుశా. అయితే ఏది మంచి కవిత్వమో తెలిసి, దాన్ని రాసే క్రమంలో అలంకారాలు, కవిత్వ సాధనాలు బలవంతంగా కాకుండా వాటంతట అవే కవిత్వంలో చోటు చేసుకోవటం ఎప్పుడూ ఆహ్వానించదగిన విషయమే.
ఎలనాగ
కవిత్వ సాధనాలుగా అలంకారాలు
- Advertisement -
- Advertisement -